SIR: ‘సార్‌’ని అలా చూపించుంటే ఇంకా బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ

ధనుష్‌ హీరోగా నటించిన ‘సార్‌’ (SIR) మూవీని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషించారు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలకు ధనుష్‌ బాడీ లాంగ్వేజ్‌ సరిపోలేదని అన్నారు.

Published : 31 Mar 2023 21:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ధనుష్‌ (Dhanush) హీరోగా నటించిన తాజా సినిమా ‘సార్‌’ (SIR). ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.  విద్యా వ్యవస్థ నేపథ్యంలో సందేశాత్మక కథగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసింది. ఇప్పుడు ఈ సినిమాని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna) తనదైన శైలిలో విశ్లేషించారు. ‘పరుచూరి పాఠాలు’ (Paruchuri Paatalu)లో భాగంగా ‘సార్‌’ సినిమా గురించి వివరించారు. ‘సార్‌’ సినిమా చూస్తున్నంతసేపూ ఆయన తన జీవిత జ్ఞాపకాల్లోకి వెళ్లినట్లు చెప్పారు. ఆ సినిమాలో విద్యార్థులు అనుభవించిన కష్టాలు.. విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఆయన కూడా అనుభవించినట్లు గుర్తుచేసుకున్నారు.

రచయిత, దర్శకుడు వెంకీ అట్లూరి కొందరి జీవితాల్లోకి పరకాయ ప్రవేశం చేసి ఈ కథను రాశారని పరుచూరి అన్నారు. అద్భుతంగా కథను రచించారని ప్రశంసించారు. పేద విద్యార్థులకు సరైన విద్యా అందడం లేదని చెప్పే ప్రయత్నం చేశారని ఆయన చెప్పారు. ధనుష్‌ను హీరోగా పెట్టి ఇలాంటి కథతో వెంకీ అట్లూరి ఓ సాహసం చేశారని అన్నారు. ఎన్టీ రామారావు, రజనీకాంత్‌, చిరంజీవి ఇలాంటి వాళ్ల సినిమాల్లో గతంలో ఈ పాయింట్‌ను ప్రస్తావించారని గుర్తుచేశారు. పేద విద్యార్థులకు చదువును అందించాలని చూసిన ఓ కథానాయకుడు ఎన్ని ఇబ్బందులు పడ్డాడో చక్కగా చూపించారని పరుచూరి (Paruchuri Gopala Krishna) మెచ్చుకున్నారు.

ఫ్లాష్‌బ్యాక్‌లో చూపించిన కథలాకంటే లైవ్‌లో చూపించినట్లు మార్పు చేసి ఉంటే ఇంకా ఎక్కువ మంది ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. హీరోని గ్రామం నుంచి బహిష్కరించడం వంటి కొన్ని సన్నివేశాల్లో ధనుష్‌ బాడీ లాంగ్వేజ్‌ సరిపోలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే, చాలా సన్నివేశాల్లో థ్రిల్‌ పంచుతూ బాగా నటించారని కితాబిచ్చారు. హీరోకు గురజాడ అప్పారావు గెటప్‌ వేయడం రచయితకు వచ్చిన గొప్ప ఆలోచన అని, అది ఎంతో స్ఫూర్తిమంతమని చెప్పారు. విద్యార్థులకు సినిమా థియేటర్‌లో పాఠాలు చెప్పడమనే కొత్త ఒరవడిని బాగా చూపించారని కితాబిచ్చారు. సుమంత్‌తో కథ చెప్పించడం బాగుందని దర్శకుణ్ని పొగిడారు. హీరోను ఊరి నుంచి వెళ్లిపోమన్నప్పుడు పిల్లలందరూ ఏడుస్తుంటే.. అప్పుడు వాళ్ల తల్లిదండ్రులు హీరోను ఆపుతారేమోనని అనుకున్నానన్నారు. అదే ఊరిలో ఉండి హీరో గెలిచినట్లు చూపిస్తే ఇంకా బాగుండేదని తన మనసులో మాట చెప్పారు. ఆ సినిమా (SIR) చూడని వాళ్లు తప్పక చూడాలని పరుచూరి గోపాలకృష్ణ కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు