Varasudu: ఆ సీన్స్‌ తగ్గించి రష్మిక రోల్‌ పెంచితే బాగుండేది.. ‘వారసుడు’పై పరుచూరి రివ్యూ

విజయ్ (Vijay) హీరోగా నటించిన ‘వారసుడు’ (Varasudu) సినిమాపై రివ్యూ చెప్పారు రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopalakrishna). ఈ సినిమాలో కొన్ని మార్పులు చేసి ఉంటే బాగుండేదన్నారు.

Published : 11 Mar 2023 12:12 IST

హైదరాబాద్‌: విజయ్‌ (Vijay) హీరోగా వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) తెరకెక్కించిన కుటుంబ కథా చిత్రం ‘వారిసు’ (Varisu). తెలుగులో ఇదే చిత్రాన్ని ‘వారసుడు’ (Varasudu) పేరుతో విడుదల చేశారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాపై సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna) రివ్యూ చెప్పారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమవుతోన్న తరుణంలో ఇలాంటి కథతో సినిమా చేసినందుకు చిత్రబృందాన్ని అభినందించారు. సినిమా అంతా బాగుందని.. చిన్న మార్పులు చేసుంటే ఇంకాస్త ఎక్కువగా అలరించేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

‘‘ఇష్టానుసారం వెళ్లిపోయిన ఇద్దరు అన్నయ్యల మనసు మార్చి.. ఒకే తాటిపైకి తీసుకుచ్చిన తమ్ముడి కథే ఈ సినిమా.  ఇదొక ఉమ్మడి కుటుంబ కథా చిత్రం. డబ్బు, ఇమేజ్‌, శ్రమ, సమయం.. ఇలా అన్నింటినీ రిస్క్‌ చేసి వాళ్లు ఈ చిత్రాన్ని రూపొందించారు. అందుకు వాళ్లను మెచ్చుకోవాలి. విజయ్‌ (Vijay) ఫస్ట్‌ షాట్ చూస్తే.. ఒక అద్భుతమైన కథ చూడనున్నామని దర్శకుడు చెప్పేశాడు. ఆ షాట్‌తో హీరోని పరిచయం చేయడమంటే జోక్‌ కాదు. జయసుధ, శరత్‌కుమార్‌, శ్రీకాంత్‌, ప్రకాశ్‌రాజ్‌.. ఇలా కీలక నటీనటులందరూ మనకు తెలిసిన వాళ్లే ఉండటం వల్ల ఇది తెలుగు సినిమానే అనే భావన కలిగింది’’

‘‘ముఖ్యంగా మేనేజింగ్‌ డైరెక్టర్‌ని ఎన్నుకునే సీన్‌లో విజయ్ నటన ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా ఉంది. ఆ షాట్స్‌ మొత్తం.. విజయ్‌ చిత్రాన్ని చూస్తున్నామనే ఫీల్‌ని కలిగించాయి. టెండర్‌ నేపథ్యంలో వచ్చిన సీన్స్‌ ఉత్కంఠగా చిత్రీకరించారు. 2.49 గంటల నిడివిలో.. కేవలం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, కుట్రలు వంటివి ఎక్కువగా చూపించారు. ఆ సన్నివేశాల నిడివిని కాస్త తగ్గించి.. హీరోహీరోయిన్స్‌ మధ్య ప్రేమను ఇంకాస్త ఎక్కువగా చూపిస్తే బాగుండేది. ఎందుకంటే ఈ సినిమాలో హీరోయిన్‌ని కేవలం పాటల కోసమే ఉపయోగించారు’’

‘‘లెవన్త్‌ అవర్‌ విషయానికి వస్తే.. సినిమా చివర్లో ముగ్గురు కొడుకులు కలిసి తండ్రి అస్థికలు నదిలో కలిపినట్లు చూపించారు. ఆ షాట్‌ చూపించకుండా ఉంటే బాగుండేదనిపించింది. దానికి బదులు, తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులందరూ కలిసి సంతోషంగా హీరోహీరోయిన్లకు పెళ్లి చేసినట్లు చూపించి ఉంటే బాగుండేదని నా భావన. ఇంత కష్టపడి హీరో అన్నీ సాధించి.. చివరకు తన తండ్రిని కాపాడలేకపోయాడనే అనవసర విషయం ప్రేక్షకుల మైండ్‌లోకి వెళ్లకుండా చివర్లో.. ‘నాన్న నీకు అంతా సెట్‌ చేశా. అన్నయ్యలతో కలిసి జాగ్రత్తగా చూసుకో. నేను అమెరికా వెళ్తున్నా’ అని చెప్పి వెళ్లిపోయి ఉన్నా మంచిగా అనిపించేది. అలాగే, శ్రీకాంత్‌తో రిలేషన్‌ పెట్టుకున్న ఆ మహిళ ఏమైందనేది మధ్యలో చూపించలేదు’’ అని పరుచూరి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని