Ante sundaraniki: ‘అంటే సుందరానికీ!’ సూపర్‌ హిట్‌ ఎందుకు కాలేదంటే..!

నాని (Nani) నటించిన ‘అంటే సుందరానికీ!’ (Ante Sundaraniki) చిత్రంపై తన అభిప్రాయన్ని వెల్లడించారు ప్రముఖ సినీ.......

Published : 20 Aug 2022 01:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాని (Nani) నటించిన ‘అంటే సుందరానికీ!’ (Ante Sundaraniki) చిత్రంపై తన అభిప్రాయన్ని వెల్లడించారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. ‘పరుచూరి పాఠాలు’ పేరిట ప్రస్తుత సినిమాలపై తన అభిప్రాయాలను పంచుకొంటున్న ఆయన.. తాజాగా ‘అంటే సుందరానికీ!’ చిత్రం ఆశించినంత విజయం సాధించకపోవడానికి కారణాలపై తనదైన శైలిలో విశ్లేషించారు. ‘అంటే సుందరానికీ!’ చిత్రం విషయంలో దర్శకుడు తీసుకున్న పాయింట్ చాలా బాగుందని, స్క్రీన్‌ప్లే  బెడిసికొట్టడం వల్లే  ఈ సినిమా కొంచెం గాడి తప్పిందన్నారు. మతాంతర ప్రేమకథా స్టోరీలైన్‌తో వచ్చిన ఈ సినిమా ఆ పాయింట్‌ను విస్మరించిందని అభిప్రాయపడ్డారు. స్క్రీన్‌ప్లేలో ఫ్లాష్‌ బ్యాక్‌ సీన్‌లు, మలుపులు ఎక్కువయ్యాయని, ఇలాంటి సీన్లు ఎక్కువయితే ప్రేక్షకులు మూడు గంటలపాటు థియేటర్లలో ఉండటానికి ఇష్టపడరని చెప్పారు. కథకు అవసరం లేని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు అంతగా నచ్చవని తెలిపారు.

ఈ సందర్భంగా ఇదే కంటెంట్‌పై వచ్చి విజయం సాధించిన కొన్ని చిత్రాలను ఆయన గుర్తు చేశారు. మూడుగంటల పాటు ప్రేక్షకుల్ని కథలో లీనం చేసేలా స్క్రీన్‌ప్లే ఉండాలన్నారు. అయితే ఈ సినిమాలో నటీనటులు అద్భుతంగా నటించారని పరుచూరి కితాబిచ్చారు. ముఖ్యంగా కథానాయకుడు నాని నటన చాలా సహజంగా ఉంటుందని, ఈ సినిమాలో కూడా బాగా నటించాడని అభినందించారు. క్లైమాక్స్‌తో దర్శకుడు వివేక్‌ ఆత్రేయ(Vivek Athreya) మెప్పించారని, చివరి అరగంట సినిమాను బాగా నడిపించారని పరుచూరి ప్రశంసించారు. మొత్తానికి ఈ సినిమా బాగుంది కానీ.. కొన్ని సన్నివేశాలను మెరుగ్గా తీసి ఉంటే మరింతగా ప్రేక్షకులను ఆకట్టుకునేదని ఆయన అభిప్రాయపడ్డారు.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు