Ravanasura: రావణాసుర.. రవితేజ బాడీ లాంగ్వేజ్‌కు ఇది సరిపోదు: పరుచూరి

రవితేజ (Raviteja) హీరోగా నటించిన ‘రావణాసుర’ (Ravanasura) సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopalakrishna). 

Updated : 06 May 2023 10:35 IST

హైదరాబాద్‌: ‘రావణాసుర’ (Ravanasura).. ఇది రవితేజ (Raviteja) బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే సినిమా కాదని ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopalakrishna) అన్నారు. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన ఆయన సినిమాపై తన అభిప్రాయాన్ని చెప్పారు. సినిమా మాధ్యమం వేదికగా క్రిమినల్‌ పాత్రను ఎక్కువ చేసి చూపించకూడదని.. ఒకవేళ అలా చూపించినా చివరికి అతడికి శిక్ష పడినట్టు చూపించాలని పరుచూరి తెలిపారు.

‘‘రావణాసుర’ చిత్రానికి  మూలం ఒక బెంగాలీ సినిమా అని నాకు తెలిసిన వాళ్లు చెప్పారు. అది నిజమో కాదో నాకు తెలియదు. ఒకవేళ ఇదే కనుక రీమేక్‌ అయితే మూలం పేరుని టైటిల్‌ కార్డుల్లో వేసి ఉంటే బాగుండేది. అదే ధర్మం. కథ క్రెడిట్స్‌ తప్పనిసరిగా రచయితకు దక్కాలి. ఈ ధర్మాన్ని కొంతమంది పాటించరు. దీని వల్ల ఒక రచయితకు అన్యాయం జరుగుతుందనేది మాత్రం నిజం. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక వ్యాధికి వాడే మందు కారణంగా తన తండ్రి మానసిక స్థితి పాడైపోయి.. చెల్లిని చంపేయడం.. అది చూసి తల్లి చనిపోవడం.. చివరికి అనారోగ్యానికి గురైన తండ్రిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. తన కుటుంబం ఇలా కావడానికి కారణమైన ప్రతి ఒక్కరినీ నిర్మూలించే హీరో కథే ‘రావణాసుర’. పగా ప్రతీకారం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కథ ఇది. ఇలాంటి నేపథ్యంలో గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. మంచి విజయాలను అందుకున్నాయి. అయితే ఈ సినిమా మాత్రం అలా కాదు. పగాప్రతీకారం నేపథ్యంలోనే ఈ సినిమా రూపుదిద్దుకున్నప్పటికీ అంతగా ఆడలేదని క్లియర్‌గా తెలిసిపోతుంది.

తన కుటుంబానికి అన్యాయం చేసిన వాళ్లందర్నీ నిర్మూలించే హీరో.. ఇంతే సినిమా. స్క్రీన్‌ప్లే అంతా దానికి అనుగుణంగా సర్దుకుంటూ వెళ్లాడు దర్శకుడు. సినిమా ఓపెనింగ్‌లోనే ఒక ఫైట్‌ ఉంటుంది. అందులో హీరో ఎంతో ఫైట్‌ చేసి ఒక వ్యక్తిని కోర్టులో ప్రవేశపెడతాడు. దానిని చూసిన ప్రేక్షకులు అతడు ధర్మాన్ని కాపాడుతున్నాడని భావించి థియేటర్‌లో ఈలలు వేసి ఉంటారు. కట్‌ చేస్తే.. హీరో తీసుకువచ్చింది అసలు వ్యక్తిని కాదని, వేరే వ్యక్తినని తేలగానే కేసు కొట్టివేస్తారు. అలా, ఫస్ట్‌ సీన్‌లోనే ప్రేక్షకుల నాడీని పట్టుకోవడంలో పట్టు తప్పింది. ఆ సీక్వెన్స్‌ మొత్తం కామెడీగా ఉంటుంది.

1.ఆ సీన్‌ను పరిశీలిస్తే.. అనవసరమైన ఫైట్‌ లిస్ట్‌లోకి ఇది నంబర్‌ 1గా చేరుతుంది.

2. రవితేజ అంటే అద్భుతమైన మాస్‌ మహారాజ్‌ను ఊహించుకుంటాం. ఆయన సినిమా అనగానే డైలాగ్స్‌, ఫైట్స్‌, కామెడీ, నటన.. ఇలా అన్నీ ఉంటాయని నమ్మి ప్రేక్షకులు థియేటర్‌కు వస్తుంటారు. నా దృష్టిలో ఇది రవితేజ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే పాత్ర కాదు.

3. ఈ సినిమాలో కట్స్‌ మరీ ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల ప్రేక్షకుడు ఒక అనుభూతి నుంచి బయటకు వచ్చేసరికి మరో కొత్త అనుభూతి కలుగుతుంది. ఇది ఎంతో ప్రమాదకరం.

4. కట్స్‌తోపాటు మరీ ఎక్కువగా హత్యలకు సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయి. వరుస హత్యలు జరిగినప్పుడు హంతకుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తుంటారు. అలాంటప్పుడు, పోలీసుల నుంచి తనని తాను కాపాడుకోవడం కోసం ఆ హంతకుడు ఒకేలా కాకుండా కొత్త కొత్త కోణాల్లో హత్యలకు పాల్పడుతుంటాడు. ఇలాంటి సన్నివేశాలను మనం గతంలో చూశాం. కానీ ఈ సినిమాలో హత్యలన్నీ ఒకేలా మూస ధోరణిలో చూపించారు.

5. ఈ సినిమా ద్వారా ఒక అనవసరమైన సందేశం ప్రేక్షకుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. అదేమిటంటే.. ఇన్ని హత్యలు చేసినా కూడా తప్పించుకోవచ్చు. ఇప్పటివరకూ వచ్చిన చాలా సినిమాల్లో హత్యలు చేసిన వాళ్లను పోలీసులు చివర్లో పట్టుకున్నట్టే చూపించారు. ఏదో ఒకటి రెండు సినిమాలు మినహా మిగిలిన వాటిల్లో చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతుందనే ధర్మాన్ని చక్కగా చూపించారు. ఈ సినిమాలోని రెండు సన్నివేశాలు కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి. కుటుంబంతో కలిసి చూడటానికి అనువుగా లేవు. సుశాంత్‌- ఆయన ప్రియురాలి పాత్రలను ఇంకాస్త ఎక్కువగా చూపించాల్సింది’’ అని పరుచూరి వివరించారు.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని