Jailer: రజనీకాంత్‌ ‘జైలర్‌’ కథను మరోలా చూపించవచ్చు: పరుచూరి విశ్లేషణ

ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకున్న సినిమా ‘జైలర్’ (Jailer). ఈ సినిమాను మరోలా కూడా తీయొచ్చని రచయిత పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు.

Updated : 23 Sep 2023 10:00 IST

హైదరాబాద్‌: రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నెల్సన్‌ దిలీప్ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జైలర్’ (Jailer). ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుని ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాను ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తాజాగా విశ్లేషించారు. పరుచూరి పాఠాల్లో (Paruchuri Paatalu) భాగంగా ఆయన ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘‘జైలర్‌’లో చూపించినట్లు దేవుడి విగ్రహాలు చోరీ చేయడం గతంలోనూ చాలా చిత్రాల్లో చూపించారు. ఇందులో హీరోను రెండు ఎలివేషన్స్‌ ఉన్న పాత్రగా అద్భుతంగా చూపించారు. రజనీకాంత్‌ను యంగ్‌గా చూడాలని కోరుకునే అభిమానుల కోసం ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ను పెట్టారు. ఇటీవల కాలంలో ఆయన చూపిస్తోన్న మ్యానరిజాన్ని పక్కన పెట్టి.. ఓ కొత్త స్టైల్లో కనిపించారు. సినిమా ప్రారంభంలోనే విగ్రహాలు దొంగతనం చేసే సన్నివేశాన్ని చూపించారు. అంటే అక్కడే ప్రేక్షకుడికి కథకు సంబంధించిన క్లూ ఇచ్చారు’’.

‘‘సినిమాలో తండ్రీ కొడుకుల మధ్య యుద్ధం జరుగుతుందేమోనని ప్రేక్షకులు అనుకుంటారు. కానీ ఇంతలో మనవడిని తెరపైకి తెచ్చి అద్భుతమైన మలుపు తిప్పారు. ‘మేజర్‌ చంద్రకాంత్‌’ సినిమాలో ఎన్టీఆర్‌ పక్కన శారద ఉన్నట్లు ఇందులో రజనీకాంత్‌ (Rajinikanth) కోసం రమ్యకృష్ణను తీసుకున్నారు. రమ్యకృష్ణ పాత్ర విషయంలోనూ దర్శకుడు చాలా జాగ్రత్త పడ్డాడు. ఆ పాత్రలో ఎవరైనా యంగ్‌ హీరోయిన్‌ను తీసుకుంటే ప్రేక్షకుడు రొమాంటిక్‌ సన్నివేశాలు ఊహించుకునే ప్రమాదం ఉంది. అందుకే రమ్యకృష్ణను ఎంపిక చేసుకున్నారు. భార్యాభర్తల మధ్య కూడా కొడుకు విషయంలో మంచి డ్రామా పండేలా చేశారు. రజనీకాంత్‌ గత చిత్రాలు చూస్తే యాక్షన్‌ సన్నివేశాలతో ఆయన వాటిని మరోస్థాయికి తీసుకెళ్లేవారు. అలాంటి ఆయనను కూర్చోబెట్టి కథ నడిపించేలా చేయడం చాలా విచిత్రంగా అనిపించింది’’.

నా సంపాదన.. నా ఖర్చు.. మీకేంటి నొప్పి: మంచు లక్ష్మి ట్వీట్‌

‘‘మనవడి కోసం విలన్లను చంపే సన్నివేశాల్లో ఊహకు అందకుండా జాగ్రత్త పడ్డారు. అవి చూసిన ప్రేక్షకులకు తండ్రీ కొడుకు మధ్య ఘర్షణలు వస్తాయేమోనని ఊహించుకుంటారు. కానీ ప్రేక్షకుల ఊహలకు అందకుండా సినిమాను అద్భుతంగా నడిపించారు. ‘జైలర్‌’ సినిమా అంతా వినోదాత్మకంగా ఉంటుంది. దర్శకుడు అనుకుంటే ఇందులో 20 నిమిషాల భాగాన్ని కట్‌ చేయొచ్చు. కానీ, అలా చేస్తే ప్రేక్షకులకు వినోదం ఉండేది కాదు. స్క్రీన్‌ప్లేను ఇందులో అద్భుతంగా వర్కవుట్‌ చేశారు. కొడుకు చనిపోయాడని ప్రేక్షకులను నమ్మించారు. కొడుకును కాపాడుకోవడం కోసం విలన్‌లకు ఫేక్‌ కిరీటాన్ని ఇచ్చిన తర్వాత సినిమాలో డబుల్‌ ట్విస్ట్‌ను చూపించారు. విలన్ దగ్గర ఉన్న కొడుకును తీసుకొచ్చాక క్లైమాక్స్‌లో ఏం జరుగుతుందన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న’’.

‘‘లెవన్త్‌ అవర్‌లో భాగంగా ఈ సినిమా కథను మరోలా కూడా తీయొచ్చని అనిపించింది. కొడుకు జైలుకు వెళ్లి.. మంచి వాడిగా మారినట్లు కూడా కథ రాసుకోవచ్చు. కానీ, అలా కాకుండా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ ఈ కథను మరోలా రాసుకున్నాడు. దానికి తగిన ప్రతిఫలంగా మంచి ప్రేక్షకాదరణను పొందాడు. ఈ చిత్రం అన్ని భాషల్లో భారీ కలెక్షన్లు సాధించింది. అలాగే అన్ని భాషలకు చెందిన నటులు ఇందులో ఉన్నారు. వారంతా తమ వంతు సహకారాలను అందించారు. రజనీకాంత్‌ మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. రాజకీయాల్లోకి రాకపోవడం ఆయన చేస్తున్న గొప్ప పని. అద్భుతమైన నటుడిగానే ఆయన జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నా’’ అంటూ ‘జైలర్‌’ చిత్రం విజయం సాధించినందుకు చిత్ర బృందానికి పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopalakrishna) అభినందనలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు