Published : 25 Feb 2021 01:29 IST

ఆ మహానటులిద్దరి కాంబినేషన్‌ అద్భుతం: పరుచూరి గోపాలకృష్ణ

ఇంటర్నెట్‌ డెస్క్: తెలుగు చిత్రసీమలో పరుచూరి బ్రదర్స్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. వారిలో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ రచయితగా, నటుడిగా రాణించారు. ఆయన ‘పరుచూరి పలుకులు’ పేరుతో సినిమా విశేషాలతో పాటు, ఆ రోజుల్లో  జరిగిన ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా నాటి ప్రముఖ నటుడు రాజనాల గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.

‘‘ఈ రోజు అలనాటి తారల్లో భాగంగా రాజనాల గారి గురించి చెప్తాను. ఆయనతో జ్ఞాపకాలు చెప్పాలంటే ఒక రాజబాబుగారు, పద్శనాభంగారు ఎలాగైతే చివరిదశలో ఇబ్బంది పడ్డారో అలానే రాజనాల కూడా ఆర్థికంగా ఇబ్బందుల పాలయ్యారు. మేము పాఠశాల చదువు నుంచి డిగ్రీకి వచ్చాక కూడా రాజనాలే  విలన్‌గా నటించేవారు. అప్పుడప్పుడు సత్యనారాయణ విలన్‌గా కొన్ని సినిమాల్లో చేసినా, ముఖ్యంగా జానపద సినిమాల్లో అన్నగారు హీరో అయితే కచ్చితంగా రాజనాలే విలన్‌గా ఉండేవారు. ఎంతో అద్భుతమైన కాంబినేషన్‌ అది. అదే తారాగణంతో ఎన్ని సినిమాలు వచ్చిన బోర్‌ కొట్టేవి కావు. ముఖ్యంగా ‘బందిపోటు’ చిత్రంలో అద్దం ముందు నటించే ఒక సన్నివేశం ఉంటుంది. అన్నగారు అద్దం అవతలివైపు ఉంటే రాజనాలగారు ఇవతలివైపు ఉండి తనే అన్నగారు అనుకుని భ్రమపడుతూ నటించిన విధానం ఎన్నటికీ మరువలేను. అంత అద్భుతంగా రాజనాల చేశారు. ‘బందిపోటు’ చిత్రం ఒక మ్యూజికల్‌ క్లాసిక్‌. ఆ చిత్ర కథను చరిత్ర నుంచి తీసుకుని జానపదంగా మార్చారు. అసలు మూలం ‘గోన గన్నారెడ్డి’ కథ. ఆ చిత్ర రచయిత మహారథి ఇదే కథాంశంతో ‘సింహాసనం’ చిత్రాన్ని రచించారు. అదీ సూపర్‌హిట్టే. ఇటీవల వచ్చిన ‘రుద్రమదేవి’లో  గోన గన్నారెడ్డి కథ చూపించాం. ఇదే కథను బాలయ్యబాబుతో చేయాలని అప్పట్లో ప్రయత్నించాం. రాణి రుద్రమదేవిగా శ్రీదేవి నటిస్తే  బాగుంటుందనుకున్నాం. కానీ  ‘గోనా గన్నారెడ్డి’ రుద్రమదేవి దగ్గర పనిచేస్తాడు. ప్రేక్షకులకు ఇది రుచించదేమోనని ఆ ప్రయత్నం విరమించాం. ‘బందిపోటు’చిత్రంలో ఆ సమస్య రాలేదు. ‘గుండమ్మ కథ’లో కూడా హేమాహేమీలు సినిమా మొదటి నుంచి తమ నటనా పాటవాన్ని ప్రదర్శిస్తే, రాజనాల చివర్లో వచ్చి మొత్తం జనాకర్షణను తనవైపు తిప్పుకునేలా నటించారు. 

అయితే చిత్రపరిశ్రమలోకి మేము వచ్చేటప్పటికి ఆయన సినిమాల్లో నటించడం తగ్గించేశారు. రచయితలుగా ఇండస్ట్రీలో మా బ్రదర్స్‌ హవా నడుస్తున్న కాలంలో ఆయా సినిమాల్లోని పాత్రలకు ఎవరిని సూచిస్తే వారినే చిత్ర నిర్మాణ సంస్థలు ఎంపిక చేసుకునేవి. కానీ దురదృష్టవశాత్తు రాజనాలగారు మా దృష్టిలోకి రాలేదు. ఈ క్రమంలోనే ఆయన మా దగ్గరకు వచ్చి ‘మీరు డైలాగులు ఎలా చెప్పమంటే అలా చెప్తాను. నాకొక వేషం ఇవ్వండి. మా ఇంట్లో పరిస్థితి అంతగా బాగోలేదు’అంటూ కోరారు. ఆయనలా మాట్లాడటంతో మా గుండెలు తరుక్కుపోయాయి. అంతటి మహానటుడు ఇలా అడుగుతుంటే కన్నీళ్లు వచ్చేశాయి. వెంటనే ఆయనకు మేం రాసే సినిమాలో  న్యాయమూర్తి వేషం ఇచ్చాం. ఇప్పుడున్న వారంతా సినీ తారలంటే సర్వసుఖాలు అనుభవిస్తారనుకుంటారు. కానీ, సినీజీవితాలు నీటి బుడగలు లాంటివి. అందుకే ఇండస్ట్రీలో మన హవా నడుస్తునప్పుడే ఒక ఇల్లైనా కట్టుకోవాలి. ఈ విషయంలో మా రచయితలు సత్యానంద్‌, జంధ్యాలగారినే ఫాలో అవుతాం. అలాగే కృష్ణగారితో మేము ‘తెలుగువీర లేవరా’ సినిమా చేస్తునప్పడు రాజనాల గారికి ఒక వేషం ఇప్పించాం. ఎందుకంటే  ఆ పాత్ర ఆయన చేస్తేనే వర్కౌట్‌ అవుతుంది. కృష్ణగారి ‘సీతారామరాజు’చిత్రంలో ఆయన నటించి ఉండటంతో ప్రేక్షకులకు ఆ జ్ఞాపకాలు గుర్తొస్తాయని మా ఉద్దేశం. కానీ, దురదృష్టవశాత్తు అరకులో షూటింగ్‌ చేస్తూ ఉండగా ఆయన కాలికి గాయం అయ్యింది. అలా ఆస్పత్రిలో చేరిన ఆయన కొన్నాళ్లకు గుండెపోటుతో మరణించారనే వార్త తెలిసి ఎంతో బాధపడ్డాం. 
రాజనాలగారి అసలు పేరు ‘రాజనాల కాళేశ్వరరావు’. కల్లయ్య అంటే బాగోదని రాజనాలగా ఉంచేసుకున్నారు. అలాగే ఆర్‌. నాగేశ్వరావుగా పేరొందిన ప్రముఖనటుడు నాగేశ్వరావుగారి ఇంటిపేరు కూడా రాజనాలే. అప్పట్లో విలన్ పాత్రధారులంటే ప్రేక్షకులు భయపడేవారు. రాజనాలగారినైతే చెప్పే పనేలేదు. ఆయన హవా నడుస్తున్న కాలంలో ఒక షూటింగ్‌లో భాగంగా శోభన్‌బాబుగారు డైలాగ్‌ చెప్పడంలో తడబడుతుంటే రాజనాల విసుక్కున్నారంటా. తర్వాత కాలంలో శోభన్‌బాబుగారు ఒక సూపర్‌స్టార్‌ అయ్యారు. రాజనాల గారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కాలంలో శోభన్‌బాబుగారు ఆయన్ను ఇంటికి తీసుకెళ్లి మర్యాద చేసి, తిరిగి ఇంటిదగ్గర దిగబెట్టేటప్పుడు ఒక కవర్‌లో పెద్దమొత్తంలో డబ్బులు పెట్టి రాజనాల చేతిలో ఉంచారట. అందుకే కెరీర్‌ బాగా సాగుతున్నప్పుడే మనం కూడబెట్టుకోవాలి. అప్పుడే చివరిదశలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా హాయిగా బతకొచ్చు. సినీ పరిశ్రమలో ఉండే అందరూ ఈ సూత్రాన్ని కచ్చితంగా పాటిస్తే మేలు . ఏది ఏమైనప్పటికి రాజనాలగారిని ఆ విధంగా కోల్పోవటం చిత్ర పరిశ్రమకు తీరనిలోటు. ఆయన సినిమాలు ఇప్పటి ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంటాయి. రాజనాలగారూ..మిమ్మల్ని ఎన్నటికీ మరువలేము’’

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని