Paruvu Review: రివ్యూ: పరువు.. నివేదా పేతురాజ్‌ నటించిన వెబ్‌సిరీస్‌ ఎలా ఉందంటే?

హీరోయిన్‌ నివేదా పేతురాజ్‌ (Nivetha Pethuraj), నటుడు నరేశ్‌ అగస్త్య (Naresh Agastya), నాగబాబు (Nagababu) ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్‌సిరీస్‌ ‘పరువు’ (paruvu). ‘జీ 5’లో విడుదలైన ఈ సిరీస్‌ రివ్యూ మీకోసం..

Updated : 14 Jun 2024 19:18 IST

వెబ్‌సిరీస్‌: పరువు; నటీనటులు: నరేశ్‌ అగస్త్య, నివేదా పేతురాజ్‌, నాగబాబు, రమేశ్‌, సునీల్‌ కొమ్మిశెట్టి, ప్రణీత పట్నాయక్‌, మొయీన్‌, రాజ్‌కుమార్‌ కసిరెడ్డి, బిందు మాధవి తదితరులు; సంగీతం: శ్రవణ్‌ భరద్వాజ్‌; ఛాయాగ్రహణం: విద్యాసాగర్‌; కూర్పు: విప్లవ్; నిర్మాతలు: సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్‌ లగ్గిశెట్టి; స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌: సిద్ధార్థ్‌ నాయుడు; దర్శకత్వం: సిద్ధార్థ్‌ నాయుడు, రాజశేఖర్‌ వడ్లపాటి; స్ట్రీమింగ్‌ వేదిక: జీ 5.

నివేదా పేతురాజ్‌ (Nivetha Pethuraj), నరేశ్‌ అగస్త్య (Naresh Agastya), నాగబాబు (Nagababu) ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్‌సిరీస్‌ ‘పరువు’ (paruvu). సిద్ధార్థ్‌ నాయుడు, రాజశేఖర్‌ వడ్లపాటి సంయుక్తంగా దర్శకత్వం వహించగా.. సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్‌ నిర్మించారు. ఈ సిరీస్‌ ఓటీటీ ‘జీ 5’ (Zee 5 )లో శుక్రవారం విడుదలైంది. స్టోరీ ఏంటి? ఎలా ఉందంటే?

ఇదీ కథ: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పల్లవి అలియాస్‌ డాలీ (నివేదా పేతురాజ్‌).. తెలంగాణ అబ్బాయి సుధీర్‌ (నరేశ్‌ అగస్త్య)ను ప్రేమించి, పెళ్లి చేసుకుంటుంది. అది పల్లవి కుటుంబానికి నచ్చదు. ఫ్యామిలీతోపాటు బంధువులూ ఆమెను దూరం పెడతారు. హైదరాబాద్‌లో ఉంటున్న పల్లవి తన పెదనాన్న చనిపోయాడన్న వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురవుతుంది. ఆయన్ను కడసారి చూసేందుకు భర్తతో కలిసి గుంటూరు సమీపంలోని సొంతూరికి బయలుదేరుతుంది. తనకు ఇష్టం లేకపోయినా పల్లవి బావ చందు (సునీల్‌ కొమ్మిశెట్టి) వారిని తన కారులో ఎక్కించుకోవాల్సి వస్తుంది. మార్గమధ్యలో చందు.. సుధీర్‌ను తక్కువ చేసి మాట్లాడతాడు. తన భర్తను అవమానించడాన్ని సహించలేని పల్లవి చందుతో వాగ్వాదానికి దిగుతుంది. తమను చంపేందుకే చందు తుపాకీ తెచ్చాడని పల్లవిలో అనుమానం మొదలవుతుంది. మన కోసం కాదని సుధీర్‌ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోకుండా అతడిపై కోపగించుకుంటుంది. ఆ ఆవేశంలో సుధీర్‌.. చందుని రాడ్డుతో కొట్టడంతో చనిపోతాడు. ఆ శవం ఎవరి కంటపడకుండా ఉండాలనే నిర్ణయానికొస్తారు. మరోవైపు, చందుతో పెళ్లి నిశ్చయమైన స్వాతి (ప్రణీత పట్నాయక్‌) అతడు కనిపించడం లేదంటూ తెలిసిన వారందరికీ ఫోన్‌ చేస్తుంది. ఎమ్మెల్యే రామయ్య (నాగబాబు) తనకు కాబోయేవాడిని కిడ్నాప్‌ చేయించి ఉంటాడని ఆరోపిస్తుంది. మరి, రామయ్యకు చందుకు ఉన్న సంబంధమేంటి? చందు హైదరాబాద్‌ వెళ్లడానికి కారణమేంటి? ఎవరిని చంపేందుకు తుపాకీ తీసుకున్నాడు? పెదనాన్న చివరి చూపు కోసం వచ్చిన పల్లవికి ఎలాంటి అవమానాలు ఎదురయ్యాయి? చందు డెడ్‌ బాడీని ఏం చేశారు? ఈ వ్యవహారంలో పోలీసులు చక్రవర్తి (రాజ్‌కుమార్‌ కసిరెడ్డి), బాబ్జీ (మొయీన్‌)ల పాత్రలేంటి? తదితర ప్రశ్నలన్నింటికీ సిరీస్‌ చూసి సమాధానం తెలుసుకోవాల్సిందే (Paruvu Review).

ఎలా ఉందంటే?: ఈ సిరీస్‌ ప్రధానాంశమేంటో టైటిల్‌ని బట్టి చెప్పొచ్చు. పరువు హత్యల నేపథ్యంలో రూపొంది ఉంటుందని ప్రచార చిత్రాలను చూసి గెస్‌ చేయొచ్చు. థీమ్‌ అదే అయినా ఓ శవాన్ని ఎవరి కంటపడకుండా భార్యాభర్తలు ఏం చేశారన్నది మెయిన్‌ ప్లాట్‌గా చూపించారు. పరువు హత్య సబ్‌ప్లాట్‌గా ఉంటుంది. ఓ వైపు పల్లవి- సుధీర్‌ జోడీ ఊరికి పయనమవడం, మరోవైపు ఇంకో జంట ఇంటినుంచి పారిపోయే సన్నివేశాలతో సిరీస్‌ ప్రారంభమవుతుంది. వర్తమానం, గతంలో జరిగిన సీన్స్‌ను వెంటవెంటనే చూపించడంతో ప్రేక్షకుడిలో కొంత కన్‌ఫ్యూజన్‌ క్రియేట్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది. ఎనిమిది ఎపిసోడ్లతో ఈ సిరీస్‌ రూపొందింది. ఒక్కో ఎపిసోడ్‌ నిడివి 40 నిమిషాలపైనే. పల్లవి- సుధీర్‌లను హైలైట్‌ చేస్తూ కథను నడిపించారు. చందును సుధీర్‌ హత్య చేసినప్పటినుంచి సిరీస్‌ మరింత వేగంగా సాగుతుంది. శవం కనిపించకుండా ఉండేందుకు వారిద్దరూ వేసే ప్లాన్‌లు ఆకట్టుకుంటాయి. కానీ, కొన్ని ప్రేక్షకుడి ఊహకు తగ్గవే (Paruvu Review in Telugu).

ముందుకెళ్లేకొద్దీ మరిన్ని లేయర్స్‌, కొత్త పాత్రలు ఎదురవుతాయి. పల్లవి బంధువుల క్యారెక్టర్లు కొన్ని సీరియల్స్‌ను తలపిస్తాయి. చందు ఆచూకీ అన్వేషించే క్రమంలో స్వాతి.. ఎమ్మెల్యే రామయ్యను బ్లాక్‌ మెయిల్‌ చేయడం, పోలీసులు చక్రవర్తి, బాబ్జీల మధ్య వైరం, రామయ్యకు మరో పొలిటికల్‌ లీడర్‌ సుభాషానికి మధ్య రాజకీయ విభేదం.. వీటన్నింటినీ ఓ ఘటనకు లింక్‌ చేసిన తీరు థ్రిల్‌ పంచుతుంది. ‘ప్రతిపక్షం అంటే చర్యకు ప్రతిచర్య చేయడం కాదు.. ప్రత్యామ్నాయం చూపడం’ వంటి సంభాషణలు ఆలోచింపజేస్తాయి. ప్రేక్షకుడి ఊహకు భిన్నంగా క్లైమాక్స్‌ ఉంటుంది. ఓ ప్రత్యేక పాత్ర ద్వారా సీజన్‌ 2 ఉందని మేకర్స్‌ హింట్‌ ఇచ్చారు (Paruvu Web Series Review).

ఎవరెలా చేశారంటే?: ‘సేనాపతి’తో తనేంటో నిరూపించుకొన్న నరేశ్‌ అగస్త్య ‘పరువు’లోనూ అంతే సెటిల్డ్‌గా నటించి, ఆకట్టుకున్నారు. అభినయానికి అధిక ప్రాధాన్యం ఉన్న పాత్రలో నివేదా ఒదిగిపోయారు. నాగబాబు పవర్‌ఫుల్‌ రోల్‌ నిడివి ఇంకాస్త ఉంటే బాగుండేది. సునీల్‌, ప్రణీత పట్నాయక్‌, రాజ్‌కుమార్‌ కసిరెడ్డి, మొయీన్‌ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. బిందు మాధవి పాత్రకు సీజన్‌ 2లో అధిక ప్రాధాన్యం ఉండనుంది. నేపథ్యం సంగీతం, ఛాయాగ్రహణం, ఎడిటింగ్‌.. ఇలా అన్ని విభాగాల పనితీరు బాగుంది. సిద్ధార్థ్‌ నాయుడు మాటలు, స్క్రీన్‌ప్లే ఆకట్టుకుంటాయి.  సున్నితమైన అంశాన్ని ఎంగేజింగ్‌గా చెప్పడంలో సిద్ధార్థ్‌, రాజశేఖర్‌ మంచి మార్కులు కొట్టేశారు. నిర్మాణ విలువలు ఓకే.

కుటుంబంతో కలిసి చూడొచ్చా?: అసభ్యకర సన్నివేశాలు లేవు గానీ ఆ తరహా సంభాషణలు ఎక్కువగా ఉన్నాయి. పాత్రల డిమాండ్‌ మేరకే బూతులు వాడాల్సివచ్చిందని రచయితలు ఓ ఈవెంట్‌లో ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు. కొంతవరకే అయితే ఓకేగానీ దాదాపు పాత్రలన్నింటినీ ఆ తరహాలోనే క్రియేట్‌ చేశారు. ఈ సిరీస్‌ విషయంలో ఇదొక మైనస్‌. ఫ్యామిలీతో కలిసి చూడకపోవడమే బెటర్‌.

  • బలాలు
  • + కథ, కథనం
  • + నరేశ్‌ అగస్త్య, నివేదా నటన
  • బలహీనతలు
  • -  అసభ్యకర సంభాషణలు
  • - కొన్ని సీన్స్‌లో స్పష్టత లోపించడం
  • చివరిగా:  థ్రిల్‌ పంచే ‘పరువు’ (Paruvu Review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని