Virupaksha: విరూపాక్షలో విలన్‌ సంయుక్త కాదట.. ఆసక్తికర విషయాన్ని చెప్పిన దర్శకుడు

Virupaksha: సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటించిన విరూపాక్ష సినిమాలో విలన్‌ పాత్ర గురించి దర్శకుడు కార్తీక్‌ దండు ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

Updated : 25 May 2023 19:04 IST

హైదరాబాద్‌: ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘విరూపాక్ష’ (virupaksha). సాయిధరమ్‌తేజ్‌ (Sai dharam tej) కథానాయకుడిగా కార్తీక్‌ దండు తెరకెక్కించిన ఈ మిస్టరీ థ్రిల్లర్‌ విమర్శకులను సైతం మెప్పించింది. ఇక కథానాయిక సంయుక్త నటనను అందరూ మెచ్చుకున్నారు. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే, తాజాగా ఈసినిమా గురించి ఓ ఆసక్తికర విషయాన్ని దర్శకుడు కార్తీక్‌ వెల్లడించారు. తొలుత తాను రాసుకున్న స్క్రిప్ట్‌ ప్రకారం పార్వతి (యాంకర్‌ శ్యామల)ని విలన్‌గా చూపించాలనుకున్నారు. ఊళ్లో జరిగే అన్ని ఉపద్రవాలకు ఆమె కారణం అని చెప్పాలనుకున్నారట. అయితే, ఈ సినిమాకు అగ్ర దర్శకుడు సుకుమార్‌ స్క్రీన్‌ప్లే అందించిన సంగతి తెలిసిందే. ఆయన సూచన మేరకు పార్వతి పాత్రను కాదని, నందిని పాత్రను విలన్‌గా చూపించి ట్విస్ట్‌ ఇచ్చారు. 

‘నేను అనుకున్న కథలో పార్వతి (శ్యామల) అసలు కుట్రదారు. ఇదే విషయాన్ని సుకుమార్‌ సర్‌కి చెప్పా. ఆయన మాత్రం ‘అది అంత ఇంపాక్ట్‌ ఇవ్వదు. క్లైమాక్స్‌ బ్లాస్ట్‌ అవ్వాలి. హీరోయిన్‌ను విలన్‌గా మార్చు’ అని చెప్పారు. దాంతో స్క్రీన్‌ప్లే మొత్తం మారిపోయింది. కొత్త సన్నివేశాలను రాసుకున్నాం’’ అని కార్తీక్‌ చెప్పుకొచ్చారు. ఏప్రిల్‌ 21న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. సాయిధరమ్‌ తేజ్‌ కెరీర్‌లో రూ.100కోట్ల వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని