Pathaan: ‘పఠాన్‌’ @ రూ.1000 కోట్లు.. ఈ ఘనత సాధించిన ఐదు చిత్రాలివే!

Pathaan: షారుఖ్‌ఖాన్‌ కథానాయకుడిగా నటించిన ‘పఠాన్‌’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.1000కోట్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది.

Updated : 21 Feb 2023 19:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సుదీర్ఘ విరామం తర్వాత బాక్సాఫీస్‌ను పలకరించిన బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌ (Shah Rukh Khan) రికార్డులు బద్దలుకొడుతున్నాడు. ఆయన కథానాయకుడిగా సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన  యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పఠాన్‌’. దీపిక పదుకొణె (Deepika Padukone) కథానాయిక. జాన్‌ అబ్రహాం ప్రతినాయకుడిగా నటించారు. జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా నెలరోజుల్లోనే రూ.1000 కోట్లు (గ్రాస్‌) (pathan collection in india) వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. అంతేకాదు, 28వ రోజు హిందీలో రూ.500 కోట్లు (నెట్‌) వసూలు చేసిన తొలి హిందీ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇక తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ ఇప్పటి వరకూ రూ.17.97 కోట్లు (గ్రాస్‌) వసూలు చేయగా, హిందీతో కలిపి రూ.516.92 కోట్లు కలెక్ట్‌ చేసినట్లు సినీ విశ్లేషకుడు తరుణ్‌ ఆదర్శ్‌ తెలిపారు.

ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.1000కోట్లకు పైగా వసూళ్లను సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ తెలిపింది. భారత్‌లో రూ.623 కోట్లు (గ్రాస్‌), ఓవర్సీస్‌లో రూ.377 కోట్లు (గ్రాస్‌) కలిపి కరోనా తర్వాత రూ.1000 కోట్లు వసూలు చేసిన హిందీ సినిమాగా నిలిచింది. భారత బాక్సాఫీస్‌ వద్ద ఇప్పటివరకూ ఐదు చిత్రాలు మాత్రమే రూ.1000 కోట్ల మార్కును అందుకున్నాయి. ఆమిర్‌ఖాన్‌ ‘దంగల్‌’ (చైనా వసూళ్లతో కలిపి రూ.2000 కోట్లు) ఈ జాబితాలో ఇప్పటికీ టాప్‌లో కొనసాగుతోంది. ఆ తర్వాత రాజమౌళి-ప్రభాస్‌ ‘బాహుబలి2’, ప్రశాంత్‌ నీల్‌-యశ్‌ ‘కేజీయఫ్‌2’ చిత్రాలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. నాలుగో స్థానంలో రాజమౌళి దర్శకత్వంలోనే వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఉండటం విశేషం. ఇప్పుడు ‘పఠాన్‌’ రూ.1000కోట్ల వసూళ్లతో ఐదో స్థానంలో నిలిచింది.

విడుదలకు ముందే ‘పఠాన్‌’ను ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. బాలీవుడ్‌ బాయ్‌కాట్‌ ట్రెండ్‌ ఒకవైపు, ‘బేషరమ్‌’ సాంగ్‌లో దీపిక వస్త్రధారణపై విమర్శలు అసలు ఈ మూవీ బాక్సాఫీస్‌ ముందు నిలుస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, వాటన్నింటనీ పటాపంచలు చేస్తూ ‘పఠాన్‌’ కాసుల వర్షాన్ని కురిపించడం గమనార్హం. కథ, కథానాలు అలరించేలా ఉంటే ప్రేక్షకులు అక్కున చేర్చుకుంటారని షారుఖ్‌ మూవీ మరోసారి నిరూపించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు