Pathaan: ఆ మూడు విషయాల్లో ‘పఠాన్‌’ రికార్డు.. అలా ఫస్ట్‌ ఇండియన్‌ ఫిల్మ్‌గా!

ఎప్పుడెప్పుడొస్తుందా? అని షారుఖ్‌ ఖాన్‌ అభిమానులంతా ఎదురుచూసిన ‘పఠాన్‌’ సినిమా కొన్ని గంటల్లో తెరపైకి రాబోతుంది. ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలపై ఓ లుక్కేద్దాం..

Updated : 24 Jan 2023 13:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటులు షారుఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan), దీపికా పదుకొణె (Deepika Padukone) జంటగా నటించిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌  చిత్రం ‘పఠాన్‌’ (Pathaan).  ఈ సినిమా జనవరి 25న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఆ మూవీ విశేషాలు చూద్దాం..

⏩ హీరోగా షారుఖ్‌ ఖాన్‌ తెరపై కనిపించి నాలుగేళ్లపైనే అయింది. ఆ గ్యాప్‌ తర్వాత ఆయన ప్రకటించిన చిత్రం కావడంతో ‘పఠాన్‌’పై ముందు నుంచీ ఆసక్తి నెలకొంది. ఇందులో ఆయన ‘రా’ ఏజెంట్‌గా నటించారు. కథానాయకుడిగా షారుఖ్‌ కనిపించిన చివరి చిత్రం ‘జీరో’. 2018 డిసెంబరులో విడుదలైంది. 2022లో.. ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’, ‘లాల్‌ సింగ్‌ చడ్డా’, ‘బ్రహ్మాస్త్ర’ సినిమాల్లో అతిథి పాత్రల్లో కనిపించి, అలరించారు షారుఖ్‌.

⏩ కథానాయికగా దీపికా పదుకొణె ఎంపికైందని తెలిసినప్పటి నుంచే సినీ ప్రియులు ఈ మూవీపై ప్రత్యేక దృష్టిపెట్టారు. షారుఖ్‌, దీపికల కాంబినేషన్‌లో గతంలో వచ్చిన పలు చిత్రాలు సూపర్‌హిట్‌గా నిలవడమే అందుకు కారణం. ఇప్పటి వరకు ‘ఓం శాంతి ఓం’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’, ‘హ్యాపీ న్యూ ఇయర్‌’ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుందీ జోడీ.

⏩ ప్రముఖ నటుడు జాన్‌ అబ్రహాం (John Abraham) ఈ సినిమాలో భాగమయ్యారు. ఇందులో ఆయన జిమ్‌ కార్టస్‌ అనే విలన్‌ పాత్రలో కనిపిస్తారు. షారుఖ్‌ గతంలో నటించిన ‘కభీ అల్విదా నా కెహనా’ సినిమాలోని ఓ పాటలో జాన్‌ అబ్రహాం తళుక్కున మెరిసిన సంగతి తెలిసిందే. ‘పఠాన్‌’లో అశుతోశ్‌ రానా, డింపుల్‌ కపాడియా, గేవీ చాహల్‌ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ప్రముఖ హీరో సల్మాన్‌ఖాన్‌ గెస్ట్‌ రోల్‌లో కనిపించనున్నారు.

🎥 ఈ సినిమాలోని కొన్ని పోరాట దృశ్యాలను దుబాయ్‌లో చిత్రీకరించారు. మరికొన్ని యాక్షన్‌ ఘట్టాలను స్పెయిన్‌లో షూట్‌ చేశారు. మిగిలిన పోర్షన్‌ను ఇండియా, అఫ్గానిస్తాన్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, టర్కీ, రష్యా, ఇటలీ తదితర దేశాల్లో చిత్రీకరించారు. ఈ సినిమా బడ్జెట్‌ సుమారు రూ. 250 కోట్లు.

🎥 సినిమాకే హైలైట్‌గా నిలిచే ఛేజింగ్‌ సన్నివేశాలను సైబీరియా (రష్యా)లోని గడ్డకట్టిన బైకల్‌ సరస్సులో తీశారు. అక్కడ చిత్రీకరించిన తొలి బాలీవుడ్‌ సినిమాగా ‘పఠాన్‌’ నిలిచినట్టైంది. ఎముకలు కొరికే చలిలో బైకల్‌లో షూటింగ్‌ చేయడం సాహసంతో కూడుకున్నదని, ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచేందుకు కష్టాన్ని భరించామని దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ (Siddharth Anand) ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

🎥 ఐమ్యాక్స్‌ కెమెరాలతో చిత్రీకరించిన తొలి హిందీ చిత్రంగానూ ‘పఠాన్‌’ నిలిచింది. ఇతర కెమెరాలకంటే ఐమ్యాక్స్‌ కెమెరాల ఫిల్మ్‌ సైజు చాలా పెద్దగా ఉంటుంది. హై ఎండ్‌ రిజల్యూషన్‌ కలిగి ఉండి, భారీ ధర పలికే ఆ కెమెరాల సంఖ్య ప్రపంచంలోనే చాలా తక్కువ. మరోవైపు, ఐ. సి. ఇ థియేటర్‌ ఫార్మాట్‌లో విడుదలకాబోతున్న ఫస్ట్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఇదే కానుంది. ఐ. సి. ఇ పూర్తి పేరు ఇమ్మెర్సివ్‌ సినిమా ఎక్స్‌పీరియన్స్‌ (Immersive Cinema Experience). ఈ ఫార్మాట్‌ కలిగిన తెరలు ఇండియాలో రెండే (దిల్లీ) ఉన్నాయని సమాచారం. వీటిల్లో సినిమా ప్రదర్శితమయ్యే పెద్ద తెర (ICE Theaters)తోపాటు థియేటర్‌ గోడలకు ఇరువైపులా చిన్న స్క్రీన్‌లు అమర్చి ఉంటాయి. బిగ్‌ స్క్రీన్‌పై వచ్చే సన్నివేశాల్లోని రంగులు ఆ స్మాల్‌ స్క్రీన్‌పై ఫ్లాష్‌ అవుతూ ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచుతాయి. ఈ విధానంలో ఆడియో కూడా అద్భుతంగా ఉంటుంది.

🎼 విశాల్‌- శేఖర్‌ సంగీత సారథ్యంలో వచ్చిన ఈ చిత్రంలోని ‘బేషరమ్‌ రంగ్‌’ (Besharam Rang) గీతం శ్రోతల్ని విశేషంగా ఆకట్టుకుంది. మరోవైపు, తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఆ పాటలో కనిపించే కథానాయిక బికినీ రంగు (గోల్డెన్‌ స్విమ్‌సూట్‌)ను తప్పుబడుతూ పలువురు రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అది కాస్తా సినిమాను బ్యాన్‌ చేయాలనేంత వరకు వెళ్లింది. దాంతో, ఈ సినిమా టైటిల్‌ సోషల్‌ మీడియాలో కొన్ని రోజులు ట్రెండ్‌ అయింది.

🎬 సంబంధిత పాటలోని పలు విజువల్స్‌, కొన్ని సంభాషణలపై అభ్యంతరం తెలిపి, వాటిని కట్‌ చెప్పిన అనంతరం సెన్సార్‌ బోర్డు ‘పఠాన్‌’కు యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేసింది. సినిమా నిడివి: 146.16 నిమిషాలు (2గంటలా 26 నిమిషాల 16 సెకన్లు).

🎞️ ఈ సినిమా కథ విషయాకొస్తే.. ఔట్‌ఫిట్‌ ఎక్స్‌ అనే ప్రైవేట్‌ ఉగ్రవాద సంస్థ ఒకానొక సమయంలో ఇండియాను లక్ష్యంగా చేసుకుంటుంది. దానికి నాయకుడు జిమ్‌ (జాన్‌ అబ్రహాం). ఆ టెర్రరిస్టులను మట్టికరిపించేందుకు ‘రా’ ఏజెంట్‌ అయిన పఠాన్‌ (షారుఖ్‌) రంగంలోకి దిగుతాడు.. అనేది ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. మరి, ఆ ఆపరేషన్‌ ఎలా ఉంటుంది అన్నది తెరపై చూడాల్సిందే. ఈ సినిమా హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లోనూ రిలీజ్‌కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని