Pathaan: ‘బాహుబలి2’ రికార్డు బద్దలైంది.. టాప్‌-1లో షారుఖ్‌ ‘పఠాన్’!

Pathaan: షారుఖ్‌, దీపిక పదుకొణె జంటగా నటించిన ‘పఠాన్’ మూవీ హిందీలో ‘బాహుబలి2’ వసూళ్ల రికార్డును బద్దలు కొట్టింది.

Published : 04 Mar 2023 15:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: షారుఖ్‌ఖాన్‌ (Shah Rukh Khan) కథానాయకుడిగా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పఠాన్‌’ (Pathaan). జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పటికే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1000కోట్లకు పైగా వసూళ్లను రాబట్టగా, మరో సరికొత్త రికార్డును సృష్టించింది. హిందీ భాషలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రాజమౌళి-ప్రభాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘బాహుబలి2’ (baahubali 2 the conclusion) పేరిట ఉన్న రికార్డును ‘పఠాన్‌’ బద్దలు కొట్టింది. అంతేకాదు, హిందీలో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా టాప్‌-1లో నిలిచింది.

విడుదలైన నెలరోజుల్లోనే అన్ని భాషల్లోనూ కలిపి ‘పఠాన్‌’ రూ.1000 కోట్లు (గ్రాస్‌) (pathan collection in india) వసూలు చేసింది. తాజాగా హిందీలో రూ.511.70 కోట్లు (నెట్‌) వసూలు చేసి, ‘బాహుబలి2’ పేరిట ఉన్న అత్యధిక వసూళ్ల రికార్డును (రూ.510.99 కోట్లు)ను దాటేసింది. ఇక ‘బాహుబలి2’ తర్వాత ప్రశాంత్‌నీల్‌-యశ్‌ల ‘కేజీయఫ్‌2’ (రూ.434.70 కోట్లు), నితీష్‌ తివారి- ఆమిర్‌ఖాన్‌ల దంగల్‌ (రూ.374.43 కోట్లు) రాజ్‌కుమార్‌ హిరాణీ- రణ్‌బీర్‌కపూర్‌ల సంజూ (రూ.342.53 కోట్లు) చిత్రాలు ఉన్నాయి. ఇక ఆరో వారానికి ‘పఠాన్‌’ తమిళ్‌, తెలుగు భాషల్లో రూ.18.26కోట్లు వసూలు చేయగా, మొత్తం హిందీతో కలిపి రూ.529.96 కోట్లు(నెట్‌) వసూళ్లు రాబట్టింది. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపిక పదుకొణె (Deepika Padukone) కథానాయిక. జాన్‌ అబ్రహాం ప్రతినాయకుడిగా నటించారు. మరోవైపు ప్రేక్షకులను థియేటర్‌ వైపు అడుగులు వేయించేందుకు ‘పఠాన్‌’ చిత్ర బృందం వినూత్న ప్రచార కార్యక్రమాలు చేపడుతోంది. టికెట్‌ ధరల్లో రాయితీ, ఒకటి కొంటే, మరొకటి ఉచితం తదితర ఆఫర్లను ప్రకటిస్తోంది. ‘పఠాన్‌’పై ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు చిత్ర దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌, షారుఖ్ సతీమణి గౌరీఖాన్‌లు ఆనందం వ్యక్తం చేశారు. సోషల్‌మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.

ఓటీటీలో అప్పుడేనా?

ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబడుతున్న ‘పఠాన్‌’ ఓటీటీలో ఎప్పుడొస్తుందా? (pathan ott release date) అని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (Amazon Prime Video) దక్కించుకుంది. సినీ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా ఏప్రిల్‌ చివరిలో ‘పఠాన్‌’ స్ట్రీమింగ్‌ కానున్నట్లు సమాచారం. ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. ప్రస్తుతం థియేటర్‌లో మంచి వసూళ్లు రాబడుతున్న నేపథ్యంలో ఓటీటీ స్ట్రీమింగ్‌ విషయంలో చిత్ర బృందం ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంది.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు