Pavitra Lokesh: నరేశ్‌లో నచ్చిన విషయం అదే!

సమాజానికి అద్దం పట్టే కథతో ‘మళ్ళీ పెళ్లి’ చిత్రం తెరకెక్కిందన్నారు నటి పవిత్ర లోకేశ్‌. ఒకరిని లక్ష్యంగా చేసుకుని తీసిన సినిమా కాదిది అంటున్నారామె.

Updated : 24 May 2023 14:56 IST

సమాజానికి అద్దం పట్టే కథతో ‘మళ్ళీ పెళ్లి’ (Malli Pelli) చిత్రం తెరకెక్కిందన్నారు నటి పవిత్ర లోకేశ్‌ (Pavitra Lokesh). ఒకరిని లక్ష్యంగా చేసుకుని తీసిన సినిమా కాదిది అంటున్నారామె. సహాయ నటిగా ప్రేక్షకులకు సుపరిచితమైన పవిత్ర... ప్రముఖ నటుడు నరేశ్‌.వి.కెతో కలిసి ఇటీవల చేసిన చిత్రమే ‘మళ్ళీ పెళ్లి’. వైవాహిక బంధంతో జీవితాన్ని పంచుకునే ప్రయత్నంలో ఉన్న ఆ ఇద్దరూ కలిసి ఈ సినిమా చేయడం... ఇది వీరి జీవితాల్లో జరిగిన సంఘటనల్ని ప్రతిబింబించడం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎం.ఎస్‌.రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా పవిత్ర మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.
‘‘కథానాయికగా నటించడం నాకు కొత్త కాదు. కెరీర్‌ ఆరంభంలోనే కథానాయికగా అవకాశాలు అందుకున్నా. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. నాకు వచ్చిన, నచ్చిన పాత్రలు చేస్తూ వచ్చా. ఇన్నాళ్ల తర్వాత ఈ సినిమాతో ప్రధాన పాత్ర పోషించే అవకాశం లభించింది. నన్ను, నరేశ్‌ని దృష్టిలో ఉంచుకునే ఎం.ఎస్‌.రాజు ఈ కథ సిద్ధం చేశారు. మీరిద్దరూ కలిసి చేస్తేనే బాగుంటుందంటూ ఆయన ఈ కథ చెప్పారు. అప్పుడే చేయాలని నిర్ణయించాం. మా ఇద్దరి బయోపిక్‌ కాదు ఈ చిత్రం. బయోపిక్‌ అనేది చాలా పెద్ద మాట. సమాజంలో మనకు కనిపించే కొన్ని పరిస్థితులు, కొన్ని ఆలోచనల్ని మేళవించిన కథ ఇది. తప్పకుండా ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతారు’’.

* ‘‘ఇది కల్పిత కథా, యథార్థ కథా అనేది చెప్పలేను. చాలా మంది నాదీ, నరేశ్‌ జీవితాలకి సంబంధించిన కథ అనుకుంటున్నారు. ఎలా అనుకున్నా ఫర్వాలేదు. సినిమా చూశాక ప్రేక్షకులకే ఓ స్పష్టత వస్తుంది. మంచి సంగీతం, హాస్యంతోపాటు, బలమైన భావోద్వేగాలతో సినిమా రూపుదిద్దుకుంది. సినిమా చూస్తున్నప్పుడు అసలు ద్వితీయార్ధం ఎలా అయిపోయిందో అర్థం కాలేదు. అంతగా కథలో లీనం చేస్తుంది చిత్రం. సమాజంలో కొన్ని నియయాలు ఉంటాయి. వాటిని దాటినప్పుడు ధైర్యంగా అడుగేశారని, సాహసోపేతమైన నిర్ణయం అనే మాటలు వినిపిస్తాయి. ఆ రకమైన విషయాల్ని ఈ సినిమాలో చర్చించారు దర్శకుడు. అవన్నీ ప్రేక్షకుల్ని మెప్పిస్తాయి’’.

* ‘‘నరేశ్‌ ఎంత సీరియస్‌ విషయమైనా సరే తేలిగ్గా తీసుకుంటారు. దాన్నుంచి బయట పడేందుకు సీరియస్‌గా పనిచేస్తారు. నాదేమో చిన్న చిన్న విషయాల్ని కూడా  సీరియస్‌గా తీసుకునే మనస్తత్వం. ఈ రోజు గురించే ఆలోచిద్దాం అంటారు నరేశ్‌. అదే ఆయనలో నాకు బాగా నచ్చిన అంశం. అన్నిటికంటే కూడా నన్ను జాగ్రత్తగా చూసుకుంటారు. ఒక మహిళకి ఇంతకంటే ఏం కావాలి? నాకూ, నరేశ్‌కీ మధ్య బంధాన్ని కుటుంబం అంగీకరించింది. మా విషయంలో కొన్ని సంఘటనలు జరిగాయి. కొంతమంది నా వ్యక్తిత్వాన్ని హననం చేసి, నా కెరీర్‌పై ముద్ర వేసే ప్రయత్నం చేశారు. దీన్నుంచి బయటికి వచ్చానంటే నరేశ్‌ నా వెనక బలంగా నిలవడంతోనే. సినిమా, వ్యక్తిగత జీవితాల్ని సమన్వయం చేసుకోవడం నాకు అలవాటే. నరేశ్‌నీ, మా అమ్మనీ చూసుకుంటూ ఇకపైన కూడా సినిమాల్లో నటిస్తా.  భవిష్యత్తులో  విజయకృష్ణ మూవీస్‌ సంస్థని నిలబెట్టే విషయంలో నా భాగస్వామ్యం ఎప్పుడూ ఉంటుంది’’.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు