Updated : 25 Feb 2022 10:29 IST

Bheemla Nayak Review: రివ్యూ: భీమ్లా నాయక్‌

చిత్రం: భీమ్లా నాయక్‌; నటీనటులు: పవన్‌కల్యాణ్‌, రానా, నిత్యామేనన్‌, సంయుక్త మేనన్‌, సముద్రఖని, మురళీశర్మ, రావు రమేశ్‌ తదితరులు; సంగీతం: తమన్‌, సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి; స్క్రీన్‌ప్లే, సంభాషణలు: త్రివిక్రమ్‌, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ; దర్శకత్వం: సాగర్‌ కె.చంద్ర; విడుదల: 25-02-2022

తర హీరోలకు భిన్నమైన స్టామినా కలిగిన హీరో పవన్‌కల్యాణ్‌(Pawan kalyan). ఆయన సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. గతేడాది ‘వకీల్‌సాబ్‌’తో బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన పవన్‌ ఈ ఏడాది ‘భీమ్లానాయక్‌’(Bheemla Nayak) అంటూ ముందుకు వచ్చారు. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ చిత్రం రీమేక్‌ చేస్తున్నారంటే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకు పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan)పేరు ప్రకటించగానే అవి రెట్టింపు అయ్యాయి. దీనికి తోడు రానా(rana) మరో కీలక పాత్రలో నటించడం కూడా సినిమాకు హైప్‌ తీసుకొచ్చింది. మరి ‘భీమ్లా నాయక్‌’ కథేంటి? యువ దర్శకుడు సాగర్‌ కె.చంద్ర.. పవన్‌ను ఎలా చూపించారు? త్రివిక్రమ్‌ మెరుపులు ఏంటి?

కథేంటంటే: భీమ్లా నాయక్‌(పవన్‌కల్యాణ్‌)(Pawan kalyan) కర్నూలు జిల్లా హఠకేశ్వర్‌ మండలం పోలీస్‌ స్టేషన్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌. నిజాయతీ కలిగిన అధికారి. డానియల్‌ శేఖర్‌(రానా)(Rana) ఆర్మీలో పనిచేసి రిటైర్‌ అవుతాడు. రాజకీయంగా పలుకుబడి కలిగిన కుటుంబానికి చెందిన వ్యక్తి. ఒక రోజు రాత్రి కారులో మద్యం సీసాలతో అడవిగుండా వెళ్తూ అక్కడ తనిఖీలు చేస్తున్న పోలీసులకు చిక్కుతాడు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో అక్కడే డ్యూటీలో ఉన్న భీమ్లానాయక్‌.. డానియల్‌ను కొట్టి స్టేషన్‌కు తీసుకెళ్తాడు. దీంతో అతడి అహం దెబ్బతింటుంది. భీమ్లానాయక్‌ను ఎలాగైనా దెబ్బ కొట్టాలని భావిస్తాడు. అందుకు డానియల్‌ శేఖర్‌ ఏం చేశాడు? భీమ్లానాయక్‌ ఉద్యోగం ఎందుకు పోయింది? ఒకరినొకరు చంపుకొనేంత వరకూ దారితీసిన పరిస్థితులు ఏంటి? ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!(Bheemla Nayak Review)

ఎలా ఉందంటే: ఇద్దరు బలమైన వ్యక్తులు/శక్తుల అహం దెబ్బ తింటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయన్నదే ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ చిత్ర కథ. అదే పాయింట్‌ను ‘అహంకారానికి - ఆత్మగౌరవానికి మధ్య మడమ తిప్పని యుద్ధం’ అంటూ ‘భీమ్లానాయక్‌’ చిత్ర బృందం ప్రచార చిత్రాల్లోనే చెప్పింది. (Bheemla Nayak Review)ఒక భాషలో విజయవంతమైన చిత్రాన్ని మరో భాషలో ప్రేక్షకులకు దగ్గరయ్యేలా తీర్చిదిద్దడం అంటే మామూలు విషయం కాదు. మరీ ముఖ్యంగా మాస్‌లో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉన్న పవన్‌కల్యాణ్‌లాంటి నటుడిని దృష్టిలో పెట్టుకుని సినిమా తీయాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ విషయంలో ‘భీమ్లానాయక్‌’ టీమ్‌ విజయం సాధించింది. పవన్ నుంచి ఆయన అభిమానులు ఏం ఆశిస్తారో అన్ని అంశాలను మేళవించి సినిమాను తీర్చిదిద్దింది. మాతృకలో మాదిరిగానే పవన్‌, రానా పాత్రలను పరిచయం చేస్తూ సినిమాను ప్రారంభించిన దర్శకుడు అక్కడితో పోలిస్తే రెండు పాత్రలు, వాళ్లకున్న నేపథ్యాన్ని మరింత ఎలివేట్‌ చేస్తూ చూపించారు. ఇద్దరు బలమైన వ్యక్తుల(ఎంతవరకైనా వెళ్లే తత్వం) మధ్య యుద్ధం జరగబోతోందని ప్రేక్షకుడికి ముందే చెప్పేశారు. దీంతో వాళ్లకెదురయ్యే పరిస్థితుల్లో ఎవరెలా స్పందిస్తారన్న ఆసక్తిని ప్రేక్షకుడిలో కలిగించారు. దీనికి తోడు త్రివిక్రమ్‌ సంభాషణలు ప్రతి సన్నివేశాన్ని మరింత ఎలివేట్‌ చేసింది. ముఖ్యంగా భీమ్లానాయక్‌ పలికే సంభాషణలు అభిమానులతో విజిల్స్‌ వేయించేలా ఉన్నాయి. విరామ సన్నివేశాల ముందు వచ్చే యాక్షన్‌ సీన్లు మరింత మెప్పిస్తాయి.(Bheemla Nayak Review)

ద్వితీయార్ధంలో కథకు మరిన్ని పార్శ్వాలు జోడించారు.  ఒరిజినల్‌ కథకు అదనపు హంగులు జోడించి పూర్తిగా పవన్‌ కల్యాణ్‌ మాస్‌ ఫాలోయింగ్‌కు అనుగుణంగా సన్నివేశాలను తీర్చిదిద్దారు. ఇవే కాస్త నిడివిని పెంచాయా? అనిపిస్తాయి. తన ఉద్యోగం పోవడానికి కారణమైన డానియల్‌తో భీమ్లానాయక్‌ చేసే పోరాటానికి మాస్‌ ఎలిమెంట్స్‌ జోడించి తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను మెప్పిస్తుంది. ప్రతి సన్నివేశం నువ్వా-నేనా అన్నట్లు సాగుతుంది. ఇరువురి మధ్య జరిగే పోరాటాలు ఉత్కంఠగా సాగుతాయి. రెండు బలమైన శక్తులు ఢీకొన్నప్పుడు దాని వల్లే జరిగే పరిణామాలతో చుట్టు పక్కల వారు ఎలా ప్రభావితమవుతారన్న దాన్ని ఇతర పాత్రల ద్వారా ఎమోషనల్‌గా చూపించారు. దానికి తోడు సెకండాఫ్‌లోనూ పవన్‌ నుంచి వచ్చే డైలాగ్‌లు ప్రేక్షకులతో విజిల్స్‌ వేయిస్తాయి. ప్రతి సన్నివేశం ఒకదానిని మించి మరొకటి ఉండేలా రూపొందించారు. తెరపై ప్రధానంగా పవన్‌-రానాలే కనిపిస్తారు. క్లైమాక్స్‌ ముందు వచ్చే ట్విస్ట్‌ మెప్పిస్తుంది. ఒక బలమైన ఎమోషన్‌తో సినిమాను ముగించిన విధానమూ బాగుంది. ‘భీమ్లా నాయక్‌’ టైటిల్‌ పెట్టడంతో కేవలం పవన్‌ పాత్రను మాత్రమే ఎలివేట్‌ చేస్తారని అంతా భావించారు. కానీ మాతృకలో మాదిరిగానే  రానా పాత్రకూ న్యాయం చేసేలా సన్నివేశాలను తీర్చిదిద్ది విమర్శకులకు చెక్‌ పెట్టారు.  (Bheemla Nayak Review)

ఎవరెలా చేశారంటే: భీమ్లానాయక్‌ (Bheemla Nayak)చూసిన తర్వాత ఆ పాత్రలో పవన్‌(Pawan kalyan)ను తప్ప మరొకరిని ఊహించుకోలేం. అంతలా పాత్రను ఆకళింపు చేసుకున్నారు. ఆయన సంభాషణలు పలికే విధానం, సవాళ్లు విసరడం ‘బద్రి’ నాటి రోజులను గుర్తు చేస్తాయి. పవన్‌ అభిమానులకైతే సినిమా మొత్తం కనుల విందే. పవన్‌కల్యాణ్(Pawan kalyan) తెరపై కనిపిస్తే మరొక పాత్ర మరుగున పడిపోతుంది. కానీ, అందుకు భిన్నంగా ప్రతి సన్నివేశంలో పవన్‌కు దీటుగా డానియల్‌ శేఖర్‌గా రానా(Rana) తనదైన నటనతో మెప్పించాడు. రాజకీయంగా అండదండలు ఉన్న వ్యక్తి ఏవిధంగానైతే అహంకారాన్ని ప్రదర్శిస్తాడో చివరి వరకూ రానా అదే టెంపోను కొనసాగించాడు. ఇక ఇరువురి మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు.. సింహం, మదపుటేనుగు ఢీకొన్నట్లు ఉంటాయి.

భీమ్లానాయక్‌ భార్య సుగుణగా నిత్యా మేనన్‌ కనిపించింది.  మాతృకతో పోలిస్తే ఈ పాత్ర స్క్రీన్‌స్పేస్‌ను పెంచారు. సీఐ కోదండరాంగా మురళీశర్మ, డానియల్‌ భార్యగా సంయుక్త మేనన్‌, అతడి తండ్రిగా సముద్రఖని తమ పరిధి మేరకు నటించారు. బ్రహ్మానందం తళుక్కున మెరిశారు. తమన్‌ సంగీతం బాగుంది. ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధంలో నేపథ్య సంగీతం ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్‌ చేసింది. పాటలు ఓకే. ‘లాలా.. భీమ్లా’ థియేటర్‌లో విజిల్స్‌ వేయిస్తుంది. రవి కె.చంద్ర సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. యాక్షన్‌ సన్నివేశాలు హైలైట్‌ అని చెప్పవచ్చు. నవీన్‌ నూలి ఎడిటింగ్‌ షార్ప్‌గా ఉంది. కథకు ఏది అవసరమో అంతే ఉంచారు. ఈ సినిమాకు త్రివిక్రమ్‌ వెన్నెముక అంటూ పవన్‌ చెప్పారు. అది వందశాతం నిజం. మలయాళ ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ను తెలుగు ప్రేక్షకులకు, అదీ పవన్‌ అభిమానులను మెప్పించేలా తీర్చిదిద్దడంలో ఆయన మార్కు కనిపించింది. సంభాషణలు, స్క్రీన్‌ప్లే సినిమాకు ఆయువు పట్టు అయ్యాయి. ముఖ్యంగా అడవి గురించి, మనుషుల మధ్య బంధాల గురించి త్రివిక్రమ్‌ రాసిన సంభాషణలు బాగున్నాయి. త్రివిక్రమ్‌ స్కిప్ట్‌ను అదే స్థాయిలో చూపించడంలో యువ దర్శకుడు సాగర్‌ కె.చంద్ర విజయం సాధించారు. టేకింగ్‌లో తనదైన ఫ్లేవర్‌ చూపించారు. చిత్ర నిర్మాణం విషయంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్కడా రాజీపడలేదు. ప్రతి సన్నివేశానికి రిచ్‌లుక్‌ వచ్చేలా ఖర్చు పెట్టారు.

బలాలు

+ పవన్‌, రానాల నటన

+ త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, సంభాషణలు

+ తమన్‌ సంగీతం, సాగర్‌ టేకింగ్‌

బలహీనతలు

- ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు

చివరిగా: ‘భీమ్లా నాయక్‌’......... ఏంటి క్యాప్షన్‌ లేదనుకుంటున్నారా.. అక్కర్లేదు ‘ఇది పవన్‌ మూవీ’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయమాత్రమే!


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts