HBD Pawan Kalyan: పాటగాడు పవన్‌.. ఒక్కో పాట సూపర్‌హిట్‌!

పవన్‌ జన్మదినం సందర్భంగా ‘పాటగాడు పవన్‌’ గురించి ఓసారి చూద్దామా!

Updated : 07 Dec 2022 15:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్: పవన్‌ కల్యాణ్‌... కుర్రకారు అభిమానించే కథానాయకుడు. ఇదేదో కేవలం నటనను చూసి మాత్రమే అతణ్ని ఇష్టపడుతున్నారు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే పవన్‌లో నటన మాత్రమే కాకుండా చాలా కళలు దాగున్నాయి. అందులో గానం ఒకటి.  పవన్‌ ఇప్పటివరకు పాడిన పాటలన్నీ హిట్టే. ఈ రోజు పవన్‌ పుట్టిన రోజు సందర్భంగా ‘పాటగాడు పవన్‌’ గురించి ఓసారి చూద్దామా!

  • యువ కథానాయకుడి నుంచి స్టార్‌ హీరోగా పవన్‌ అడుగులు వేస్తున్న తొలి రోజులవి. సినిమాల ఎంపికతో మెస్మరైజ్‌ చేస్తున్న పవన్‌ ‘తమ్ముడు’లో రెండు పాటలు పాడాడు. అవి పూర్తిస్థాయి పాటలు కాకపోయినా.. ఆ సినిమా పేరు చెబితే ఠక్కున గుర్తొచ్చేస్తాయి. మల్లికార్జునరావును ఆటపట్టిస్తూ పాడే ‘తాటి చెట్టు ఎక్కలేవు...’ ఎంత హుషారుగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే మరో బిట్‌ సాంగ్‌ ‘ఏం పిల్లా మాట్లాడవా’  అదిరిపోతుంది.
  • పవన్‌ కల్యాణ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్స్‌లో ‘ఖుషీ’ ఒకటి. ఆ సినిమాలోనూ పవన్‌ ఓ పాట పాడాడు. ఏంటీ.. గుర్తొచ్చేసిందా? ఆఁ.. మీరనుకున్నపాటే... ‘బై బయ్యే బంగారు రమణమ్మ..’. అలీ వచ్చి.. మీ నాన్న పాట.. సీకాకుళం పాట అనగానే పవన్‌ అందుకుంటాడు. గుడుంబా మత్తులో పవన్‌ వేసే సరదా స్టెప్పులు, ఆ తర్వాత మధుమిత అలియాస్‌ భూమిక పోస్టర్‌ దగ్గర చేసే రచ్చ వేరే లెవల్‌. ఆ సీన్‌ అంతగా హైలోకి వెళ్లిందంటే ఈ పాటదీ ముఖ్య పాత్ర అని చెప్పొచ్చు.
  • పవన్‌ కల్యాణ్‌ సినిమా అంటే... అతడి ఫిలాసఫీ, ఆలోచన విధానం గురించి ఎక్కడో ఓ చోట కచ్చితంగా చెబుతాడు అంటుంటారు. కెరీర్‌ పీక్స్‌లో ఉన్నప్పుడే ఇలాంటి ప్రయత్నాలు చేశాడు పవన్‌. దర్శకుడిగా మారి ‘జానీ’ చేశాడు. అందులో ఒక బిట్‌ సాంగ్‌, ఒక ఫుల్‌ సాంగ్‌ ఆలపించాడు. ఎమ్మెస్‌ నారాయణ తాగుడు గురించి పవన్‌ సెటైరికల్‌గా పాడే పాట ‘నువ్వు సారా తాగకు..’ పాటకు ఆ రోజుల్లో సూపర్‌ రియాక్షన్‌ వచ్చింది. అదే సినిమాలో సమాజంలోని కొంతమంది మోసగాళ్ల మీద సెటైర్లతో పాడిన పాట ‘రావోయి మా ఇంటికి...’ పాట కూడా బాగుంటుంది.
  • బిట్‌ సాంగ్స్‌, సందేశం ఇచ్చే సాంగ్సేనా పవన్‌ పాడింది అంటే... కాదనే చెప్పాలి. ఎందుకంటే ‘గుడుంబా శంకర్‌’లో పవన్‌ ఓ ఐటమ్‌ సాంగ్‌ పాడాడు. ‘కిల్లీ కిల్లీ..’ అంటూ పవన్‌ గొంతెత్తితే ఫ్యాన్స్‌ ఊగిపోయారంతే. పవన్‌ గొంతు, స్టెప్పులు కలసి పాట ఫుల్‌ జోష్‌లో ఉంటుంది.
  • వరుసగా సినిమాల్లో పాటలు పాడుతూ వచ్చిన పవన్‌.. ‘గుడుంబా శంకర్‌’ తర్వాత చాలా సినిమాల్లో పాడలేదు. మళ్లీ ‘పంజా’తో గొంతు సవరించుకున్నాడు. ఈసారి ‘పాపా రాయుడు...’ అంటూ బ్రహ్మానందాన్ని పవన్‌ పొగుడుతూ తిట్టే పాట అది. ఫుల్‌మాస్‌ బీట్‌లో సాగే ఈ పాట చాలా రోజులు రిపీట్‌ మోడ్‌లో వినేసి సంతోషించారు అభిమానులు. 
  • పవన్‌ కల్యాణ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ అయిన.. ‘అత్తారింటికి దారేది’లోనూ పవన్‌ గానం వినిపిస్తుంది. ‘కాటమ రాయుడా కదిరి నరసింహుడా...’ అంటూ పవన్‌ మళ్లీ బద్దం భాస్కర్‌ అలియాస్‌ బ్రహ్మానందం భరతం పట్టేలా ఆ పాటను రూపొందించారు. దేవిశ్రీ ప్రసాద్‌ ట్యూన్‌, పవన్‌ గొంతు పాటకు ఓ డిఫరెంట్‌ స్టైల్‌ని ఇచ్చాయి.
  • సహచర నటుణ్ని ఆటపట్టించే పాటలు పాడటం అంటే.. పవన్‌ కల్యాణ్‌కు కొట్టినపిండి. ఆయన పాడిన పాటలు చాలావరకు అలానే ఉంటాయి. ఇదే కోవలో ‘అజ్ఞాతవాసి’లోనూ పవన్‌ ఓ పాట పాడాడు. రఘుబాబును ‘కొడకా కోటేశ్వరరావు..’ అంటూ పవన్‌ గొంతెత్తితే.. యూట్యూబ్‌లో వ్యూస్‌ రికార్డులు మారిపోయాయి. ఇక థియేటర్లలో ఫ్యాన్స్‌ జోష్‌ అయితే అదిరిపోయింది. 

పవన్‌ నటనతోనే కాదు, గొంతుతోనూ మాయ చేయగలడు అని ఈ పాటలు చెప్పకనే చెబుతాయి. అందుకే పవన్‌ నటుడిగానే కాకుండా.. ‘పాటగాడి’గానూ ఫ్యాన్స్‌కు బాగా ఇష్టం.Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని