HBD Pawan Kalyan: అదే నా చివరి సినిమా కావాలని బలంగా కోరుకున్నా: పవన్‌ కల్యాణ్‌

పవన్‌ కల్యాణ్‌ అంటే పవరు. ఆ పేరే ఒక హోరు. భారీ డైలాగ్‌లు చెప్పకపోయినా.. కళ్లు చెదిరే డ్యాన్స్‌లు చేయకపోయినా కేవలం ఆయన కటౌట్‌ కనిపించినా ప్రేక్షకులు ఉర్రూతలూగుతారు.

Updated : 02 Sep 2022 12:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) అంటే పవర్‌. ఆ పేరే ఒక హోరు. భారీ డైలాగ్‌లు చెప్పకపోయినా.. కళ్లు చెదిరే డ్యాన్స్‌లు చేయకపోయినా.. కేవలం ఆయన కటౌట్‌ కనిపిస్తే చాలు ప్రేక్షకులు ఉర్రూతలూగుతారు. థియేటర్లలో పండగ చేసుకుంటారు. తెరపై అంత హంగామా చేసే పవన్‌ తెర వెనక సాదాసీదాగా ఉంటారు. అందుకే సగటు సినీ అభిమానితోపాటు ప్రముఖులూ ఆయన్ను ఇష్టపడతారు. పవన్‌ క్రేజ్‌ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా ఓవర్‌నైట్‌లో జరిగిందేమీ కాదు. మరి, పవన్‌ ఎలాంటి స్థితి నుంచి ఇంతటి స్థాయికి వచ్చారో ఓ సందర్భంలో వివరించారు. ఆ ప్రయాణ వివరాలు ఆయన మాటల్లోనే... (నేడు పవన్‌ పుట్టినరోజు)  (Happy Birthday Power Star)

వాటిని చదువుతూ పెరిగా..

‘‘నాకు ఊహ తెలిసేనాటికే అన్నయ్య చిరంజీవి (Chiranjeevi) డిగ్రీ విద్యార్థి. తను వేరే ఊళ్లో చదువుకుంటూ సెలవులకు ఇంటికి వచ్చేవాడు. అన్నయ్య ఉంటే నాకు పండగే. తను కాలేజీకి వెళ్లిపోగానే.. మళ్లీ ఎప్పుడొస్తాడా? అని ఎదురు చూస్తుండేవాణ్ని. అన్నయ్యతో మా ఊరు వీధుల్లో బైక్‌పై తిరిగిన క్షణాల్ని ఎప్పటికీ మర్చిపోలేను. నాగబాబు అన్నయ్య దగ్గర నాకు బాగా చనువు ఉండేది. ఏం అడగాలన్నా తననే అడిగేవాణ్ని. నాన్న విషయానికొస్తే ఆయన ముక్కుసూటి మనిషి, నిజాయతీపరుడు. దాంతో ఉద్యోగంలో ఒడిదొడుకులు వచ్చాయి. ఆయన కొన్నాళ్లు సెలవులోనే ఉండటంతో జీతం రాక ఆర్థికంగా ఇబ్బంది పడ్డాం. ఈ విషయాలన్నీ నాకు అర్థం అవుతూనే ఉండేవి. కానీ, ఏం చేయలేని పరిస్థితి. అమ్మ ప్రతి విషయాన్నీ వాస్తవిక దృక్పథంతో ఆలోచించేది. దాన్ని నేనూ అలవరచుకున్నా. అప్పట్లో, వారపత్రికల్లో సీరియల్స్‌ వచ్చేవి. అమ్మ వాటిని కత్తిరించి, బైండింగ్‌ చేసి పెట్టేది. వాటిని చదువుతూ పెరిగాన్నేను’’ అని పవన్‌ గుర్తు చేసుకున్నారు.

ఆత్మహత్యకు ప్రయత్నించా!

‘‘బాల్యంలో నాకెప్పుడూ అనారోగ్యమే. ఆస్తమా ఉండేది. దాంతో ఇంట్లో ఎక్కువగా అల్లరి చేసేవాణ్ని కాదు. పెద్దగా స్నేహితులూ ఉండేవారు కాదు. తెలిసిన ఒకరిద్దరితో ముచ్చట్లు పెడదామన్నా నా ఆలోచనలకు, వారి అభిప్రాయాలకూ పొంతన ఉండేది కాదు. నేను ఇంటర్‌లో చేరే సమయానికి అన్నయ్య (చిరంజీవి) చిత్ర పరిశ్రమలో స్థిరపడ్డాడు. ఎనిమిదో తరగతి నుంచీ పరీక్షల్లో తప్పడం నాకు అలవాటే కాబట్టి ఇంటర్‌ ఫెయిలైనా నిరుత్సాహపడలేదు. మరోసారి, సెప్టెంబరులో ప్రయత్నించా. అప్పుడు పాస్‌ కావడం అసాధ్యమని అర్థమైంది. ఇంత జరుగుతున్నా అమ్మానాన్నా నన్ను ఒక్క మాట అనేవారు కాదు. కానీ, నాలో ఏదో అపరాధభావం. ‘స్నేహితులంతా జీవితంలో ముందుకెళ్లిపోతున్నారు. మనం మాత్రం ఉన్న చోటే ఉంటున్నాం. ఎందుకిలా అవుతోంది’ అన్న నిస్పృహ వెంటాడేది. ఆ ఒత్తిడిలో ఆత్మహత్యకు ప్రయత్నించా. కుటుంబ సభ్యులు చూడటం వల్ల బతికి బయటపడ్డా. ఆ సమయంలో ఇద్దరు అన్నయ్యలు, సురేఖ వదిన అండగా నిలిచారు. ‘నువ్వు చదివినా చదవక పోయినా మేం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం. జీవితంలో స్పష్టత ముఖ్యం. ముందు, నువ్వు ఏం కావాలనుకుంటున్నావో నిర్ణయించుకో’ అని సలహా ఇచ్చారు’’

అది గొప్ప మార్పు..

‘‘నాకు అనేక రంగాల మీద పట్టు సాధించాలని ఉండేది. ప్రతి వృత్తిపైనా ఆసక్తి చూపేవాణ్ని. కానీ, ఎందులోనూ పట్టు సాధించలేకపోయా. పలు విషయాలపై దృష్టిపెట్టడం వల్ల అయోమయంలో పడ్డా. దాన్నుంచి బయటపడేందుకు రోజంతా సినిమాలు చూసేవాణ్ని. ‘నీకు ఇన్ని అవకాశాలు ఇచ్చినా నువ్వేం చేయట్లేదు. సరే.. అన్ని వదిలేసి సినిమాల్లో ప్రయత్నించు’ అని అన్నయ్య చిరంజీవి ఓ రోజు చెప్పారు.  అలా సత్యానంద్‌ గారి దగ్గరికి శిక్షణకు వెళ్లా. నటన సంగతి తర్వాత.. ముందు నాలోని బిడియాన్ని పోగొట్టడం చాలా అవసరమని ఆయనకు అర్థమైంది. ఆ శిక్షణా కాలంలోనే నా సిగ్గు, మొహమాటాల గోడలు బద్దలు కొట్టా. నా బతుకు నేను బతకగలననే ధైర్యం వచ్చింది. అది నాలో నేను చూసిన గొప్ప మార్పు’’

నర్సరీ పెట్టాలనుకున్నా.. 

‘‘కొన్నాళ్లకు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. కానీ, సుమారు మూడు సంవత్సరాలు గడిచినా ఆ సినిమా షూటింగ్‌ ప్రారంభంకాలేదు. ‘ఇప్పుడు నేనేం చేయాలి’ అనే బాధ మళ్లీ మొదలైంది. దాని కోసం ఎదురుచూసే ఓపిక లేక ‘బెంగళూరులో నర్సరీ పెడతా. నాకు తెలిసిన పని అదొక్కటే’ అని అమ్మకు చెప్పేశా. అదే రోజు సాయంత్రం ఆ చిత్రం పట్టాలెక్కుతుందనే తీపి కబురు వినిపించింది. ఏదో నటించేశా. అసందర్భమైన డ్యాన్సులు, కృతకమైన డ్రెస్సులు ఎబ్బెట్టుగా అనిపించేవి. అందుకే నా తొలి సినిమానే చివరి సినిమా కావాలని బలంగా కోరుకున్నా. రెండో సినిమా మొహమాటం కొద్దీ ఒప్పుకోవాల్సివచ్చింది. ఆ తర్వాత మెల్లమెల్లగా సినీ వాతావరణం అలవాటైంది. ఏ సినిమా అయినా కష్టపడికాదు ఇష్టపడి చేయాలని నిర్ణయించుకున్నా. ఫలితాలు కాదు నాకు ప్రయాణం ముఖ్యం. గెలుపైనా ఓటమైనా అందులో భాగమే. ఎంత నాకు నేను సర్దిచెప్పుకున్నా మనసు వినేది కాదు. ‘జాని’ తర్వాత కూడా సినిమాలు మానేద్దామనుకున్నా. కానీ, సాధ్యపడలేదు. ‘ఈ ఒక్క సినిమా చేసేయ్‌’ అంటూ ఫ్యామిలీ ముందుకు నెడుతూ వచ్చింది. అలా ఒకదాని తర్వాత ఒకటి చేస్తూనే వచ్చా’’ అని పవన్‌ కల్యాణ్‌ వివరించారు.

కల్యాణ్‌గా పరిచయమై..

‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ అనే సినిమాతో 1996లో పవన్‌ కల్యాణ్‌ నటుడిగా మారారు. అందులో ఆయన ముళ్లపూడి కల్యాణ్ అనే పాత్ర పోషించారు. ఆ తర్వాత, ‘గోకులంలో సీత’, ‘సుస్వాగతం’, ‘తొలిప్రేమ’, ‘తమ్ముడు’, ‘బద్రి’, ‘ఖుషి’, ‘జల్సా’, ‘గబ్బర్‌ సింగ్‌’, ‘అత్తారింటికి దారేది’.. ఇలా విభిన్న కథలతో ఆయన నెలకొల్పిన రికార్డులు గురించి చెప్పేదేముంది. ఈ ఏడాది ‘భీమ్లా నాయక్’తో సందడి చేసిన ఆయన ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) అనే చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు, హరీశ్‌ శంకర్‌, సురేందర్‌ రెడ్డి, సుముద్రఖని దర్శకత్వంలో నటించనున్నారు.

మీకు తెలుసా..?

పవన్‌ కల్యాణ్‌, దర్శకుడు త్రివిక్రమ్‌ ఎంత సన్నిహితంగా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇప్పటి వరకూ మూడు సినిమాలొచ్చాయి. ‘జల్సా’తోనే వీరి ప్రయాణం మొదలైందని చాలామంది అనుకుంటారు. కానీ, 90ల్లోనే ఈ ఇద్దరూ కలిసి ఓ సినిమాకి పనిచేశారు. అదే ‘గోకులంలో సీత’. ఈ చిత్రానికి నటుడు పోసాని కృష్ణమురళి సంభాషణలు రాశారు. అప్పట్లో త్రివిక్రమ్‌ ఈయన అసిస్టెంట్‌గా పనిచేశారు. అలా.. ఆ చిత్రం కోసం త్రివిక్రమ్‌ రాసిన ‘ప్రేమే దైవం, ప్రేమే సర్వం, ప్రేమే సృష్టి మనుడగకు మూలం’ అనే డైలాగ్‌ పవన్‌కు బాగా నచ్చిందట. అయితే, అప్పట్లో త్రివిక్రమ్‌ ఎవరో పవన్‌కు తెలియదు. 

ఫిన్‌లాండ్‌లో చదువుకునే తన మిత్రుడు సెలవుల్లో పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేస్తున్నాడని తెలియడంతో పవన్‌ కూడా అలానే చేయాలనుకున్నారు. అలా ఆయన ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌లో కొన్ని రోజులు, ఓ గిడ్డంగిలో రెండు రోజులు పనిచేశారు. అన్ని రంగాల మీద పట్టు సాధించాలనుకునే క్రమంలో.. పారా గ్లైడింగ్ నేర్చుకున్నారు. కర్ణాటక సంగీతంలో ప్రవేశం పొందారు. వయొలిన్‌ సాధన చేశారు. డిప్లొమా ఇన్‌ ఎలక్ట్రానిక్స్‌ కోర్సులో చేరారు. కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ గురించి కొంత తెలుసుకున్నారు. బొమ్మలు గీయాలని, విదేశీ భాషలు నేర్చుకునే ప్రయత్నం చేశారు.Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts