Pawan Kalyan: హరిహర వీరమల్లు.. పవన్‌ షూటింగ్‌ పార్ట్‌ ఎన్ని రోజులంటే?

పవన్‌కల్యాణ్‌ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌ ప్రొగ్రెస్‌ గురించి చిత్ర నిర్మాత ఏంఎం రత్నం ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Published : 29 Jun 2024 16:56 IST

హైదరాబాద్‌: పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) కథానాయకుడిగా రూపొందుతున్న పీరియాడిక్‌ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). ఏఎం జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. గత కొన్నేళ్లుగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్‌ రాజకీయాల్లో బిజీ కావడంతో సినిమా చిత్రీకరణ ఆలస్యమవుతూ వచ్చింది. తాజాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనను గెలిపించడంతో పాటు, ఉపముఖ్యమంత్రిగానూ పవన్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఎక్కువ సమయం ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన కేటాయిస్తున్నారు. దీంతో ‘హరిహర వీరమల్లు’ సెట్స్‌లోకి తిరిగి ఎప్పుడు అడుగుపెడతారా? అసలు ఇంకా ఎంత షూటింగ్‌ ఉందన్న ప్రశ్నలు అభిమానులను వెంటాడుతున్నాయి. వీటిపై చిత్ర నిర్మాత ఏఎం రత్నం స్పష్టతనిచ్చారు. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆ విశేషాలను పంచుకున్నారు.

‘‘సినిమాకు సంబంధించి పవన్‌కల్యాణ్‌ ఎపిసోడ్స్‌ మేజర్‌ పార్ట్‌ పూర్తయింది. మరో 20-25 రోజులు సమయం కేటాయిస్తే, షూటింగ్‌ మొత్తం అయిపోతుంది. ప్రస్తుతం పవన్‌కు ఉన్న బిజీ షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకుని షూటింగ్‌ ప్రణాళికను సిద్ధం చేస్తాం. ఈ చిత్ర స్ట్రీమింగ్‌ రైట్స్‌ ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌కు ఇచ్చాం. వారితో చేసుకున్న ఒప్పందం ప్రకారం అక్టోబరులో విడుదల కావాలి. అయితే, ఇంకాస్త సమయం కావాలని వాళ్లను అడుగుతాం. ఎట్టి పరిస్థితుల్లో డిసెంబరు చివరి నాటికి సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తాం. మరోవైపు సినిమాకు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతూనే ఉన్నాయి. మచిలీపట్నం పోర్ట్‌ సీక్వెన్స్‌కు సంబంధించి సీజీ వర్క్‌ ఇరాన్‌లో జరుగుతోంది. అలాగే కుస్తీ పోటీలకు సంబంధించిన వీఎఫ్‌ఎక్స్‌ పనులు బెంగళూరులో చేస్తున్నారు. చార్మినార్‌ ఎపిసోడ్‌ పనులు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. ‘హరిహర వీరమల్లు’ ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని పంచుతుంది. ఇక పవన్‌కల్యాణ్‌ యాక్షన్‌ సీన్స్‌ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి.’’ అని ఏఎం రత్నం చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం పవన్‌ దృష్టంతా రాజకీయాలపైనే ఉంది. ముఖ్యంగా తన కేటాయించిన మంత్రిత్వశాఖలకు సంబంధించి ఇప్పటికే సమీక్షలు జరుపుతున్నారు. ఆ శాఖల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ‘వీరమల్లు’కు డేట్స్ కేటాయించడం సాధ్యమయ్యే పనికాదు. జులై చివరి వారం లేదా ఆగస్టు నెలలో వెసులుబాటు కల్పించుకుని సినిమా కోసం రంగంలోకి దిగుతారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఆయన పోర్షన్‌ పూర్తయితే, పవన్‌ను ఈ ఏడాది తెరపై చూడటం ఖాయం. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. తొలుత ఈ మూవీకి క్రిష్ దర్శకత్వం వహించారు. సినిమా మరీ ఆలస్యమవుతుండటం, వేరే ప్రాజెక్ట్‌లకు వెళ్లిపోవడంతో ఆయన స్థానంలో దర్శకుడు జ్యోతికృష్ణ మెగా ఫోన్‌ పట్టారు. పాన్‌ ఇండియా మూవీగా ఏఎం రత్నం ఈ మూవీని విడుదల చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని