Kushi Re Release: పవన్‌ అభిమానులకు పండగే.. ‘ఖుషి’ రీ రిలీజ్‌ ట్రైలర్‌ విడుదల

పవర్‌స్టార్‌ అభిమానులకు ఇక పండగే. పవన్‌ కల్యాణ్‌ నటించిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘ఖుషి’ ఈ డిసెంబర్‌ 31న థియేటర్లలో మళ్లీ విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించి తాజాగా చిత్ర బృందం రీ రిలీజ్‌ ట్రైలర్‌ను విడుదల చేసింది

Updated : 26 Dec 2022 01:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘ఖుషి’. రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా విడుదలైన ఈ చిత్రం బాక్స్‌ ఆఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఈ చిత్రంతో పవన్‌కల్యాణ్‌కు ప్రధానంగా యువత మరింత దగ్గరయ్యారు. 2001లో విడుదలైన ఈ చిత్రాన్ని శ్రీసూర్య మూవీస్‌ బ్యానర్‌పై ఏఎమ్‌ రత్నం నిర్మించారు. ఎస్‌జే సూర్య దర్శకత్వం వహించారు. పవన్‌ సరసన భూమిక నటించింది. ప్రేమకథ నేపథ్యంగా హృద్యంగా మలిచిన ఈ చిత్రంపై ముఖ్యంగా యూత్‌లో ఇప్పటికీ ఏ మాత్రం మోజు తగ్గలేదు. దీంతో డిసెంబర్‌ 31న థియేటర్లలో మళ్లీ విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి తాజాగా రీ రిలీజ్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. 

గత కొన్నిరోజులుగా తమ అభిమాన హీరోల పాత చిత్రాలను విడుదల చేయాలని డిమాండ్‌ వస్తోంది. దీంతో నిర్మాతలు ఆ చిత్రాలను అప్‌డేట్‌ చేసి మళ్లీ థియేటర్లలో విడుదల చేయడం ట్రెండ్‌గా మారింది. ఇలా విడుదల చేసిన చిత్రాలకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. దీంతో చిత్ర బృందాలు ప్రత్యేక రోజులను పురస్కరించుకొని సూపర్‌హిట్‌ చిత్రాలను మళ్లీ విడుదల చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘ఖుషి’ చిత్రానికి సాంకేతికంగా మరిన్ని హంగులు జోడించి విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. 4కే రిజల్యూషన్‌, 5.1 డాల్బీ ఆడియోతో థియేటర్లలో ‘ఖుషి’ సినిమాను విడుదల చేస్తున్నారు. ట్రైలర్‌ విడుదలతో పవన్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లలో మళ్లీ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని