Updated : 24 Feb 2022 13:58 IST

Pawan Kalyan: సినిమా లేకపోతే ప్రజా సేవలో ఉండేవాడిని కాదు:పవన్‌ కల్యాణ్‌

హైదరాబాద్‌: సినిమానే తనకు అన్నం పెట్టిందని, సినిమా లేకపోతే తాను ప్రజాసేవలో ఉండేవాడిని కాదని అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఆయన రానాతో కలిసి నటించిన చిత్రం ‘భీమ్లా నాయక్‌’. సాగర్‌ కె.చంద్ర దర్శకుడు. తమన్‌ స్వరాలు సమకూర్చారు. త్రివిక్రమ్‌, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించారు. బుధవారం ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. ‘‘చిత్ర పరిశ్రమకు రాజకీయాలు ఇమడవు. ఇది కళాకారులు కలిసే ప్రాంతం. నిజమైన కళాకారుడికి కులం, మతం, ప్రాంతం అనేది ఉండదు. ఎక్కడో చెన్నై నుంచి హైదరాబాద్‌ వచ్చిన తెలుగు చిత్రపరిశ్రమ అభివృద్ధికి ఎందరో కృషి చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుగారి నాయకత్వంలో ఆ బంధం మరింత బలోపేతం అవుతోంది. తెలుగు చిత్రపరిశ్రమ అభివృద్ధికి ఆయన అందిస్తున్న తోడ్పాటుకు ధన్యవాదాలు చెబుతున్నా. చిత్ర పరిశ్రమకు ఏ అవసరమున్నా తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌గారు తాను ఉన్నానంటూ ముందుంటారు. జన జీవితంలో ఉన్నా కానీ, సినిమానే అన్నం పెట్టింది. సినిమా లేకపోతే ప్రజలసేవలో ఉండేవాడిని కాదు. సినిమా ఇంత మంది అభిమానులను నాకు భిక్షగా ఇచ్చింది. ఇంతమంది నన్ను గుండెల్లో పెట్టుకునేలా చేసింది. ఏదో అయిపోదామని ఎప్పుడూ అనుకోలేదు. మన రాష్ట్రానికి, మనవాళ్లకు ఎంతో కొంత చేయాలని వచ్చా. రాజకీయాల్లో ఉన్నా కదా అని, ఎలా పడితే అలా సినిమా చేయలేదు. చాలా బాధ్యతతో సినిమాలు చేస్తున్నా. ‘తొలిప్రేమ’, ‘ఖుషి’ ఏ బాధ్యతతో చేశామో ఈ సినిమాకు అలాగే పనిచేశాం. ప్రతి టెక్నీషియన్‌ చాలా కష్టపడి పనిచేశారు. నా రాజకీయ షెడ్యూల్‌కు అనుగుణంగా నిర్మాతలు షెడ్యూలును ఏర్పాటు చేసినందుకు వారికి నా ధన్యవాదాలు’’

‘‘ఇప్పుడు పరిశ్రమలోకి యువశక్తి వస్తోంది. అందుకు ఉదాహరణ నల్గొండ నుంచి వచ్చిన తెలంగాణ యువకుడు సాగర్‌. అమెరికాలో చదువుకుంటూ సినిమాపై ప్రేమతో ఇక్కడకు వచ్చారు. ఇప్పుడిప్పుడే పరిశ్రమలో ఎదుగుతున్న ఆయన మరిన్ని విజయాలు సాధించాలి. మొగిలయ్యలాంటి గాయకులను వెలుగులోకి తెచ్చిన తమన్‌కు ధన్యవాదాలు. ‘అహంకారానికి, ఆత్మగౌరవానికి ఒక మడమ తిప్పని యుద్ధం’ ఈ చిత్రం. ఒక పోలీస్‌ ఆఫీసర్‌కు, రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తికి మధ్య జరిగే సంఘర్షణ. తెలుగువారికి చేరువయ్యేలా తీర్చిదిద్దిన త్రివిక్రమ్‌గారికి ధన్యవాదాలు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. ఈ సినిమాలో రానా, సంయుక్త మేనన్‌, నిత్యామేనన్‌ చాలా చక్కగా నటించారు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్‌కు ధన్యవాదాలు’’అని పవన్‌కల్యాణ్ అన్నారు.

పవన్‌ కల్యాణ్‌కు సోదరుడిలా ఇక్కడికి వచ్చా: కేటీఆర్‌

ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘ఒక మంత్రిగా, ప్రభుత్వ ప్రతినిధిగా రాలేదు. పవన్‌కల్యాణ్‌కు సోదరుడిలా వచ్చా. ఒక మంచి మనసున్న వ్యక్తి పవన్‌కల్యాణ్‌. సూపర్‌స్టార్‌లు, సినిమాస్టార్‌లు చాలా మంది ఉంటారు. కానీ, ఒక విభిన్నమైన ఫాలోయింగ్‌ ఉన్న వ్యక్తి ఆయన.త తొలి ప్రేమ నుంచి ఇప్పటివరకూ ఒకేరకమైన స్టార్‌డమ్‌ను కలిగి ఉండటమంటే అసాధారణ విషయం. చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఎనిమిదేళ్లుగా భారత చిత్రపరిశ్రమకు హైదరాబాద్‌ను హబ్‌గా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారు. ‘మల్లన్న సాగర్‌’ ప్రాజెక్టుతో గోదారిని భూదారి పట్టించిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుంది. గోదావరి జిల్లాల్లో షూటింగ్‌లు జరుపుకొన్నట్లే తెలంగాణలోనూ చిత్రీకరణలు జరపాలని కోరుకుంటున్నా. ఈ సినిమా ద్వారా ఎంతో మంది ప్రతిభావంతులను బయటకు తీసుకొచ్చిన పవన్‌కల్యాణ్‌ అన్నకు, చిత్ర బృందానికి కృతజ్ఞతలు’ అని కేటీఆర్‌ అన్నారు.Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts