Pawan kalyan: పవన్‌ మేనియా.. థియేటర్లు హౌస్‌ఫుల్‌

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ (Pawankalyan).. మార్కెట్‌లో ఈ పేరుకున్న క్రేజ్ వేరు. మల్టీప్లెక్సైనా, మాస్‌ థియేటరైనా.. సిల్వర్‌ స్క్రీన్‌పై ఈ పేరు, ఈయన బొమ్మ కనపడితే చాలు...

Updated : 01 Sep 2022 11:49 IST

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ (Pawankalyan).. మార్కెట్‌లో ఈ పేరుకున్న క్రేజ్ వేరు. మల్టీప్లెక్సైనా, మాస్‌ థియేటరైనా.. సిల్వర్‌ స్క్రీన్‌పై ఈ పేరు, ఈయన బొమ్మ కనపడితే చాలు అభిమానులు చేసే హంగామా మామూలుగా ఉండదు. అందుకే ఈయన సినిమాలు ఎప్పుడు విడుదలైనా హౌస్‌ఫుల్‌ బోర్డులు దర్శనమిస్తుంటాయి. థియేటర్ వద్ద సందడి వాతావరణం నెలకొంటుంది. అలాంటి పరిస్థితే ఇప్పుడు మరోసారి తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద దర్శనమిస్తోంది.

కాగితాలు, డ్యాన్స్‌లు, బాక్సింగ్‌..!

పవన్‌కల్యాణ్‌ కెరీర్‌లోని సూపర్‌ హిట్స్‌లో ఒకటిగా చెప్పుకునే సినిమా ‘తమ్ముడు’ (Thammudu). సెప్టెంబర్‌ 2 పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజుని పురస్కరించుకొని ఆగస్టు 31న పలు థియేటర్లలో ‘తమ్ముడు’ని రీ రిలీజ్‌ చేశారు. ప్రసాద్‌ ఐమ్యాక్స్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు మల్టీప్లెక్స్‌లు, సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో దీన్ని రీ రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించిన కొంత సమయానికే ఆయా థియేటర్లలో హౌస్‌ఫుల్‌ బోర్డులు దర్శనమిచ్చాయి. థియేటర్ల వద్ద పవన్‌ అభిమానులు చేసిన సందడి కొత్త సినిమా రిలీజ్‌ని తలపించింది. సినిమా హాళ్ల ఎదుట భారీ కటౌట్స్‌ ఏర్పాటు చేసి.. ‘జై పవన్‌కల్యాణ్‌’ అంటూ నినాదాలు చేస్తూ అభిమానులందరూ డ్యాన్స్‌లు చేశారు. థియేటర్ల లోపల కూడా ఇలాంటి వాతావరణమే కనిపించింది. పవన్‌ ఎంట్రీ సీన్స్‌, ‘మేడ్‌ ఇన్‌ ఆంధ్రా స్టూడెంట్‌’ సాంగ్‌, క్లైమాక్స్‌ ఫైట్‌.. ఇలా ప్రతి సీన్‌కు అభిమానులు కాగితాలు ఎగురవేసి డ్యాన్స్‌లు చేశారు.

ఇప్పుడు ‘జల్సా’ వంతు..!

పవన్‌కల్యాణ్‌ నటించిన మరో సూపర్‌హిట్‌ చిత్రం ‘జల్సా’ని (Jalsa) సెప్టెంబర్‌ 1న చిత్ర నిర్మాణ సంస్థ రీ రిలీజ్‌ చేసింది. ఈ ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా సుమారు 501 కంటే ఎక్కువ షోలు వేస్తున్నారు. ‘జల్సా’ ప్రదర్శిస్తున్న  థియేటర్లు  హౌస్‌ఫుల్‌ అయిపోయాయి. ముఖ్యంగా ప్రసాద్‌ ఐమ్యాక్స్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సినిమాహాళ్లలో వేయనున్న అన్ని షోల టికెట్స్‌ అమ్ముడైపోయాయి. రీ రిలీజ్‌ చిత్రానికి ఇన్ని షోలు వేయడం.. ప్రతి చోటా ఇలాంటి అద్భుతమైన స్పందన రావడం విశేషమని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇక, ‘తమ్ముడు’, ‘జల్సా’ రీ రిలీజ్‌లను పురస్కరించుకుని సోషల్‌మీడియాలో పవన్‌ పేరు ట్రెండింగ్‌లోకి దూసుకెళ్తోంది. పలు వీడియోలు వైరల్‌ అయ్యాయి.












Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు