Payal Rajput: జీవితమంటే ఏంటో ఆ ఘటన నుంచి నేర్చుకున్నా: పాయల్‌

ఏ కథైనా తన మనసుకు నచ్చితేనే అంగీకరిస్తున్నానని పాయల్‌ రాజ్‌పూత్‌ అన్నారు. అలా ఆమె నటించిన తాజా చిత్రం ‘జిన్నా’ ఈ నెల 21న విడుదలకానుంది.

Published : 20 Oct 2022 01:39 IST

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌లో తనకు బాగా కావాల్సిన వ్యక్తిని కోల్పోయానని, ఆ సంఘటన జీవితమంటే ఏంటో నేర్పిందని నటి పాయల్‌ రాజ్‌పూత్‌ (Payal Rajput) అన్నారు. మంచు విష్ణు (Vishnu Manchu) సరసన ఆమె నటించిన చిత్రం ‘జిన్నా’ (Ginna). దర్శకుడు సూర్య తెరకెక్కించిన ఆ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా పాయల్‌ మీడియాతో పలు విశేషాలు పంచుకున్నారు.

తప్పుదారి పట్టించారు

‘‘కంటెంట్‌ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే దానికి నా తొలి చిత్రం ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఓ నిదర్శనం. సుమారు రూ. 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఆ చిత్రం రూ. 30 కోట్లు వసూళ్లు చేసింది. నటిగా నాకూ మంచి గుర్తింపు ఇచ్చింది. తర్వాత, నా మేనేజర్‌తోపాటు పలువురు నన్ను తప్పు దారి పట్టించటంతో స్క్రిప్టు వినకుండానే ఆయా సినిమాల్లో నటించా. ఇప్పుడు అలా కాదు. నాకు ఏ కథ నచ్చితే అందులోనే నటించేందుకు ఇష్టపడుతున్నా’’

ఆయన ప్రశంస మర్చిపోలేను

‘‘అలా నేను నటించిన ‘అనగనగా ఓ అతిథి’ సంతృప్తినిచ్చింది. అందులోని నా నటనను మోహన్‌బాబు సర్‌ ప్రశంసించటాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఆ సినిమా తర్వాత ‘జిన్నా’లో నటించే అవకాశం వచ్చింది. ఇందులో నేను పల్లెటూరి అమ్మాయిగా స్వాతి అనే పాత్రలో కనిపిస్తా. విష్ణు ఎనర్జటిక్‌  హీరో. మంచి మనసున్న వ్యక్తి. సన్నీ లియోనీతో కలిసి నటించడం సంతోషాన్నిచ్చింది. ఓటీటీ కారణంగా ప్రేక్షకులు ఎన్నో లెక్కులు వేసుకుని సినిమాను చూసేందుకు థియేటర్లకు వస్తున్నారు. వారిని మా చిత్రం అలరిస్తుందనే నమ్మకం ఉంది’’

ఇతర ప్రాజెక్టులు..

‘‘నేను నటించిన ఇతర చిత్రాలు హెడ్‌ బుష్‌ (కన్నడ), గోల్‌మాల్‌ (తమిళం), ‘మీటూ మాయా పేటిక’ విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరో సినిమా చర్చల దశలో ఉంది. అందరిలానే నేనూ లాక్‌డౌన్‌ సమయంలో ఎంతో ఇబ్బంది పడ్డా. నాకు బాగా కావాల్సిన వ్యక్తిని కోల్పోయా. జీవితం అంటే ఏంటో ఆ సంఘటన నుంచి నేర్చుకున్నా’’ అని పాయల్‌ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని