Unstoppable 2: ‘భీమ్లా నాయక్‌’ బాలకృష్ణ చేయాల్సింది కానీ: నిర్మాత నాగవంశీ

బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యహవరిస్తున్న ‘అన్‌స్టాపబుల్‌ 2’ షోలో హీరోలు విశ్వక్‌సేన్‌, సిద్ధు జొన్నలగడ్డ, నిర్మాత నాగవంశీ సందడి చేశారు. వారి ఏం మాట్లాడారంటే..?

Published : 21 Oct 2022 18:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘భీమ్లా నాయక్‌’ (Bheemla Nayak) సినిమాలో హీరోగా ముందు నందమూరి బాలకృష్ణను అనుకున్నామని, ఆయన్ను కలిస్తే ఆ చిత్రం పవన్‌ కల్యాణ్‌కు బాగుంటుందని సలహా ఇచ్చారని నిర్మాత నాగవంశీ (Naga Vamsi) తెలిపారు. ఇతర నిర్మాణ సంస్థల్లో త్రివిక్రమ్‌ పని చేయటం తనకు నచ్చదని పేర్కొన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్‌ 2’ (Unstoppable 2) కార్యక్రమంలో ఆయన ఈ విషయాలు పంచుకున్నారు. యువ నటులు విశ్వక్‌సేన్‌ (Vishwak Sen), సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda)తో కలిసి నాగవంశీ సందడి చేశారు.

‘‘నాకు 17 ఏళ్ల వయసు నుంచి సినిమాల్లోకి రావాలని ప్రయత్నించా. అప్పుడే దర్శకుడిని కావాలని ఉండేది. కొన్ని సినిమాల్లో హీరోగా చేశాక ఆ తర్వాత డైరెక్షన్‌ చేద్దామనుకున్నా. కానీ, ఎవరూ నాకు బ్రేక్‌ ఇవ్వలేదు అందుకే నాకు నేనే బ్రేక్‌ ఇచ్చుకుచ్చా (ఫలక్‌నుమా దాస్‌ సినిమా విషయంలో). ‘ఇది నాకు నచ్చదు. నేను ఇందులో నటించను’ అని ఫిక్స్‌ అయి ఏ కథనైనా వింటా. ఆ మూడ్‌లోనూ స్టోరీకి ఇంప్రెస్‌ అయ్యానంటే అది తప్పకుండా చేసేస్తా. ఫిల్మ్‌ మేకింగ్‌లో తరుణ్‌భాస్కర్‌ నాకు స్ఫూర్తి. ఇటీవల ఓ టీవీ ఛానల్‌లో నాకు అవమానం జరిగింది. నన్ను ఎవరైనా ఇన్సల్ట్‌ చేస్తే తగిన సమాధానం చెబుతా కానీ, ఆ సందర్భంలో మౌనంగా ఉండటమే మంచిదనిపించింది. ఆ నిర్ణయం తీసుకున్నా కాబట్టే ప్రేక్షకులు నన్ను ఆదరించారు’’ అని విశ్వక్‌ సేన్‌ తెలిపారు.

‘‘డీజే టిల్లు’ సినిమాకు ముందుగా ‘నరుడి బతుకు నటన’ అనే టైటిల్‌ పెట్టాం. మాకు గైడెన్స్‌ ఇచ్చిన దర్శకుడు త్రివిక్రమ్‌ ‘మనం తీసింది మాస్‌ సినిమా దానికి క్లాస్‌  టైటిలా?’ అని అన్నారు. తర్వాత కొన్నిరోజులకు విశ్వక్‌సేన్‌తో మాట్లాడేటప్పుడు డీజే టిల్లు ఆలోచన వచ్చింది. ‘అఖండ’లోని ‘జై బాలయ్య’ పాటకు పనిచేసిన కొరియోగ్రాఫర్‌ భాను మాస్టరే డీజే టిల్లు టైటింగ్‌ సాంగ్‌కు పనిచేశారు. నేను హీరో అవుదామనుకుంటున్నా సమయంలో ఓ వ్యక్తి  హేళన చేశాడు. ‘ముఖంపై అన్ని గుంతలు పెట్టుకుని హీరో అవుతావా’ అని వెక్కిరించాడు. ఆరోజు బాగా ఏడ్చా. ఆ కసితోనే హీరోగా మారా. నా సినిమాకు ఫస్ట్‌ క్రిటిక్‌ మా అమ్మ’’ అని సిద్ధు అన్నారు. అనంతరం, కథానాయిక అనుపమ పరమేశ్వరన్‌, దర్శకుడు త్రివిక్రమ్‌కు బాలకృష్ణ సర్‌ప్రైజ్‌ కాల్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని