Peddha Kapu-1 Movie Review: రివ్యూ: పెదకాపు.. విరాట్‌, శ్రీకాంత్‌ అడ్డాల మూవీ మెప్పించిందా?

Peddha Kapu Movie Review: ‘నారప్ప’ తర్వాత రూటు మార్చి దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల నటిస్తూ దర్శకత్వం వహించిన ‘పెదకాపు-1’ ఎలా ఉందంటే?

Updated : 29 Sep 2023 15:30 IST

Peddha Kapu-1 Movie Review; చిత్రం: పెద్దకాపు-1; నటీనటులు: విరాట్‌ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ, రావు రమేశ్‌, నాగబాబు, తనికెళ్ల భరణి, బ్రిగిడ సాగా, రాజీవ్‌ కనకాల, అనసూయ, ఈశ్వరి రావు తదితరులు; సంగీతం: మిక్కీ జే మేయర్‌; సినిమాటోగ్రఫీ: చోటా కె నాయుడు; ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె వెంకటేశ్‌; నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి; రచన, దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల; విడుదల: 29-09-2023

కుటుంబ క‌థ‌లు, ప్రేమ‌క‌థ‌లపై ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ అడ్డాల సంత‌కం ప్ర‌త్యేకమైన‌ది. తెలుగుద‌నం ఉట్టిప‌డే పాత్ర‌ల్ని, నేప‌థ్యాన్ని అందంగా తెర‌పై ఆవిష్కరిస్తుంటారాయ‌న‌. ఇప్ప‌టికీ అదే పంథాని కొన‌సాగిస్తున్నారు. అయితే ‘నార‌ప్ప‌’తో కుటుంబ క‌థ‌ల నుంచి కాస్త కొత్త దారిని ఎంచుకున్న‌ట్టు అనిపించింది. ఆ కొత్త‌దారిలోనే  ప్ర‌యాణం చేస్తూ ‘పెద‌కాపు-1’ తీశారు. ఈ సినిమాతో విరాట్ క‌ర్ణ క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. మ‌రి ఈ సినిమాతో శ్రీకాంత్ అడ్డాల ఎలాంటి ప్ర‌భావం చూపించారు?కొత్త హీరో విరాట్ క‌ర్ణ సామాన్యుడిలా ఎలా ఒదిగిపోయారు?

క‌థేంటంటే: 1982లో రామారావు పార్టీ ప్ర‌క‌టించిన సంద‌ర్భం నాటి క‌థ ఇది. అన్నానికి అల‌వాటు ప‌డిన‌ట్టుగా అధికారానికి అల‌వాటు ప‌డిన ఇద్ద‌రు వ్య‌క్తులు బ‌య‌న్న (న‌రేన్‌) స‌త్య రంగ‌య్య (రావు ర‌మేశ్‌) లంక గ్రామాల్లో  సామాన్యుల జీవితాల‌తో చెల‌గాటమాడుతుంటారు. ఈ క్ర‌మంలోనే కొత్త పార్టీ రావ‌డంతో ఇరు వ‌ర్గాల్లో క‌ల‌వ‌రం మొద‌ల‌వుతుంది. ఆధిప‌త్యం కోసం ర‌క్త‌పాతం సృష్టిస్తారు. సామాన్యులే బ‌ల‌వుతారు. ఆ ప్ర‌భావం స‌త్య రంగ‌య్య ద‌గ్గ‌ర ప‌నిచేసే పెద‌కాపు (విరాట్‌క‌ర్ణ‌) కుటుంబంపైనా ప‌డుతుంది. త‌న అన్న క‌నిపించ‌కుండా మాయ‌మ‌వుతాడు. ఇంత‌కీ పెద‌కాపు అన్న ఏమ‌య్యాడు? ఆత్మ‌గౌర‌వం కోసం పెద‌కాపు ఏం చేశాడు? రామారావు ఎవ‌రికి టికెట్ ఇచ్చారు? 1960ల్లో ఆ ఊళ్ల‌ల్లో ఏం జ‌రిగింది?అక్క‌మ్మ (అన‌సూయ‌) ఎవ‌రు?(Peddha Kapu-1 Movie Review) త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

ఎలా ఉందంటే: ఆత్మ‌గౌర‌వం కోసం... త‌న‌వాళ్ల‌ కోసం నిల‌బ‌డి పోరాటం చేసిన ఓ సామాన్యుడు నాయ‌కుడిగా మారే ప‌రిణామ క్ర‌మ‌మే ఈ సినిమా. తెర‌పై ప్ర‌ధానంగా పెద‌కాపు సంత‌క‌మే క‌నిపించినా... ఇంకా చాలా పాత్ర‌ల ప్ర‌యాణాన్ని ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. అంద‌రినీ సృష్టించిన ఆ దేవుడు ఒక‌రికి క‌ష్టాలు మ‌రొక‌రికి సుఖాలు ఎందుకు ఇచ్చాడు?చీక‌టి నుంచి వెలుగులోకి, దుఃఖం నుంచి సంతోషంలోకి రావాలనుకుంటే యుద్ధం చేయాల్సిందేనా? త‌దిత‌ర విష‌యాల్ని ద‌ర్శ‌కుడు త‌న‌దైన శైలిలో ఈ క‌థ‌లో చ‌ర్చించాడు. (Peddha Kapu Movie Review) 60వ ద‌శ‌కంతో క‌థ మొద‌ల‌వుతుంది. అప్పుడు అనాథ‌లా దొరికిన పాప ఎవ‌ర‌నే ఆస‌క్తిని రేకెత్తించిన ద‌ర్శ‌కుడు ఆ త‌ర్వాత 80ల్లోకి క‌థ‌ని తీసుకొచ్చాడు. పెద‌కాపు అనే పేరు ఎందుకు వ‌చ్చిందో... ఆ పాత్ర ప్ర‌పంచం ఏమిటో ప‌క్కాగా ప‌రిచ‌యం చేయ‌కుండానే నేరుగా ఆత్మ‌గౌర‌వం అంటూ ఊళ్లో జెండా పాత‌డం నుంచి రంగంలోకి దించారు. పాత్ర‌ల్ని, క‌థా ప్ర‌పంచాన్ని స‌గం స‌గం ప‌రిచ‌యం చేసి క‌థ‌ని మొదలు పెట్ట‌డంతో ఆరంభ స‌న్నివేశాలు అయోమయంగా అనిపిస్తాయి. ఎలాంటి క‌నెక్టివిటీ, ఎలాంటి భావోద్వేగాలు లేకుండానే స‌న్నివేశాలు సాగుతూ పోతుంటాయి.

సామాన్యుడి సంత‌కం అని చెప్పిన ద‌ర్శ‌కుడు సామాన్యులు మాట్లాడిన‌ట్టుగా కాకుండా ప్ర‌తి పాత్రతోనూ లోతైన సంభాష‌ణ‌లు చెప్పించాడు. కాసేపు ఆలోచించి అర్థం చేసుకుంటే త‌ప్ప ఆ మాట‌లు బోధ‌ప‌డ‌వు. హీరో పాత్ర కూడా మొద‌ట్నుంచీ హీరోగానే క‌నిపిస్తుంది త‌ప్ప‌, ఓ సామాన్యుడు అన్న‌ట్టుగా ఉండ‌దు. (Peddha Kapu-1 Movie Review) అలా ఈ సినిమా ఆరంభంలోనే గాడిత‌ప్పిన‌ట్టు అనిపించినా... హీరో సోద‌రుడు ఏమ‌య్యాడు? ఫ్లాష్‌బ్యాక్‌లో ఉన్న క‌థేమిటి అనే ప్ర‌శ్న‌లు ప్రేక్ష‌కుడిని ఆస‌క్తిగా, ఓపిక‌గా కూర్చోబెడ‌తాయి. విరామ స‌న్నివేశాలు క‌థ‌కి మ‌లుపునిస్తాయి. ద్వితీయార్ధంతోనే సినిమాలోని అస‌లు క‌థ‌, పాత్ర‌ల ఉద్దేశాలు అర్థమవుతాయి. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమాకి కీల‌కం. ఇందులో క‌థేమీ లేదు. గ్రామ రాజకీయాల నేప‌థ్యంలో వ‌చ్చిన సినిమాల్లోని క‌థే ఇందులోనూ. స‌మాజంలో అస‌మాన‌త‌లు, కుల వ్య‌వ‌స్థల నేప‌థ్యం కార‌ణంగా ‘నార‌ప్ప‌’, ‘రంగ‌స్థ‌లం’, ‘ద‌స‌రా’  త‌దిత‌ర సినిమాల ఛాయ‌లు క‌నిపిస్తాయి. పాత్ర‌లు, అవి న‌డుచుకునే తీరులోనూ స‌హ‌జ‌త్వం క‌నిపించ‌దు. (Peddha Kapu Movie Review) అన‌సూయ పాత్ర‌ని చేర‌దీసిన మ‌హిళ పాత్ర ఆ త‌ర్వాత ఏమ‌వుతుందో అర్థం కాదు. ప్రేమ‌క‌థ‌లోనూ బ‌లం లేదు. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉందికానీ... క‌థ‌ని న‌డిపించ‌డంలోనూ, భావోద్వేగాల విష‌యంలోనూ ద‌ర్శ‌కుడు ప‌ట్టు కోల్పోయిన‌ట్టు అనిపిస్తుంది. రెండో భాగం కోసం ప్ర‌త్యేక‌మైన ఉత్సుక‌త‌ని రేకెత్తించ‌కుండానే తొలి భాగాన్ని ముగించారు ద‌ర్శ‌కుడు.

ఎవ‌రెలా చేశారంటే: క‌థానాయ‌కుడు విరాట్ క‌ర్ణకి ఇదే తొలి చిత్రమైనా ఆ పాత్ర‌లో ఒదిగిపోయాడు. న‌ట‌న‌లో ప‌రిణ‌తి ప్ర‌ద‌ర్శించాడు. పోరాట ఘ‌ట్టాలు కూడా బాగా చేశాడు. ఆయ‌న లుక్స్ బాగున్నాయి. సంభాష‌ణ‌లు ఒకొక్క‌సారి ఒక్కో ర‌కంగా చెప్పిన‌ట్టు అనిపిస్తుంది. హీరోయిన్ ప్ర‌గతి శ్రీ వాత్స‌వ అందంగా క‌నిపించింది. కానీ, ఆ పాత్ర‌లో బ‌లం లేదు. గౌరీ పాత్రలో బ్రిగిడ స‌హ‌జంగా క‌నిపించింది. అక్కమ్మ పాత్ర‌లో అన‌సూయ ఆక‌ట్టుకుంటుంది. సినిమాలో కాస్త భావోద్వేగాలు పండాయంటే ఆమె పాత్ర వ‌ల్లే. (Peddha Kapu Movie Review) స‌త్య‌రంగ‌య్య పాత్రలో రావుర‌మేశ్ అస‌లు సిస‌లు విల‌నిజం ప్ర‌ద‌ర్శించారు. ఆయ‌న పాత్ర ప్ర‌భావాన్ని కొన‌సాగించేలా కొడుకు క‌న్న‌బాబు పాత్ర‌లో శ్రీకాంత్ అడ్డాల త‌న న‌ట‌న‌తో అద‌ర‌గొట్టారు. కుర్చీలో కూర్చునే విల‌నిజం ప్ర‌ద‌ర్శించారు. మ‌రో విల‌న్‌గా న‌రేన్ త‌న పాత్ర‌లో ఒదిగిపోయారు. నాగ‌బాబు, తనికెళ్ళ భరణి పాత్ర‌లు సినిమాలో కీల‌కం. రాజీవ్ క‌న‌కాల‌, ఈశ్వ‌రిరావు, శ్రీనివాస్ వ‌డ్ల‌మాని... ఇలా చాలామంది న‌టులు ప్ర‌ధాన‌మైన పాత్ర‌ల్లో క‌నిపిస్తారు.

సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. ప్ర‌ధానంగా ఛోటా కె.నాయుడు ఛాయాగ్ర‌హ‌ణం. గోదావ‌రి నేప‌థ్యాన్ని ఎంతో అందంగా తెర‌పైకి తీసుకొచ్చారు. జెండా పాతే స‌న్నివేశాలు మొద‌లుకుని చివ‌రి వ‌ర‌కూ ప్ర‌తీ ఫ్రేమ్ అద్భుతం అనిపిస్తుంది. మిక్కీ జె.మేయ‌ర్ నేప‌థ్య సంగీతం మ‌రో ఆక‌ర్ష‌ణ‌. (Peddha Kapu-1 Movie Review) ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ అడ్డాల త‌ను రీమేక్ చేసిన ‘నార‌ప్ప‌’ ప్ర‌భావంతో ఈ సినిమా తీసిన‌ట్టు అనిపిస్తుంది. మాట‌ల‌తో మేజిక్ చేసే ఆయ‌న క‌థ‌, క‌థ‌నాలతో పాటు మాట‌ల్ని  కాస్త స‌ర‌ళంగా స్ప‌ష్టంగా రాసుకోవాల్సింద‌ని ఈ సినిమా చెబుతుంది.

  • బ‌లాలు
  • + ఛాయాగ్ర‌హ‌ణం... నేప‌థ్య సంగీతం
  • + క‌థా నేప‌థ్యం
  • బ‌ల‌హీన‌త‌లు
  • - కొత్త‌ద‌నం లేని క‌థ‌, క‌థ‌నం
  • - కొర‌వ‌డిన భావోద్వేగాలు
  • - సాగ‌దీత‌గా కొన్ని స‌న్నివేశాలు
  • చివ‌రిగా: పెద‌కాపు 1... త‌డ‌బ‌డుతూ సాగే సామాన్యుడి సంత‌కం (Peddha Kapu Movie Review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు