KALKI 2898 AD: ప్రభాస్‌ ‘కల్కి’ టికెట్లు బుక్‌ చేస్తే, రాజశేఖర్ ‘కల్కి’ టికెట్లు బుక్‌ అయ్యాయి!

ప్రభాస్‌ ‘కల్కి’ మూవీ టికెట్లు బుక్‌ చేసుకుందామనుకున్న ప్రేక్షకులకు రాజశేఖర్‌ ‘కల్కి’ మూవీ టికెట్లు బుక్‌ అవడంతో కంగుతిన్నారు.

Published : 24 Jun 2024 00:12 IST

హైదరాబాద్‌: గతంలో కొందరు హీరోలు నటించిన సినిమా పేర్లనే తాజాగా కొన్ని చిత్రాలకు పెడుతున్నారు. 80, 90వ దశకంలో వచ్చిన అనేక హిట్‌ చిత్రాల పేర్లను ఇటీవల కొందరు యువ హీరోలు తమ మూవీస్‌కు పెట్టుకున్నారు. కొన్ని సినిమా పేర్లు వివాదం కావడంతో వాటికి ముందు లేదా వెనుక ఏదో ఒక ట్యాగ్‌లైన్‌ వినియోగించి విడుదల కూడా చేశారు. ఇప్పుడు ‘కల్కి’ పేరు హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD Movie) మూవీ జూన్‌27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం నుంచి తెలంగాణలో టికెట్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ అయ్యాయి.

బుక్‌మై షో, పేటీఎం, జస్ట్‌ టికెట్స్‌ వంటి టికెట్‌ బుకింగ్‌ వెబ్‌సైట్స్‌/యాప్‌లకు ప్రేక్షకులు పోటెత్తారు. నగరంలోని ఓ థియేటర్‌లో విడుదలవుతున్న ‘కల్కి 2898 ఏడీ’ టికెట్‌ను బుక్‌ మై షో వేదికగా బుక్‌ చేసుకోగా, రాజశేఖర్‌, ప్రశాంత్‌ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన ‘కల్కి’ మూవీకి టికెట్‌ బుక్ అయినట్లు కనిపించింది. టికెట్‌ను త్వరగా బుక్‌ చేసుకోవాలన్న తొందరలో యూజర్లు కూడా దాన్ని గమనించలేదు. లావాదేవీ పూర్తయిన తర్వాత టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోగా, దానిపై రాజశేఖర్‌ ‘కల్కి’ మూవీ పోస్టర్‌ కనిపించడంతో కొన్ని థియేటర్‌లలో బుక్‌ చేసుకున్న ప్రేక్షకులకు ఒక్కసారిగా కంగారు పడ్డారు. ఇదే విషయమై ఎక్స్‌ వేదికగా బుక్‌మై షోను వివరణ కోరగా, ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదని తెలిపింది. ‘‘మీరు రాజశేఖర్‌ ‘కల్కి’కి టికెట్‌ బుక్‌ అయినట్లు కనిపిస్తే కంగారు పడాల్సిన అవసరం లేదు. ‘కల్కి 2898 ఏడీ’కి టికెట్‌బుక్‌ అయినట్లు భావించండి. ఈ సాంకేతిక సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాం’’ అని తెలిపింది. దీంతో టికెట్లు బుక్‌ చేసుకున్న వాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఈ వ్యవహారంపై నటుడు రాజశేఖర్ కూడా స్పందిస్తూ 'నాకు ఎలాంటి సంబంధం లేదు' అని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. అలాగే ప్రభాస్, అశ్వినీదత్ తో పాటు కల్కి 2898 ఏడీ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇటీవల కాలంలో ‘కల్కి’ పేరుతో మూడు సినిమాలు ఉన్నాయి. 2019లో రాజశేఖర్‌ నటించిన  యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి’. దీనికి ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించారు. రాజశేఖర్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక మలయాళంలో టొవినో థామస్‌ ‘కల్కి’పేరుతో ఓ పోలీస్‌ డ్రామాలో నటించారు. ప్రస్తుతం ఇది ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. జూన్‌27న ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’ రానుంది. అమితాబ్‌, దీపిక పదుకొణె, కమల్‌హాసన్‌, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై అశ్వనీదత్‌ నిర్మించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని