Cinema News: వారు దోపిడీకి గురికావొద్దు

‘‘మన తోటి వారు కష్టంలో ఉన్నప్పుడు.. వారికి అండగా నిలబడి సాయమందించడం దేశ పౌరులుగా మన కర్తవ్యం’’ అంటున్నారు బాలీవుడ్‌ నటి భూమి పెడ్నేకర్‌. మాటల్లో చెప్పడమే కాదు..

Updated : 24 May 2021 12:04 IST

ముంబయి: ‘‘మన తోటి వారు కష్టంలో ఉన్నప్పుడు.. వారికి అండగా నిలబడి సాయమందించడం దేశ పౌరులుగా మన కర్తవ్యం’’ అంటున్నారు బాలీవుడ్‌ నటి భూమి పెడ్నేకర్‌. మాటల్లో చెప్పడమే కాదు.. ఈ కరోనా కష్ట కాలంలో కొవిడ్‌ బాధితులను ఆదుకునేందుకు తన వంతు కృష్టి చేస్తోంది. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకొని.. అవసరార్థులకు ఆస్పత్రుల్లో బెడ్లు సమకూర్చడంతో పాటు ఆక్సిజన్‌ సిలిండర్లు, ఔషధాలు అందిస్తూ ప్రాణాలు నిలుపుతోంది. దీనిపై భూమి ఓ మీడియా ఇంటర్వ్యూలో స్పందిస్తూ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

‘‘నా కుటుంబమూ ఈ భయంకరమైన వైరస్‌తో పోరాడింది. కరోనా సోకిన సమయంలో నా తల్లి పడిన కష్టాన్ని చూశాక.. నేను సాధ్యమైనంత మందికి సహాయపడాలని నిర్ణయించుకున్నా. 200మంది వలంటీర్ల సాయంతో నాకు చేతనైన సాయం అందిస్తున్నా. ఐసీయూ పడకల కోసం, ఆక్సిజన్ల కోసం రోజూ చాలా ఫోన్లు వచ్చేవి. మా వలంటీర్లు వారికి సాయమందించడానికి రకరకాల మార్గాలు కనుగొనాల్సి వచ్చేది. దానికి ఎంతో శ్రమపడే వాళ్లం. ఈ క్రమంలో చాలా హృదయ విదారకరమైన పరిస్థితుల్ని చూశా. కొన్నిసార్లు మనసు ద్రవించిపోయేది. అయితే అవసరార్థులకు సాయమందించే క్రమంలో స్వచ్ఛంద సేవకులు దోపిడీకి గురికావడం చూశా. అన్నిసార్లు మన సహాయం సరైన వ్యక్తులకు చేరుతుందా? లేదా? అన్నది తెలుసుకోవడం కష్టమవుతోంది. ఫలితంగా ఆక్సిజన్‌ సిలిండర్లు, ఇతర ఔషధాలు పక్కదారి పడుతున్నాయి. వాటిని అవసరమైన వ్యక్తులు పొందలేకపోతున్నారు. కాబట్టి ఎవరికైనా ఇలాంటి తప్పుడు వ్యక్తుల గురించి తెలిస్తే.. వారి వివరాలను ఫోన్‌ నంబర్లు సహా సామాజిక మాధ్యమాల ద్వారా పోలీసులకు రిపోర్ట్‌ చేయండి. ఫలితంగా మరొకరు వారికి బలైపోరు. ఎందుకంటే దేశ వ్యాప్తంగా పని చేస్తున్న స్వయం సహాయ బృందాలన్నీ పౌరుల నేతృత్వంలోనివి. వారు దోపిడీకి గురి కావడం నాకిష్టం లేదు’’ అని భూమి చెప్పుకొచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని