Perni Nani: మోహన్‌బాబుతో భేటీపై విష్ణు ట్వీట్‌.. మంత్రి పేర్ని నాని స్పందన

సీనియర్‌ నటుడు మోహన్‌బాబుని తాను వ్యక్తిగతంగానే కలిశానని, రాష్ట్ర ప్రభుత్వానికి ఆ మీటింగ్‌తో ఎలాంటి సంబంధంలేదని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని అన్నారు. శుక్రవారం మోహన్‌బాబు....

Published : 12 Feb 2022 10:04 IST

హైదరాబాద్‌: సీనియర్‌ నటుడు మోహన్‌బాబును తాను వ్యక్తిగతంగానే కలిశానని, రాష్ట్ర ప్రభుత్వానికి ఆ మీటింగ్‌తో ఎలాంటి సంబంధంలేదని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని అన్నారు. శుక్రవారం మోహన్‌బాబు కుటుంబాన్ని ఆయన కలిసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఫొటోను విష్ణు ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. తెలగు చిత్రపరిశ్రమ సంక్షేమానికి కృషి చేస్తున్నందుకు నానికి విష్ణు ధన్యవాదాలు చెప్పారు. గురువారం చిరంజీవి, ఇతర సినీ పెద్దలు ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమైన తర్వాత మోహన్‌బాబును నాని కలవడంపై పలు మీడియాల్లో వరుస కథనాలు చక్కర్లు కొట్టాయి. ఈ కథనాలపై మంత్రి స్పందించారు.

‘‘మోహన్‌బాబు నాకు ఎప్పటి నుంచో ఆప్తమిత్రుడు. 2002 నుంచి మా ఇద్దరి మధ్య స్నేహం ఉంది. మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట్లో జరిగిన పెళ్లి కోసం నేను హైదరాబాద్‌ వెళ్లాను. అదే సమయంలో కాఫీకి రమ్మని మోహన్‌బాబు నుంచి ఆహ్వానం అందడంతో ఆయన ఇంటికి వెళ్లాను. మేమిద్దరం కాసేపు మాట్లాడుకున్నాం. జగన్‌తో సినీ ప్రముఖుల భేటీకి తాను వద్దామనుకున్నా. కాకపోతే ఎవరి నుంచీ కబురు అందకపోవడంతో రాలేదని చెప్పారు. అదే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్‌కు చెప్పమని చెప్పారు. అక్కడ నుంచి బయలుదేరే సమయంలో విష్ణు నన్ను శాలువాతో సత్కరించారు. అయితే, మొన్న సినిమా ప్రముఖులతో జరిగిన మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాలపై వివరణ ఇచ్చేందుకే మోహన్‌బాబుని కలిశానంటూ వార్తలు రావడం విచారకరం. ఇదే విషయంపై కొంతమంది మీడియా వాళ్లని అడగ్గా.. మంచు విష్ణు ఆ విధంగా ట్వీట్ చేశాడని.. అందుకే తాము అలా రాశామని చెప్పారు. దీనిపై విష్ణుకు ఫోన్‌ చేశా. ‘మొదట చేసిన ట్వీట్‌ని మార్చి మరోసారి ట్వీట్‌ చేశాన’ని అన్నారు’’ అని నాని చెప్పుకొచ్చారు.

మంత్రి నానిని సత్కరించడం తనకి ఎంతో ఆనందంగా ఉందని మొదట విష్ణు ట్వీట్‌ చేశారు. ‘‘తెలుగు చిత్రపరిశ్రమ కోసం ఏపీ ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయాలు, టికెట్‌ ధరల పెంపు విషయంపై మాకు సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు. టాలీవుడ్‌ ప్రయోజనాలు సంరక్షిస్తున్నందుకు కృతజ్ఞతలు’’ అని అందులో రాసుకొచ్చారు. అనంతరం ఆ ట్వీట్‌ని డిలీట్‌ చేసిన ఆయన.. తన నివాసంలో నానిని సత్కరించడం ఆనందంగా ఉందని, టాలీవుడ్‌ ప్రయోజనాలను సంరక్షిస్తున్నందుకు ధన్యవాదాలు అని మార్చి ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని