Perni Nani: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బడ్జెట్‌ ఇదే: పేర్ని నాని

సినిమా టికెట్‌ ధరలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో నం:13ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం, నిర్మాణ వ్యయం రూ.100 కోట్లు దాటిన చిత్రాలకు..

Updated : 17 Mar 2022 17:36 IST

అమరావతి: సినిమా టికెట్‌ ధరలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో నం:13ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం, నిర్మాణ వ్యయం రూ.100 కోట్లు దాటిన చిత్రాలకు..  మొదటి పదిరోజులపాటు ప్రత్యేక టికెట్‌ ధరలు పెట్టుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఈ క్రమంలోనే మరి కొన్నిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు టికెట్‌ ధరలు పెంచుకునే అవకాశం ఇవ్వమని కోరుతూ రాజమౌళి, నిర్మాత దానయ్య.. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయ్యారు. టికెట్‌ ధరల పెంపునకు సంబంధించి వినతి పత్రం అందించారు. ఈ విషయంపై తాజాగా ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని స్పందించారు.

‘‘దర్శకుడు, నటీనటుల పారితోషికం కాకుండా చిత్ర నిర్మాణానికి రూ.100 కోట్లు బడ్జెట్‌ దాటితే.. విడుదలైన పదిరోజులపాటు టికెట్‌ ధరలు పెంచుకునే అవకాశం ఉందని జీవో నం: 13లో పొందుపరిచాం. అందులో భాగంగానే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి టికెట్‌ ధరల పెంపుకు వినతి పత్రం అందింది. జీఎస్టీ, దర్శకుడు, నటీనటుల పారితోషికం కాకుండా చిత్రానికి రూ.336 కోట్లు ఖర్చు చేసినట్లు వినతి పత్రంలో పేర్కొన్నారు. ప్రస్తుతం సంబంధిత అధికారులు చిత్రబృందం ఇచ్చిన వివరాలు పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఆ ఫైల్‌ని ముఖ్యమంత్రికి పంపిస్తాం. ప్రజలపై ఎలాంటి భారం లేకుండా ప్రత్యేక టికెట్‌ ధర ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రంలో 20 శాతం షూటింగ్‌ నిబంధన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కు వర్తించదు. ఎందుకంటే జీవో రావడానికి ముందే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నిర్మించారు. కొత్తగా నిర్మించే చిత్రాలకు ఈ నిబంధనలు తప్పకుండా వర్తిస్తాయి’’ అని పేర్ని నాని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని