Piyush Mishra: బాలీవుడ్‌ వాళ్ల కంటే దక్షిణాది దర్శకులు తెలివైన వాళ్లు..:పీయూశ్‌ మిశ్రా

బాలీవుడ్‌ దర్శకుల కంటే దక్షిణాది వాళ్లు చాలా తెలివైన వాళ్లని నటుడు పియూశ్‌ మిశ్రా(Piyush Mishra) అన్నారు. ఇండియన్‌2(Indian 2) సినిమాలో శంకరతో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు. 

Published : 19 Dec 2022 17:25 IST

హైదరాబాద్‌: ఈ సంవత్సరం దక్షిణాది చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. ‘కేజీయఫ్‌2’ నుంచి ‘కాంతార’ వరకు అన్ని సౌత్‌ సినిమాలు బాక్సాఫీసు వద్ద బారీ వసూళ్లు సొంతం చేసుకున్నాయి. కొవిడ్‌ తర్వాత బాలీవుడ్‌ సినిమాలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోతున్నాయి. ఇప్పటికే కొంతమంది నటీనటులు ఈ విషయంపై మాట్లాడారు. హిందీ సినిమాలు ఎందుకు విజయం సాధించలేకపోయాయో సూచించిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ నటుడు, రచయిత, గాయకుడు పియూశ్‌ మిశ్రా(Piyush Mishra) కూడా దీనిపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. బాలీవుడ్‌ దర్శకులు అందరూ ఒకే విధమైన సినిమాలు తీస్తున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు.

‘బాలీవుడ్‌ వాళ్ల కంటే దక్షిణాది సినిమా దర్శకులు చాలా తెలివైన వాళ్లు. మనకంటే ఎక్కువ క్రియేటివిటీ ఉన్నవాళ్లు. హిందీ సినీ పరిశ్రమలో ఉన్న వాళ్లందరూ ఒకే రకంగా ఆలోచిస్తూ.. అలానే సినిమాలు తీస్తున్నారు. అదే మా మూర్ఖత్వం’ అని పియూశ్‌ మిశ్రా అన్నారు. ప్రస్తుతం ఈ బాలీవుడ్‌ నటుడు శంకర్‌ దర్శకత్వంలో కమల్‌ హాసన్‌ నటిస్తున్న ‘ఇండియన్‌2’(Indian 2)లో కనిపించనున్నాడు. శంకర్‌తో పనిచేసిన అనుభవం గురించి కూడా పియూశ్‌ వెల్లడించారు.‘శంకర్‌తో పనిచేయడం అద్భుతమైన అనుభవం. కాన్సెప్ట్‌ సింపుల్‌గా ఉంటుంది. కానీ ఆయన ప్రతి సన్నివేశాన్ని చాలా శ్రద్ధతో చేస్తారు’ అని ప్రశంసించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని