
ప్రధాని మోదీని కలిసిన మాధవన్, నంబీ
ఇంటర్నెట్‌డెస్క్: వైవిధ్య కథలు, పాత్రలు ఎంచుకునే నటుల్లో మాధవన్ ముందుంటారు. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబీ నారాయణ్ జీవిత కథ ఆధారంగా ఆయన నటిస్తున్న చిత్రం ‘రాకెట్రీ’. కాగా, కొన్ని వారాల కిందట నంబీ నారాయణతో కలిసి ప్రధాని నరేంద్రమోదీని కలిసినట్లు మాధవన్ తెలిపారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఫొటోలను పంచుకున్నారు. ఇస్రోలో విశేష సేవలందించిన నంబీ నారాయణ్ 1994లో దేశద్రోహిగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. కేసులు, కోర్టు విచారణల అనంతరం ఆయన నిర్దోషిగా తేలారు. ఆనాడు ఆయనకు ఎదురైన చేదు అనుభవాల పట్ల మోదీ విచారం వ్యక్తం చేశారు.
‘‘కొన్ని వారాల కిందట నంబీ నారాయణకు, నాకూ ప్రధాని మోదీ నుంచి గౌరవ సూచికంగా పిలుపు వచ్చింది. ఆయనను కలిసిన సందర్భంగా ‘రాకెట్రీ: ది ఫిల్మ్’ గురించి మాట్లాడాం. చిత్రానికి సంబంధించిన కొన్ని క్లిప్స్ చూపించాం. గతంలో నంబీజీకి జరిగిన దాని పట్ల ప్రధాని విచారం వ్యక్తం చేశారు. మిమ్మల్ని కలవటం మాకు దక్కిన గౌరవం మోదీ సర్’’ అని మాధవన్ ట్వీట్ చేశారు.
ఆర్.మాధవన్ స్వీయ దర్శకత్వంలో ‘రాకెట్రీ’ తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబీ నారాయణ్ పాత్రలో మాధవన్ ఒదిగిపోయారు. ఇందులో సూర్య, షారుఖ్‌లు అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. తమిళ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.