Pongal Release: ముందు బాలకృష్ణ, విజయ్‌.. తర్వాత చిరంజీవి.. మరి అజిత్‌?

2023 సంక్రాంతి సీజన్‌కు నలుగురు అగ్ర హీరోల చిత్రాల మధ్య ఆసక్తికర పోటీ ఉండబోతుంది.  ఏ హీరో సినిమా ఎప్పుడు విడుదలవుతుందంటే..

Published : 08 Dec 2022 01:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు సినిమాల విడుదల విషయంలో అతి పెద్ద సీజన్‌ సంక్రాంతి (Pongal). అందుకే కెరీర్‌లో ఒక్కసారైనా ‘పొంగల్‌ విన్నర్‌’ అనిపించుకోవాలని చాలామంది హీరోలు ఆశ పడుతుంటారు. తమిళ నటులూ ఇక్కడ పోటీ పడేందుకు ఆసక్తి చూపిస్తారు. కొందరు ఎన్ని ప్రణాళికలు వేసినా అనివార్య కారణంగా సంక్రాంతి సీజన్‌ ముందుకో, వెనక్కో వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అలా కొందరు కథానాయకులు డ్రాప్‌ అవగా 2023 సంక్రాంతి రేసు హీరోల జాబితాలో చిరంజీవి, బాలకృష్ణ, విజయ్‌, అజిత్‌ నిలిచారు. అజిత్‌ మినహా ఇతర హీరోలు తమ సినిమాల విడుదల తేదీని ప్రకటించేశారు. మరి, ఏ చిత్రం ఏ రోజు అంటే? (Sankranthi Movies)

ఒకే రోజు ఇద్దరు..

2023 జనవరి 12న టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు బాలకృష్ణ (Nandamuri Balakrishna), కోలీవుడ్‌ ప్రముఖ హీరో విజయ్‌ (Vijay) చిత్రాలు బాక్సాఫీసు వద్ద పోటీపడనున్నాయి. విజయ్‌తో దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తోన్న‘వారిసు’ (తెలుగులో వారసుడు) #varisu విడుదల తేదీ ముందు ఖరారుకాగా ఆ తర్వాత అదే డేట్‌కు ‘మేం వస్తున్నాం’ అంటూ ‘వీర సింహారెడ్డి’ (Veera SimhaReddy) చిత్ర బృందం ప్రకటించింది. బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్‌ మలినేని తెరకెక్కిస్తున్న సినిమా ఇది. శ్రుతిహాసన్‌ కథానాయిక. ‘వారిసు’లో విజయ్‌తో కలిసి రష్మిక ఆడిపాడింది. రెండింటికీ సంగీత దర్శకుడు తమన్‌.

చిరు ఆగమనం అప్పుడే

బాలకృష్ణ, విజయ్‌ సినిమాల రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అవడంతో సినీ అభిమానుల దృష్టంతా చిరంజీవి (Chiranjeevi) చిత్రంపైనే నెలకొంది. ‘ఈ ఇద్దరి కంటే ముందు వస్తారా? తర్వాత వస్తారా?’ అన్న ప్రశ్నకు తాజాగా సమాధానం లభించింది. బాబీ దర్శకత్వంలో చిరు నటిస్తోన్న ‘వాల్తేరు వీరయ్య’ (waltair veerayya) విడుదల ప్రకటన వచ్చేసింది. ఒక్కరోజు ఆలస్యంగా అంటే జనవరి 13న వీరయ్యగా  చిరంజీవి ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ చిత్రంలో చిరు సరసన శ్రుతిహాసన్‌ సందడి చేయనుంది. దేవి శ్రీ ప్రసాద్‌ స్వరాలందించారు.

తునివు తేల్చాలి..!

అజిత్‌ (Ajith) హీరోగా హెచ్‌. వినోద్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘తునివు’ (Thunivu). తమిళం, తెలుగులో ఈ సినిమాని ముగ్గుల పండక్కి తీసుకొస్తున్నట్టు చిత్ర బృందం చెప్పినా ఇప్పటి వరకూ తేదీని ప్రకటించలేదు. జనవరి 12న రెండు సినిమాలు, 13న ఓ చిత్రం ఉన్నాయి కాబట్టి ‘తునివు’ని వాటి కంటే ముందే తీసుకొస్తారా? 14న ఖరారు చేస్తారా? కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఈ నాలుగు సినిమాలూ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లుకావడం విశేషం.

చిన్న సినిమాలు లేవా..?

సంక్రాంతికి పెద్ద సినిమాలే కాదు చిన్న చిత్రాలూ విడుదలై, మంచి విజయం అందుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ నాలుగు ప్రాజెక్టులతోపాటు కొన్ని చిన్న చిత్రాలూ సందడి చేయనున్నాయి. రాహుల్‌ విజయ్‌, శివానీ రాజశేఖర్‌ జంటగా తెరకెక్కిన ‘విద్య వాసుల అహం’ జనవరి 14న విడుదల కానుంది.  సంతోష్‌ శోభన్‌ హీరోగా నటించిన ఓ సినిమా సంక్రాంతికే వస్తుందని సమాచారం.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు