Ponniyin Selvan: మరో ‘బాహుబలి’ అవసరం లేదు: ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ వేడుకలో కార్తి

‘పొన్నియిన్‌ సెల్వన్‌’ సినిమా.. ‘బాహుబలి’లా ఉంటుందా? అని చాలామంది అడుగుతున్నారని, ఆ గొప్ప చిత్రం అందరికీ నచ్చిందని ఇప్పుడు మరో ‘బాహుబలి’ అవసరం లేదని నటుడు కార్తి అన్నారు.

Published : 23 Sep 2022 22:57 IST

హైదరాబాద్‌: ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ సినిమా.. ‘బాహుబలి’లా ఉంటుందా? అని చాలామంది అడుగుతున్నారని, ఆ చిత్రం అందరికీ నచ్చిందని ఇప్పుడు మరో ‘బాహుబలి’ అవసరం లేదని నటుడు కార్తి అన్నారు. విక్రమ్, ఐశ్వర్యరాయ్‌, త్రిష, జయం రవి తదితరులతో కలిసి ఆయన నటించిన చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌-1’ (Ponniyin Selvan). ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో కార్తి మాట్లాడారు. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబరు 30న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్‌లో నిర్వహించిన వేడుకకు విచ్చేసి, సందడి చేశారు.

వేడుకనుద్దేశించి కార్తి మాట్లాడుతూ.. ‘‘సినిమా ఎంత గొప్ప మాధ్యమమో ఇలాంటి కథల్లో నటించేటప్పుడు మరింత బాగా అర్థమవుతుంది. మణిరత్నంగారి కలల ప్రాజెక్టు ఇది. ‘ఇది బాహుబలి సినిమాలా ఉంటుందా?’ అని చాలామంది అడుగుతున్నారు. ‘బాహుబలి’ని మనం చూశాం, బాగా నచ్చింది. మనకు మరో ‘బాహుబలి’ అవసరం లేదు. భారతీయత గురించి చాటి చెప్పే ఎన్నో కథలున్నాయి. మన నేలపై పుట్టిన ఎందరో హీరోల గురించి చెప్పాల్సి ఉంది. అలా రూపొందిన చిత్రమే ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. ఈ సినిమాలో రొమాన్స్‌, అడ్వెంచర్‌, రాజకీయం.. ఇలా కోణాలున్నాయి. ఈ చిత్రంలో నటించటం గొప్ప వరంగా భావిస్తున్నా. ఎ. ఆర్‌. రెహమాన్‌ నాకు స్ఫూర్తి’’ అని కార్తి పేర్కొన్నారు.

‘‘మీరంతా (తెలుగు ప్రేక్షకులు) సినిమా పిచ్చోళ్లు. మణిరత్నంగారు చాలా అద్భుతంగా తెరకెక్కించిన సినిమా ఇది. ఇందులోని ప్రతి పాత్రకు ప్రత్యేకత ఉంది. అందుకే  మేం ఇంతమంది కలిసి నటించాం. నాకెన్నో హిట్‌ పాటలు ఇచ్చిన సంగీత దర్శకుడు ఎ. ఆర్‌. రెహమాన్‌గారికి ఈ వేదికగా మరోసారి ధన్యవాదాలు’’ అని విక్రమ్‌ అన్నారు.

‘‘42 ఏళ్లుగా నన్ను ఆదరించినట్టుగానే ఈ సినిమానీ మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నా. మా పెళ్లికి ముందు మణిరత్నం నాకు ఊహించని బహుమతి ఇచ్చారు. అది ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ పుస్తకాలున్న పెద్ద బ్యాగ్‌. వాటిని చదివి ఒక్క లైన్‌లో చెప్పమనేవారు. నా వంతు ప్రయత్నించినా అది సఫలం కాలేదు. పెళ్లికాదేమో అనుకున్నా (నవ్వుతూ..). పెళ్లైన 34 సంవత్సరాల తర్వాత ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇది తమిళంలో రూపొందిన సినిమానే అయినా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనే చిత్రీకరించాం. ఇది మీ సినిమా. మీరంతా ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలి. ఈ సినిమాలో నటించిన నటులు, సాంకేతిక నిపుణులు, ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న దిల్‌రాజుగారికి థ్యాంక్స్‌. మణిరత్నం- రెహమాన్‌ల బంధాన్ని నిర్వచించటం కష్టం. ఈ సినిమాలో నందిని అనే పాత్ర పోషించిన ఐశ్వర్యరాయ్‌గారిని ప్రపంచం ప్రశంసించబోతోంది’’ అని సుహాసిని ప్రసంగించారు.

‘‘నన్ను సాదరంగా ఆహ్వానించిన మీ అందరికీ థ్యాంక్స్‌. మణిరత్నంగారు ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. విక్రమ్‌, కార్తి, జయం రవి, శరత్‌కుమార్‌, ప్రభు, విక్రమ్‌ ప్రభు, త్రిషలాంటి నటులతో కలిసి పనిచేయటం మరిచిపోలేని జ్ఞాపకం. ఈ సినిమాని మీరంతా ఆనందిస్తారని ఆశిస్తున్నా. సుహాసినిగారితో నాకు మంచి అనుబంధం ఉంది’’ అని  ఐశ్వర్యరాయ్‌ తన కెరీర్‌ను గుర్తు చేసుకున్నారు.

‘‘చాలా కాలం తర్వాత హైదరాబాద్‌ వచ్చా. మీ అందరినీ మళ్లీ కలవటం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నటించే అవకాశం నాకు ఇచ్చినందుకు దర్శకనిర్మాతలు, తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న దిల్‌రాజుగారికి ధన్యవాదాలు’’ అని త్రిష అన్నారు.

‘‘38 ఏళ్ల క్రితం నా సంగీత ప్రయాణం తెలుగు సినిమాలతోనే మొదలైంది. రమేశ్‌నాయుడు, చక్రవర్తి, రాజ్‌-కోటి,సత్యం.. వీరందరి దగ్గర నేను ఎంతో నేర్చుకున్నా. ఈ సినిమాని చూసి ఆనందించండి’’ అని రెహమాన్‌ అభిమానులకు చెప్పారు.

‘‘ఈ రోజుల్లో ఒక్క పెద్ద హీరోతో సినిమా చేయటమే చాలామందికి కష్టం. అలాంటిది ఇంతమంది అగ్ర తారలతో మణిరత్నం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ రెండు భాగాలను తెరకెక్కించటం గొప్ప విషయం. 50 ఏళ్లనాటి కథని భారతీయ సినీ అభిమానులకు చూపించాలనుకోవటం అభినందనీయం. ఇప్పుడు ఫలానా భాష సినిమా అని లేదు. కంటెంట్‌ బాగున్న ప్రతి సినిమా అన్ని చోట్లా విజయం సాధిస్తుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘కేజీయఫ్‌’, ‘పుష్ప’, ‘కార్తికేయ 2’లానే ‘పొన్నియిన్‌ సెల్వన్’ కూడా అద్భుతం సృష్టిస్తుందనే నమ్మకం ఉంది. ఎ. ఆర్‌. రెహమాన్‌గారి గురించి మాట్లాడటం సంతోషంగా ఉంది. ఆయన్ను చూసి భారతీయులంతా గర్విస్తారు’’ అని దిల్‌ రాజు అన్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని