Pooja Hegde: వాటిని చూసి.. స్ఫూర్తి పొందుతా!

‘‘నా ఇంటిని నిర్మించేటప్పుడే నేనెలాంటి వ్యక్తిని.. నా ఇష్టాయిష్టాలు ఎలా ఉన్నాయి? అన్నది తెలిసింది’’ అంటోంది నటి పూజా హెగ్డే. ఆమె గతేడాది ముంబయిలో ఓ ఇంటిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

Updated : 19 Nov 2022 06:57 IST

‘‘నా ఇంటిని నిర్మించేటప్పుడే నేనెలాంటి వ్యక్తిని.. నా ఇష్టాయిష్టాలు ఎలా ఉన్నాయి? అన్నది తెలిసింది’’ అంటోంది నటి పూజా హెగ్డే (Pooja Hegde). ఆమె గతేడాది ముంబయిలో ఓ ఇంటిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తన అభిరుచులకు తగ్గట్లుగా సరికొత్తగా ముస్తాబు చేసుకున్న ఆ ఇంటిని.. సామాజిక మాధ్యమాల ద్వారా అందరికీ చూపించింది పూజా. ‘‘జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశా. ఇప్పటి వరకు జీవిత ప్రయాణంలో నా గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నా. నా ఇంటిని నిర్మించే క్రమంలో నేనెలాంటి వ్యక్తిని.. నా అభిరుచులు ఎలా ఉన్నాయి అనేది మరింత స్పష్టంగా తెలిసింది. ఈ ఇంటిని కార్మికులు ఎంతో శ్రద్ధ, ప్రేమతో తీర్చిదిద్దారు. సినిమాల్లో పనిచేయడం వల్ల ప్రతిదానికీ ఓ కథ ఉండేలా చూడటం అలవాటైంది. అందుకే నా ఇంటి ప్రవేశ ద్వారాన్ని ప్రత్యేకంగా.. చాలా స్టైలిష్‌గా రూపొందించుకున్నా. ఈ ప్రధాన ద్వారం నా ఇంటికి ట్రైలర్‌ లాంటిది. న్యూయార్క్‌, లండన్‌ దేశాల్లోని స్టైల్‌ ఉట్టిపడేలా ఇంటిలోని ప్రతి స్పేస్‌ని డిజైన్‌ చేశా. ఇంట్లో వాళ్లతో మాట్లాడుతూ.. వంటలు చేయడమంటే నాకిష్టం. అందుకే ఓపెన్‌ కిచెన్‌ ఏర్పాటు చేసుకున్నా. నాకిష్టమైన సినిమాలు, సందేశాలతో ఓ గోడను సిద్ధం చేయించా. వాటిని చూస్తే నేనెప్పుడూ స్ఫూర్తి పొందుతా. మా కుటుంబంతో కలిసి పడక గదిలోనే సినిమాలు చూస్తాం’’ అంటూ తన ఇంటిలోని ప్రతి గదినీ పరిచయం చేసింది ఈ బుట్టబొమ్మ. అంతేకాదు తాను ఉపయోగించే హ్యాండ్‌ బ్యాగ్స్‌, పాదరక్షలు, మేకప్‌ సామాగ్రిని సైతం ఈ వీడియో ద్వారా చూపించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని