Radhe Shyam: ‘ముకుంద’కు అలా అన్నారు.. ‘డీజే’కు ఇలా ఫిక్సయ్యారు: పూజాహెగ్డే

పూజాహెగ్డే ఇంటర్వ్యూ. ప్రభాస్‌ సరసన నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్‌’ గురించి పంచుకున్న విశేషాలివీ...

Published : 06 Mar 2022 18:42 IST

హైదరాబాద్‌: తాను నటించిన తొలి తెలుగు చిత్రం ‘ముకుంద’లోని పాత్రను కొందరు విమర్శించారని, తర్వాత నటించిన ‘డీజే’ సినిమాలోని గ్లామర్‌ పాత్ర చూసి మరికొందరు ఆశ్చర్యానికి గురయ్యారని పూజాహెగ్డే అన్నారు. ప్రభాస్‌ సరసన నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్‌’ మార్చి 11న విడుదలవుతున్న నేపథ్యంలో ఆమె మీడియాతో ముచ్చటించారు. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హస్తసాముద్రికా నిపుణుడిగా ప్రభాస్‌, ప్రేరణగా పూజాహెగ్డే కనిపించనున్నారు. ఈ సినిమా విశేషాలతోపాటు తన గత చిత్రాల్లోని పాత్రలను గుర్తుచేసుకున్నారు పూజా. ఆ వివరాలివీ..

* ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది?

పూజాహెగ్డే: నేనిందులో ప్రేరణ అనే పాత్రలో కనిపిస్తా. ఇందులో చాలా షేడ్స్‌ ఉంటాయి. పాత్రలో ఒదిగిపోయేందుకు కొంత రీసెర్చ్‌ చేశా. ఇలాంటి సీరియస్‌ క్యారెక్టర్‌ను నేనిప్పటి వరకూ పోషించలేదు. ఓ రకంగా చెప్పాలంటే ఇది నా కెరీర్‌లో సవాలు విసిరిన పాత్ర. ఈ చిత్రంలో మీరు కొత్త పూజాహెగ్డేను చూస్తారు. ఈ సినిమా, ప్రేరణ పాత్రతో సుమారు నాలుగేళ్లు ప్రయాణించా. ఈ ప్రయాణంలో నటిగా ఎన్నో విషయాలు నేర్చుకున్నా.

* మీ సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటే ఏమనిపిస్తుంటుంది?

పూజాహెగ్డే: తెలుగులో నా తొలి చిత్రం ‘ముకుంద’ సమయంలో ‘పూజా.. గ్లామర్‌ పాత్రలు చేయలేదు’ అని చాలామంది అన్నారు. ‘డీజే’ (దువ్వాడ జగన్నాథం) సినిమాలోని పాత్రను చూశాక ‘పూజా కేవలం గ్లామర్‌ పాత్రలే చేయగలదు’ అని ఫిక్స్‌ అయ్యారు. ఇలాంటి వారి మాటలు నేను పట్టించుకోను. సినిమాకు ఏం కావాలో, పాత్ర ఏం డిమాండ్‌ చేస్తుందో దాన్నే దృష్టిలో పెట్టుకుంటా. నా మనసుకు నచ్చిన పాత్రల్నే నేనెప్పుడూ ఎంపిక చేసుకుంటా. వాటిని ఆదరించిన ప్రేక్షకులకు రుణపడి ఉంటా.

* సినిమాలో ఆస్ట్రాలజీ గురించి చూపించబోతున్నారు. వ్యక్తిగతంగా మీరు ఆస్ట్రాలజీ నమ్ముతారా?

పూజాహెగ్డే: ఆస్ట్రాలజీ (జ్యోతిషశాస్త్రం) అనేది సైన్సు. దానిపై నాకు నమ్మకం ఉంది.

* మీరిప్పటికే చాలామంది హీరోలతో కలిసి నటించారు. ప్రభాస్‌తో నటించడం ఎలా ఉంది?

పూజాహెగ్డే: ఎవరి ప్రత్యేకత వారిది. ఎన్టీఆర్‌.. చాలా హుషారుగా, సింగిల్‌ టేక్‌లో నటిస్తాడు. అల్లు అర్జున్‌  ఎంతో చలాకీగా ఉంటాడు. ప్రభాస్‌కు కొంచెం సిగ్గు. కానీ, ఒక్కసారి పరిచయమైతే ఎంతో సరదాగా ఉంటాడు. ఓ సారి నా బృంద సభ్యుల్లో పలువురికి కొవిడ్‌ వస్తే తానే ఇంటి దగ్గర నుంచి ఆహారం తీసుకొచ్చాడు. ఆ వంటలకూ నాతోపాటు మా అమ్మా ఫిదా అయింది.

* ఈ సినిమా చిత్రీకరణలో మరిచిపోలేని జ్ఞాపకం?

పూజాహెగ్డే: అదీ ఇదీ అని చెప్పలేను. ఎందుకంటే షూటింగ్‌ మొత్తం కొత్త అనుభూతిని పంచింది. తెలుగు, హిందీ వెర్షన్లను ఏకకాలంలో చిత్రీకరించడంతో రెండు సినిమాల్లో నటించినట్టుంది. కథ ఒకటే అయినా సంభాషణలు పలికే విధానంలో మార్పుంటుంది. వ్యక్తిగతంగా నాకు తెలుగు డైలాగ్స్‌, పాటలు బాగా నచ్చాయి. 

* ఎన్నో ప్రేమకథల్లో నటించారు కదా. మీరు ఎవరినైనా ప్రేమించారా?

పూజాహెగ్డే: ప్రేమించేందుకు ప్రస్తుతానికి నాకు సమయం లేదు (నవ్వులు). వరుస సినిమాలతో బిజీగా ఉన్నా. చూద్దాం.. ఎప్పుడు ఏమవుతుందో!!

* పలు పాన్‌ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నారు. మిమ్మల్ని పాన్‌ ఇండియా నటి అంటుంటే ఎలా ఉంది?

పూజాహెగ్డే: అన్ని భాషల వారికి నా నటన నచ్చాలని చూస్తాను కానీ అది పాన్‌ ఇండియానా మరొకటా అనే విషయం గురించి ఆలోచించను. నేను వేరే రాష్ట్రానికి చెందిన అమ్మాయిని, నాకు తెలుగు రాదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. నేను తెలుగులో కొద్దిగా మాట్లాడినా దాన్ని మీరు మెచ్చుకుంటారు. అలానే ఇతర భాషల వారిని అలరించాలనుంటుంది. అందుకే ముందు భాషపై పట్టుసాధించే ప్రయత్నం చేస్తుంటా.

నేను సిగ్గరిని..

‘‘బాల్యంలో నేను చాలా సిగ్గరిని. నలుగురిలో ఏదైనా మాట్లాడాలన్నా, స్టేజ్‌పై ప్రదర్శన ఇవ్వాలన్నా ఇబ్బందిగా ఫీలయ్యేదాన్ని. అలాంటి నాలో మార్పు తీసుకొచ్చేందుకు మా అమ్మ ప్రయత్నించింది. దానిలో భాగంగా భరతనాట్యం నేర్పించింది. అదే.. హృతిక్‌రోషన్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌లాంటి వారితో కలిసి డ్యాన్స్‌ చేసే ధైర్యానిచ్చింది’’.

అందుకు చాలా ఆనందం..

‘‘కొందరు నటులు, దర్శకనిర్మాతలతో మళ్లీ మళ్లీ పనిచేస్తుండటం చాలా ఆనందంగా ఉంది. నాపై ఉన్న నమ్మకంతో అవకాశం ఇస్తున్నారు. దాన్ని నిలబెట్టుకునేందుకు నావంతు ప్రయత్నిస్తున్నా. హారికా హాసిని క్రియేషన్స్‌, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థల్లో రెండేసి చిత్రాలు, త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రెండు , హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో రెండు, అల్లు అర్జున్‌ సరసన రెండు చిత్రాల్లో కనిపించా. మహేశ్‌బాబుతో కలిసి రెండో సినిమా చేస్తున్నా’’.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని