Pooja Hegde: ఆ 20 నిమిషాలు రోమాలు నిక్కబొడుచుకున్నాయి: పూజా హెగ్డే

‘కాంతార’ సినిమాపై తన అభిప్రాయాన్ని బయటపెట్టారు బుట్టబొమ్మ పూజాహెగ్డే. చిత్రాన్ని తెరకెక్కించిన రిషబ్‌ శెట్టి, ఇతర చిత్రబృందంపై ఆమె ప్రశంసల వర్షం కురిపించారు.

Published : 25 Oct 2022 02:24 IST

హైదరాబాద్‌: ఇండియన్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తోన్న ‘కాంతార’పై (Kantara) తన అభిప్రాయాన్ని వెల్లడించారు నటి పూజాహెగ్డే (Pooja Hegde). వరుస సినిమాలతో బిజీగా ఉంటోన్న ఈ భామ  తాజాగా ‘కాంతార’ వీక్షించారు. ఈ సినిమా అత్యద్భుతంగా ఉందని, ఓ ప్రాంతీయ సంస్కృతిని అందరికీ చేరువయ్యేలా తీర్చిదిద్దారని ఆమె అన్నారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టా వేదికగా ‘కాంతార’ రివ్యూ చెప్పారు.

‘‘మీకు ఏం తెలుసో దాన్నే కథ రాయండి. మీ హృదయానికి చేరువైన, మనసులో నుంచి వచ్చిన కథలనే చెప్పండి. ‘కాంతార’లోని చివరి 20 నిమిషాలకు నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. విజువల్స్‌, నటీనటుల ప్రదర్శనకు చలించిపోయా. రిషబ్‌ శెట్టి.. ‘కాంతార’ విశేషమైన ఆదరణ పొందుతున్నందుకు గర్వంగా ఉంది. నా చిన్నతనంలో చూసిన  భూతకోలని ఎంతో అద్భుతంగా చూపించి బిగ్గెస్ట్‌ హిట్‌ అందుకున్నావు. రానున్న రోజుల్లో నువ్వు మరెన్నో ప్రశంసలు అందుకోవాలి’’ అని పూజా హెగ్డే పేర్కొన్నారు. ఇక, రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కర్ణాటక, కేరళలో విస్తరించివున్న తుళునాడు ఆచారాలను ఆధారంగా చేసుకొని దీన్ని రూపొందించారు. స్థానిక గ్రామదేవతలను పూజించే భూతకోల సంస్కృతిని ఆధారంగా చేసుకుని ప్రకృతికి మనుషులకు మధ్య సత్సంబంధాలు ఉండాలని చూపించారు. ఎలాంటి అంచనాలు లేకుండా..  విడుదలైన ‘కాంతార’ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈసినిమా ఇప్పటివరకూ రూ.188 కోట్లు వసూళ్లు చేసినట్లు అంచనా.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు