poonam kaur: డ్రగ్స్‌ కేవలం సెలబ్రిటీలకు సంబంధించినదే కాదు!

poonam kaur: డ్రగ్స్‌ కేసుకు సంబంధించిన త్వరలోనే అనేక విషయాలను పంచుకోనున్నట్లు నటి పూనమ్‌ కౌర్‌ తెలిపారు.

Published : 04 Sep 2021 01:22 IST

హైదరాబాద్‌: ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్‌టాపిక్‌గా మారింది డ్రగ్స్‌ కేసు. దీనికి సంబంధించి మనీలాండరింగ్‌ ఏమైనా జరిగిందా? అన్న కోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌రేట్‌(ఈడీ) పలువురు సినీ తారలను ప్రశ్నిస్తోంది. దర్శకుడు పూరి జగన్నాథ్‌, నటి ఛార్మిలను ఈడీ ఇప్పటికే విచారించింది. శుక్రవారం కథానాయిక రకుల్‌ ఈడీ ఎదుట హాజరైంది. ఈ సందర్భంగా నటి పూనమ్‌ కౌర్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. డ్రగ్స్‌ అనేది కేవలం సెలబ్రిటీలకు సంబంధించిన అంశం మాత్రమే కాదని అన్నారు.

‘‘డ్రగ్స్‌ కేవలం సెలబ్రిటీలకు సంబంధించిన అంశం మాత్రమే కాదు. ఇది ప్రతీ ఒక్కరిది. ఇది ఒక సరిహద్దు సమస్యలాంటిది. రాజకీయ అజెండాకు సంబంధించింది. ఒక బలమైన ఆర్థిక వ్యవస్థకు సమానమైంది. ఈ విషయంపై నేను మాట్లాడాలనుకుంటున్నా. త్వరలోనే నా అనుభవాలను పంచుకుంటా’’ అని పూనమ్‌ ట్వీట్‌ చేశారు.

డ్రగ్స్‌ కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద సినీరంగానికి చెందిన 12 మందికి ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఆరో తేదీన ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే, షూటింగ్స్‌ ఉండటంచేత తాను హాజరు కాలేకపోతున్నానని.. కాస్త గడువు ఇవ్వాలని ఈడీ అధికారులను రకుల్‌ కోరారు. అందుకు అంగీకరించని అధికారులు.. మూడు రోజుల ముందుగానే విచారణ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఆమె ముందుగానే ఈడీ ఎదుట హాజరయ్యారు. మరోవైపు 8న రానా ఈడీ విచారణకి రానున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని