Poonam Kaur: అరుదైన వ్యాధితో బాధపడుతోన్న పూనమ్‌ కౌర్‌‌.. కేరళలో చికిత్స..!

పలు సినిమాల్లో నటించిన పూనమ్‌ కౌర్‌ ఆరోగ్యానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. కేరళలో చికిత్స పొందుతుందని సమాచారం. 

Updated : 03 Dec 2022 10:24 IST

హైదరాబాద్‌: ప్రముఖ సినీనటి పూనమ్ కౌర్ అనార్యోగానికి గురైంది. ఫైబ్రోమైయాల్జీయా వ్యాధితో పూనమ్ కౌర్ బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. నిద్రలేమి, కండరాల నొప్పులు, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, చర్మ సంబంధిత సమస్యలు ఫైబ్రోమైయాల్జీయా వ్యాధి లక్షణాలు. పూనమ్ కౌర్ కు ఈ వ్యాధి ఉన్నట్లు నవంబర్ 18న నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్న ఆమె... ఇటీవల కేరళలోని ఓ ఆయుర్వేద ఆస్పత్రిలో చికిత్స తీసుకుంది. ప్రస్తుతం పుణెలోని తన సోదరి నివాసంలో విశ్రాంతి తీసుకుంటోంది. అయితే పూనమ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబ ఆమె కుటుంబసభ్యులు తెలిపారు.

పూనమ్ కౌర్ సంవత్సరం నుంచి చేనేత కార్మికుల కోసం పోరాడుతోంది. చేనేత వస్త్రాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జీరో జీఎస్టీ పేరుతో సంతకాలు సేకరిస్తూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు చేనేత ఉద్యమకారుడు వెంకన్న నేతతో కలిసి కృషి చేస్తోంది. 2006లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాయాజాలం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన పూనమ్... తెలుగు, తమిళ, మలయాళంలో దాదాపు 35కుపైగా చిత్రాల్లో నటించింది. అంతేకాదు, సినిమాకు సంబంధించిన వ్యవహారాల్లో అయినా రాజకీయ విషయాల్లోనైనా తనదైనశైలిలో స్పందిస్తూ సోషల్‌మీడియాలో యాక్టివ్‌ ఉంటారు పూనమ్‌కౌర్‌.

పూనమ్‌కౌర్‌ ఆరోగ్యం నిలకడగానే ఉంది

‘‘గత సంవత్సర కాలంగా జీరో జీఎస్టీ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న పూనమ్ కౌర్ నవంబర్ 10వ తేదీన మాతో కలిసి సూరత్  గాంధీ పార్కులో చేనేతపై జీఎస్టి పన్ను ఎత్తివేయాలని నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. 11వ తేదీన సబర్మతి ఆశ్రమంలో మౌన దీక్ష చేసిన తర్వాత అదే రోజు సాయంత్రం 12వ తేదీ ఢిల్లీలో జరిగే బ్రహ్మకుమారి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అక్కడ ఆమెకు వెన్ను నొప్పి రావడంతో చికిత్స నిమిత్తం కేరళ వెళ్లారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకునే క్రమంలో ఆమెకు 18వ తేదీన ఫైబ్రో మయాల్జియా నిర్ధారణ అయ్యింది. కేరళలో చికిత్స అనంతరం ఆమె ప్రస్తుతం మహారాష్ట్రలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆమె పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు’’

-జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త, యర్రమాద వెంకన్న నేత


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు