Poonam Kaur: పెళ్లి విషయంలో కించపరిచారు.. సినిమా ఆఫర్‌ నేను అడగలేదు: పూనమ్‌ కౌర్‌

తాను వివాహం చేసుకోవాలనుకున్న ప్రతిసారీ కొందరు వ్యక్తులు కించపరిచారని నటి పూనమ్‌ కౌర్‌ అన్నారు. సినిమా ఆఫర్‌ విషయంలో తనపై వచ్చిన ఆరోపణలు అన్ని అవాస్తమేనని స్పష్టం చేశారు.

Published : 09 Mar 2022 01:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను వివాహం చేసుకోవాలనుకున్న ప్రతిసారీ కొందరు వ్యక్తులు కించపరిచారని నటి పూనమ్‌ కౌర్‌ (Poonam Kaur) తెలిపారు. సినిమా ఆఫర్‌ విషయంలో తనపై వచ్చిన ఆరోపణలు అన్ని అవాస్తమేనని స్పష్టం చేశారు. తాను ప్రధానపాత్ర పోషించిన ‘నాతిచరామి’ సినిమా ప్రచారంలో భాగంగా ఆమె వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు. అవి పూనమ్‌ మాటల్లోనే..

‘‘నేను మధ్యతరగతి అమ్మాయిని. అందరిలానే నాకూ పెళ్లి చేసుకుని, మంచి జీవితాన్ని గడపాలని ఉండేది. నేను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించిన ప్రతిసారీ కొందరు నన్ను కించపరిచేవారు. అలా ఎందుకు చేశారో, చేస్తున్నారో నేను ఆలోచించను. నా పనిపైనే దృష్టి పెడతా. జీవితంలో ఇంకా ఎదిగేందుకు ప్రయత్నిస్తుంటా. నా చుట్టూ ఎందరో రావణులు ఉన్నారు. నాలో దేవతాగుణం ఉంది కాబట్టి వారిని ఏం అనట్లేదు. అమ్మ విషయంలో నాకు ఎక్కువగా బాధ ఉంది. ఏ తల్లైనా కూతురికి త్వరగా పెళ్లి అయితే సంతోషిస్తుంది. ఈ విషయంలో అమ్మను తలచుకుంటే ఎమోషన్‌ అవుతా’’.

‘‘చాలామందికి నా గురించి తెలియదు. లాయరు, ఐఏఎస్‌, ఐపీఎస్‌.. వీటిల్లో ఏదైనా అవ్వాలనేది నా కల. ఆ కల నెరవేర్చుకునేందుకు కావాల్సిన డబ్బు కోసమే చిత్ర పరిశ్రమలోకి వచ్చా. కొందరి కారణంగా ఎన్నో పెద్ద ప్రాజెక్టులను వదులుకున్నా. నేను ఓ సినిమా అవకాశం కోసం ప్రముఖుల దగ్గరకు వెళ్లానని, వారు నాపై కోప్పడ్డారనేది నిజం కాదు. మరొకరిని టార్గెట్‌ చేసే క్రమంలో నన్ను ఓ ఆయుధంగా వాడారంతే. ఈ అసత్య వార్తలొచ్చిన సమయంలోనే నా ఇద్దరు పీఆర్వోలు చనిపోయారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు భగవంతుడిపైనే భారం వేశా. ‘నాతిచరామి’ సినిమా మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీకి చెందిన ఓ యువతి కథ. వ్యక్తిగతంగా నాకు కొంచెం దగ్గరగా ఉంటుంది. మీ అందరి సపోర్ట్‌ ఉంటుందని ఆశిస్తున్నా’’.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని