Bichagadu: ‘బిచ్చగాడు’ ఛాన్స్‌ మిస్‌ అయిన తెలుగు హీరో.. ఎందుకంటే?

కోలీవుడ్‌ సూపర్‌హిట్‌ చిత్రం ‘పిచ్చైకారన్‌’ రీమేక్‌ను టాలీవుడ్‌ ప్రముఖ హీరోతో తెరకెక్కించాలనుకున్నారట. అది సాధ్యంకాకపోవడంతో డబ్బింగ్‌ చేసి ‘బిచ్చగాడు’ పేరుతో విడుదల చేశారు. ఇంతకీ ఆ హీరో ఎవరంటే?

Published : 16 May 2023 01:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటుడు, సంగీత దర్శకుడు విజయ్‌ ఆంటోని (Vijay Antony) హీరోగా దర్శకుడు శశి తెరకెక్కించిన చిత్రం ‘పిచ్చైకారన్‌’ (Pichaikkaran). ‘బిచ్చగాడు’ (Bichagadu) పేరుతో తెలుగులో విడుదలైన ఈ సినిమా ఇక్కడా ఘన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్‌గా రూపొందిన ‘బిచ్చగాడు 2’ (Pichaikkaran 2) ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా.. ‘బిచ్చగాడు’లో నటించాల్సిన అవకాశం కోల్పోయిన తెలుగు హీరో గురించి తెలుసుకుందాం. ‘పిచ్చైకారన్‌’ను తెలుగులో రీమేక్‌ చేయాలనుకున్న దర్శక, నిర్మాతలు ప్రముఖ నటుడు శ్రీకాంత్‌ (Meka Srikanth)ను సంప్రదించారు. ఆ సినిమా ప్రివ్యూ చూసిన శ్రీకాంత్‌.. కథ బాగా నచ్చడంతో రీమేక్‌లో నటించేందుకు అంగీకరించారు. తమిళ్‌లో ఉన్న సెంటిమెంట్‌ కంటే మరింత ఎమోషన్‌తో తెరకెక్కించాలనుకున్నారు. అయితే, హీరో రెమ్యునరేషన్‌ ఎక్కువవుతుండడంతో బడ్జెట్‌ పెరిగిపోతుందనే ఉద్దేశంతో రీమేక్‌ను వదిలేశారు. దాంతో, డబ్బింగ్‌ చేసి విడుదల చేశారు.

ఈ విషయాన్ని శ్రీకాంత్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తాను హీరోగా నటించిన ‘మహాత్మ’ సినిమాకి విజయ్‌ ఆంటోని సంగీత దర్శకుడిగా పనిచేయడంతో ఇరువురి మధ్య స్నేహం ఏర్పడిందని, ఆ క్రమంలోనే ‘పిచ్చైకారన్‌’ను చూశానని తెలిపారు. తల్లీకొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా 2016 మార్చి 4న విడుదలై, ఊహించని విజయం సాధించింది. అనారోగ్యానికి గురైన తల్లి క్షేమం కోసం కోటీశ్వరుడు.. బిచ్చగాడిలా మారడమనే కాన్సెప్ట్‌ ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన డబ్బింగ్‌ సినిమాల జాబితాలో నిలిచింది. దాని సీక్వెల్‌ చిత్రానికి విజయ్‌ ఆంటోనినే దర్శకత్వం వహించడం విశేషం. ఇందులో అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్‌కు ప్రాధాన్యత ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు