
porn videos racket: రాజ్‌కుంద్రాకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
ముంబయి: అశ్లీల చిత్రాలకు సంబంధించిన కేసులో అరెస్టయిన నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అశ్లీల చిత్రాలను నిర్మించి.. వాటిని పలు యాప్‌లకు విక్రయిస్తున్నాడనే కేసులో రాజ్‌కుంద్రాను ముంబయి పోలీసులు ఈనెల 19న అరెస్టు చేశారు. కాగా రాజ్‌కుంద్రా పోలీసు కస్టడీ నేటితో ముగియనుంది. ఈనేపథ్యంలోనే.. విచారణ ముగిసిందని, తన క్లయింట్‌కు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా రాజ్‌కుంద్రా తరఫు లాయర్ కోర్టులో పిటిషన్ వేశారు. కాగా ఆ పిటిషన్‌ను ముంబయి కోర్టు కొట్టివేస్తూ.. రాజ్‌కుంద్రాకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో వైద్య పరీక్షల అనంతరం పోలీసులు ఈ వ్యాపారవేత్తను ఆర్థర్ రోడ్‌లోని జైలుకు తరలించారు.
అశ్లీల చిత్రాల రాకెట్ కేసులో ఈ నెల 19న రాజ్కుద్రాను అరెస్టు చేసిన పోలీసులు.. ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని పేర్కొంటున్నారు. 121 పోర్న్ వీడియోలకు సంబంధించిన అతి పెద్ద డీల్‌ను రాజ్‌కుంద్రా చేశారని శనివారం పోలీసులు కోర్టుకు వెల్లడించారు. ఆ మొత్తం వీడియోల విక్రయానికి గానూ 1.2 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.9కోట్లు) ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. రాజ్‌కుంద్రాతో సంబంధమున్న ప్రతిఒక్కరిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే విచారణకు హాజరుకావాలని బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రాకు సమన్లు జారీ చేశారు.