అలా ఉంటే కుక్క చావే.. ఇండస్ట్రీ బహిష్కరించినా బాధ లేదు: పోసాని

పరుచూరి బ్రదర్స్‌ దగ్గర ఐదేళ్ల పాటు సహాయకుడిగా పనిచేసిన తర్వాత ఇండస్ట్రీలో పరిస్థితులు చూసి, తనలా తాను బతకాలని అనుకున్నానని రచయిత,

Published : 14 Feb 2022 01:06 IST

హైదరాబాద్‌: పరుచూరి బ్రదర్స్‌ దగ్గర ఐదేళ్ల పాటు సహాయకుడిగా పనిచేసిన తర్వాత ఇండస్ట్రీలో పరిస్థితులు చూసి, తనలా తాను బతకాలని అనుకున్నానని రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) అన్నారు. మోహన్‌బాబు కీలక పాత్రలో నటించిన ‘సన్నాఫ్‌ ఇండియా’ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుకలో ఆయన మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో చావు కూడా ఖరీదుగా ఉండాలన్నారు.

‘‘ఈ సినిమాలో మోహన్‌బాబు నాకు కూడా మంచి పాత్ర ఇచ్చారు. అన్నయ్య గురించి తెలియని వారు ఇండస్ట్రీలో లేరు. ఒక నటుడిగా ఎంత స్పష్టంగా డైలాగ్‌లు చెప్పగలరో.. అంతే స్వచ్ఛమైన మనసుతో మాట్లాడతారు. మీలాంటి వాళ్లు తెలుగు ఇండస్ట్రీలో గొప్ప సక్సెస్‌ అయితే, ఇండస్ట్రీకి లాభం. నటుడిగానే కాకుండా లక్ష్మీప్రసన్న పిక్చర్స్‌ బ్యానర్‌పై సంవత్సరానికి రెండు, మూడు సినిమాలు తీస్తే చాలా మందికి అన్నం పెట్టిన వారవుతారు. దేవుడికి దండం పెట్టడం చాలా ఈజీ. పేదలకు అన్నం పెట్టడం చాలా కష్టం. మీరు రెండో కేటగిరీకి చెందిన వారు. మీరు సినిమాలు తీస్తూ ఉండండి’’

‘‘మా’ ఎన్నికల్లో ఎవరూ సాధించిన రీతిలో మంచు విష్ణు విజయం సాధించాడు. అతడు ఆరడుగుల జెండా ఏమీ కాదు. పెద్ద గొప్పవాడేమీ కాదు. అతడు మామూలు మనిషి. మనిషి లక్షణాలతో పుట్టినవాడు కాబట్టే గెలిచాడు. మంచు కుటుంబం అంతా సామాన్య మనుషులు. నేను పరుచూరి బ్రదర్స్‌ దగ్గర ఐదేళ్లు అసిస్టెంట్‌గా పనిచేశా. అప్పుడు దర్శకుడు బి.గోపాల్‌ వచ్చిన తన వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరాలన్నారు. కానీ, అందుకు పరుచూరి బ్రదర్స్‌ ఒప్పుకోలేదు. వాళ్ల దగ్గర ఐదేళ్లు పనిచేసిన తర్వాత ఇండస్ట్రీని చూసి నేను ఏం నేర్చుకున్నానంటే వాళ్లలా బతకూడదని అనుకున్నా. ఇది వాస్తవం. వాళ్లు ఎలా బతకాలో తెలియని మనుషులు.’’

‘‘చాలామంది వాళ్లకు అహంకారం అనుకుంటారు. కానీ, కాదు. 20 ఏళ్లు వందల సినిమాలకు పనిచేశారు. అలాంటి వాళ్లను ఇండస్ట్రీ దూరంగా పెట్టింది. అలాగే ఆత్రేయను కూడా. ఇలా చాలామందిని చూసి, నేను ఎలా బతకాలో అలాగే బతకాలని అనుకున్నా. అలా బతకక పోతే ‘సగం జీవితం అయిపోయిన తర్వాత ఇండస్ట్రీలో కుక్కచావు ఛస్తా’ అని నాకు తెలుసు. ఇక్కడ చావు కూడా ఖరీదుగా ఉండాలి. ‘పేదరికంలో చావు పదిమందిని కూడా రానీయదు. డబ్బు చావు పదివేల మందిని తీసుకొస్తుంది’ ఆ రెండు చావుల మధ్య బతకడం ఇష్టం లేక.. నేను నా కుటుంబం దూరంగా బతుకుతున్నాం. తెలుగు సినీ పరిశ్రమ పోసానిని బహిష్కరించినా, నేను నా తర్వాతి తరాలు బతికేంత సంపాదించి కూర్చొన్నా. అది చిత్ర పరిశ్రమ వల్లే సాధ్యమైంది. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. ఇండస్ట్రీ నుంచి నేను ఏమీ ఆశించడం లేదు. ఏది వచ్చినా అది నాకు బోనస్‌’’ అని అన్నారు. ప్రస్తుతం పోసాని కామెంట్స్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని