Prabhas: ప్రభాస్‌, నేనూ ఆ హీరోయిన్‌ కోసం గొడవపడ్డాం: గోపీచంద్‌

అన్‌స్టాపబుల్‌ షోలో పాల్గొని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ప్రభాస్‌-గోపీచంద్‌. బాలకృష్ణ అడిగిన పలు ప్రశ్నలకు తమదైన శైలిలో బదులిచ్చారు.

Updated : 06 Jan 2023 13:53 IST

హైదరాబాద్‌: బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న అన్‌స్టాపబుల్‌ షోలో (Unstoppable) పాల్గొని ప్రభాస్‌-గోపీచంద్‌ తమ స్నేహబంధం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘‘2008లో మీరిద్దరూ ఓ హీరోయిన్‌ కోసం గొడవపడ్డారని విన్నాం. ఇంతకీ ఎవరా నటి?’’ అని బాలయ్య ప్రశ్నించగా.. ‘‘అవును సర్‌. కానీ 2008లో కాదు 2004లో. ‘వర్షం’ సినిమాలో త్రిష కోసం మేమిద్దరం గొడవపడ్డాం’’ అని సరదాగా బదులిచ్చాడు. గోపీచంద్‌ (Gopichand) టైమింగ్‌కు ప్రభాస్‌ ఫిదా అయ్యాడు. ‘‘మా వాడు సూపర్‌గా సమాధానం చెప్పాడు’’ అని నవ్వులు పూయించాడు. తనకు సినిమాలు చూడటం, లేదా షాపింగ్‌ చేయడం.. ఒంటరిగానే ఇష్టమని, పక్కన ఎవరున్నా నచ్చదని, కాకపోతే నయనతార, తమన్నాను మాత్రం షాపింగ్‌ తీసుకువెళ్తానని ప్రభాస్ (Prabhas) సరదాగా చెప్పాడు. ఒకవేళ దీపికా పదుకొణె, సమంత(Samantha).. ఇద్దరూ సముద్రంలో పడిపోతే తాను మొదట దీపికనే కాపాడతానని, ఆమె లేకపోతే సినిమా (ప్రాజెక్ట్‌ కె) ఆగిపోతుందని బదులిచ్చాడు.

అనంతరం.. ‘బాహుబలి’ తర్వాత తనపై ఒత్తిడి బాగా పెరిగిందన్నాడు. ‘‘బాహుబలి’ తర్వాత ఏం చేయాలి. దేశంలో అందరికీ నచ్చేలా ఎలాంటి సినిమా చేయాలి? కమర్షియల్‌ సినిమా చేయాలా? లేదా కొత్తగా ఏదైనా ప్రయత్నించాలా? ఒకవేళ అలా చేస్తే ప్రేక్షకులు స్వీకరిస్తారా? ఇలా ఎంతో గందరగోళంగా ఉండేది. ఎందుకంటే ‘బాహుబలి’తో అన్ని రాష్ట్రాల్లో మాకు డోర్స్‌ ఓపెన్‌ అయ్యాయి. ప్రేక్షకులను అలరించడం కోసం కష్టపడుతున్నా. ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది’’ అని ప్రభాస్‌ చెప్పాడు. వెంటనే గోపీచంద్‌ మాట్లాడుతూ.. ‘‘ఒత్తిడిలో ఉన్నప్పుడు అతడు వేరే ప్రపంచంలో ఉంటాడు. ఎందుకు ఇంతలా ఒత్తిడి తీసుకుంటున్నాడు అనిపిస్తుంది’’ అని అన్నాడు. ఇక ఇదే షోలో తన పెద్దనాన్నను గుర్తు చేసుకుని ప్రభాస్‌ భావోద్వేగానికి గురయ్యాడు. ‘భక్త కన్నప్ప’ చూసి తాను నటుడిగా మారాలని నిర్ణయించుకున్నానని, ఈ విషయాన్ని మొదట ప్రమోద్‌కు చెప్పానని ప్రభాస్‌ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని