Adipurush: ‘ఆదిపురుష్‌’ సినిమా మాత్రమే కాదు.. : ఓం రౌత్‌

రామాయణాన్ని ఆధారంగా చేసుకొని బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ తెరకెక్కించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆదిపురుష్‌’. ప్రభాస్‌ - కృతిసనన్‌ జంటగా నటించిన ఈసినిమా టీజర్‌ విడుదల ఆదివారం రాత్రి ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో వేడుకగా జరిగింది.

Updated : 03 Oct 2022 10:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆదిపురుష్‌’ (Adipurush). బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ (Om Raut) దీన్ని తెరకెక్కించారు. కృతిసనన్‌ (Kriti Sanon) కథానాయిక. రామాయణ ఇతిహాసాన్ని ఆధారంగా చేసుకొని రూపుదిద్దుకున్న ఈ సినిమా టీజర్‌ను ఆదివారం సాయంత్రం అయోధ్యలో విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఓం రౌత్‌ మాట్లాడుతూ.. ‘‘శ్రీరామ భక్తుడిగా నేను ఇక్కడికి వచ్చాను. అయోధ్య వేదికగా ‘ఆదిపురుష్‌’ టీజర్‌ విడుదల చేయడం అదృష్టంగా భావిస్తున్నా. ‘ఆదిపురుష్’ అనేది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. భక్తికి ప్రతీక. ఈ కథను ఒక మిషన్‌లా భావించి మేమంతా ఇష్టపడి తెరకెక్కించాం. టీజర్‌ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా. సినిమాకు మంచి ఫలితాన్ని ఇస్తారనుకుంటున్నా’’ అని అన్నారు.

‘‘శ్రీరాముడి ఆశీస్సులు తీసుకునేందుకు ఇక్కడికి వచ్చాం. రాముడి పాత్రలో నటించేందుకు మొదట ఎంతో భయపడ్డా. ప్రాజెక్ట్‌ ఓకే అనుకున్నాక మూడు రోజుల తర్వాత ఓం రౌత్‌కు ఫోన్‌ చేసి.. ప్రేక్షకులకు చేరువయ్యేలా ఈ పాత్రలో ఎలా ఒదిగిపోవాలనే విషయంపై చర్చించాను. ప్రేమ, భక్తి, భయంతో దీన్ని తెరకెక్కించాం. అంకితభావం, క్రమశిక్షణ, విశ్వాసంతో ఉండటం .. ఈ మూడు విషయాలను శ్రీరాముడి నుంచి మనం నేర్చుకోవచ్చు. శతాబ్దాలుగా మనం ఈ లక్షణాలను అనుసరించాలని చూస్తున్నాం కానీ మన వల్ల కావడం లేదు. అందుకే మనం సామాన్య మనుషులమయ్యాం. శ్రీరాముడు దేవుడు అయ్యాడు. ఆ శ్రీరాముడి కృప మాపై ఉంటుందని విశ్వసిస్తున్నా’’-ప్రభాస్‌

‘‘నవరాత్రుల వేడుకల్లో భాగంగా అయోధ్యలో మా సినిమా టీజర్‌ విడుదల చేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టులో, గొప్ప పాత్రల్లో నటించే అవకాశం అందరికీ సులభంగా దొరకదు. నా కెరీర్‌ ఆరంభంలో ఇలాంటి పాత్రలో నటించే అవకాశం వచ్చినందుకు సంతోషిస్తున్నా. సీత పాత్రలో నటించడం ఉద్వేగంగా అనిపించింది. షూటింగ్ పూర్తవుతుంటే బాధకు లోనయ్యా’’-కృతిసనన్‌

భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా, కృతిసనన్‌ సీతగా, సైఫ్‌ అలీఖాన్‌ రావణుడిగా కనిపించనున్నారు. భూషణ్‌ కుమార్‌, కృష్ణ కుమార్‌,  ఓం రౌత్‌ నిర్మాతలుగా వ్యవహరించారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని