Prabhas: మాకు థియేటరే గుడి: ‘సీతారామం’ ఈవెంట్‌లో ప్రభాస్‌

‘ఇంట్లో పూజ గది ఉందని గుడికి వెళ్లడం మానేస్తామా? లేదు కదా. అలానే కొన్ని సినిమాలను తప్పకుండా థియేటర్లలో చూడాలి. అలాంటి చిత్రమే ఈ ‘సీతారామం’’ అని ప్రముఖ నటుడు ప్రభాస్‌ అన్నారు.

Updated : 04 Aug 2022 13:26 IST

హైదరాబాద్‌: ‘ఇంట్లో పూజ గది ఉందని గుడికి వెళ్లడం మానేస్తామా? లేదు కదా. అలానే కొన్ని సినిమాలను తప్పకుండా థియేటర్లలోనే చూడాలి. అలాంటి చిత్రమే ఈ ‘సీతారామం’’ అని ప్రముఖ నటుడు ప్రభాస్‌ అన్నారు (Prabhas). ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ప్రభాస్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan), మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) జంటగా నటించిన చిత్రమిది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఈవెంట్‌ నిర్వహించింది.

ఈ సందర్భంగా ప్రభాస్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా ట్రైలర్‌ ఇంతకు ముందే చూశా. చాలా బాగుంది. దుల్కర్‌ మోస్ట్‌ హ్యాండ్‌సమ్‌ హీరో. ‘మహానటి’లో ఆయన అద్భుతంగా నటించారు. యుద్ధం, ప్రేమ నేపథ్యంలో ఇంతటి భారీ బడ్జెట్‌తో సినిమాలు చేయాలంటే అనుకున్నంత తేలిక కాదు. దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని పోయెట్రీలా తెరకెక్కించారు. ఈ చిత్రంలో సుమంత్‌ ఏ పాత్ర పోషించారో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. అశ్వినీదత్‌ గారు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉండటం మన అదృష్టం. ఇది థియేటర్‌లోనే చూడాల్సిన సినిమా. సినీ రంగంలోని వారికి థియేటరే గుడి. ఇదంతా మీరు (ప్రేక్షకులు) ఇచ్చిందే’’ అని ప్రభాస్‌ అన్నారు. 

దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ.. ‘‘ఫిల్మ్‌ మేకింగ్‌లో సలహాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ సినిమాకి ముందు వరకూ నాకు సలహాలు ఇచ్చే వారు ఎవరూ లేరు. ఈ చిత్రం ద్వారా సలహాలిచ్చే వారు నాకు దొరికారు. వీరి వల్ల దర్శకుడిగా ఓ మెట్టు ఎక్కానని అనుకుంటున్నా. ఈ సినిమా విషయంలో నేను కలిసిన మొదటి వ్యక్తి నిర్మాత స్వప్న దత్‌. ఆమె నాకెంతో భరోసానిచ్చారు. ఓ దర్శకుడిగా నన్ను తనే ఎక్కువ నమ్మారు. కథానాయకుడు రామ్‌ పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలా? అని ఆలోచిస్తున్నప్పుడూ స్వప్ననే దుల్కర్‌ని గుర్తు చేశారు. ఆయన్ను కలిసి కథ వినిపించగానే వెంటనే ఓకే అన్నారు. హీరోయిన్‌ సీత పాత్ర కోసం కొత్త నటిని తీసుకోవాలనుకున్నా. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌, స్వప్న.. మృణాల్‌ ఠాకూర్‌ పేరు చెప్పారు. ముంబయి వెళ్లి ఆమెకూ కథ వినిపించా. కీలక పాత్రలు పోషించిన సుమంత్‌, రష్మిక స్క్రిప్టు వినగానే నటించేందుకు అంగీకారం తెలిపారు’’ అని హను రాఘవపూడి వివరించారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని