MAA Elections: చిరంజీవి.. విష్ణుకు కూడా మద్దతు ఇవ్వొచ్చు: జీవిత

‘మా’ అధ్యక్ష పదవికి ప్రకాశ్‌రాజ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. తన ప్యానల్‌ సభ్యులతో కలిసి ఈ ఉదయం

Updated : 27 Sep 2021 13:10 IST

హైదరాబాద్‌: ‘మా’ అధ్యక్ష పదవికి ప్రకాశ్‌రాజ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. తన ప్యానెల్‌ సభ్యులతో కలిసి ఈ ఉదయం నామినేషన్‌ వేశారు. నామినేషన్‌ వేసిన అనంతరం ప్రకాశ్‌రాజ్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రతి విషయంలో మేం ఒక అడుగు ముందే ఉన్నాం. ఇవి ఎన్నికలు కాదు.. పోటీ మాత్రమే. గెలిపించేది.. ఓడించేది ఓటర్లే. అక్టోబర్‌ 3న మా ఎన్నికల ప్రణాళిక వెల్లడిస్తా. ‘మా’ ఎన్నికల్లో రాజకీయ జోక్యం వద్దు. సవ్యంగా దూషారోపణ చేయకుండా ఎన్నికలు జరగాలి. పవన్‌కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడు. దేశం కోసం పోరాడుతున్నారు. మంచి నాయకుడు. ఆయనకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. పవన్‌ కూడా ‘మా’ అసోసియేషన్‌ మెంబరే. ఎవరు ఏం చెప్పినా మంచి కోసమే మాట్లాడతారు. పవన్‌ చేసిన వ్యాఖ్యలు.. దానికి వచ్చే ప్రతిఫలం బట్టి ముందుకు వెళ్దాం. ప్రతి ఒక్కరిలోనూ ఆవేశం, ప్రేమ ఉంటాయి. వాళ్లని మాట్లాడనివ్వండి. ఈ ప్యానెల్‌ లక్ష్యం ‘మా’ అభ్యుదయం కోసం పనిచేయడమే. రాజకీయ వ్యాఖ్యలపై దయచేసి ఎవరూ ప్రశ్నించవద్దు’’ అని ప్రకాశ్‌రాజ్‌ అన్నారు.

చిరంజీవి ఎవరికైనా మద్దతు ఇవ్వొచ్చు: జీవిత

ఈ సందర్భంగా జనరల్‌ సెక్రటరీగా నామినేషన్‌ వేసిన జీవితా రాజశేఖర్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రకాశ్‌రాజ్ ప్యానెల్‌లో జనరల్ సెక్రటరీగా నామినేషన్ వేశా. ప్రధానమంత్రి ఎన్నికల కంటే ‘మా’ ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎన్ని వివాదాలు వచ్చిన మేమంతా ఒక్కటే కుటుంబం. చాలా ఆరోగ్యకరమైన వాతావరణంలో ఈ ఎన్నికలు జరుగుతాయని ఆశిస్తున్నా. వ్యక్తిగత ఆరోపణలతో పరిశ్రమ పరువు తీయొద్దు. పృథ్వీ ఆరోపణలు నాకు చాలా బాధ కలిగించాయి. ఆయన వ్యాఖ్యలు చిన్న పిల్లాడిలా ఉన్నాయి. ‘మా’ అనేది తలెత్తుకొని ఉండాలి. రెండు ప్యానెల్స్ గురించి మాట్లాడటం బాధగా ఉంది. ఈ ఎన్నికలను తప్పుదారి పట్టించవద్దు. ఒకొరినొకరు కించపరుచుకోకుండా ఎన్నికలు సజావుగా జరగాలి. సినీ పరిశ్రమలో రెండు గ్రూపులు ఎందుకు ఉండకూడదు. ఎన్నికల్లో పోటీతత్వమే తప్ప శత్రుత్వం లేదు. మాటలతో కాదు చేతలతో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ప్రకాశ్‌రాజ్ మా ఎన్నికలకు పక్కా ప్రణాళిక తయారుచేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. చిరంజీవిగారు మద్దతు ప్రకాశ్‌రాజ్‌కు ఉందనడానికి మా దగ్గర ఆధారాలు లేవు. చిరంజీవి విష్ణుకు కూడా మద్దతు ఇవ్వొచ్చు’’ అని అన్నారు.

అధ్యక్ష అభ్యర్థిగా సీవీఎల్‌ నామినేషన్‌

మా ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా నటుడు సీవీఎల్ నర్సింహారావు నామినేషన్ దాఖలు చేశారు. మా కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు నామినేషన్ పత్రాలు సమర్పించారు.ఈ సందర్భంగా సీవీఎస్‌, ప్రకాశ్‌రాజ్‌ కొద్దిసేపు మాట్లాడుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని