నటిగా మళ్లీ తొలి అడుగులు ..

ఎన్నో సినిమాల్లో నటించినా మళ్లీ ఇప్పుడు తొలి అడుగులు వేస్తున్నట్టే ఉంది అన్నారు ప్రణీత సుభాష్‌. తెలుగు, కన్నడ, తమిళ్‌ భాషల్లో సుమారు 25 చిత్రాలు చేసిన ఆమె ఈ ఏడాది బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ నేపథ్యంలో  ప్రముఖ ఆంగ్ల మీడియాతో తాజాగా ముచ్చటించింది.

Updated : 24 Feb 2021 16:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్నో సినిమాల్లో నటించినా మళ్లీ ఇప్పుడు తొలి అడుగులు వేస్తున్నట్టే ఉంది అన్నారు ప్రణీత సుభాష్‌. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో సుమారు 25 చిత్రాలు చేసిన ఆమె ఈ ఏడాది బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ నేపథ్యంలో  ప్రముఖ ఆంగ్ల మీడియాతో తాజాగా ముచ్చటించింది. ఆ విషయాలివీ..

 ‘చిత్ర పరిశ్రమకి సంబంధించి చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. అది ఎప్పుడూ మిమ్మల్ని వినయంగా ఉండేలా చేస్తుంది.  మీరు ఎంత అనుభవం కలిగిన నటి అయినా సరే ప్రేక్షకుల ముందుకు కొత్త సినిమా (ఇతర భాషలో)తో వస్తున్నప్పుడు మళ్లీ ఓనమాలు నేర్చుకోవాల్సిందే. ప్రస్తుతం నా పరిస్థితి అదే. మరో చిత్ర పరిశ్రమకు వెళ్లడం చాలా ఆనందంగా ఉంది. కొత్త బృందం, కొత్త భాష, కొత్త స్నేహితులు అంతా కొత్తగా ఉంటుంది. నేనెప్పుడూ దేశభక్తి, ఛాలెంజింగ్‌ అనిపించే సినిమాల్లో నటించాలని కోరుకునేదాన్ని. మీరు ‘ఉరి’, ‘రాజీ’ వంటి చిత్రాలు చూసినపుడు అలాంటి వాటిలో భాగస్వామి అవ్వాలని కోరుకుంటారు. ప్రముఖుల జీవిత కథలు, వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రాల్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు నా అభినందనలు. విజయ్‌ కర్నిక్‌ (విశ్రాంత ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అధికారి), ఆయన సతీమణి మిషా సెట్‌కి రావడం, వాళ్ల నుంచి కొన్ని విషయాలు తెలుసుకోవడం కొత్త అనుభూతినిచ్చింది. ఇటీవలే వచ్చిన ‘గుంజన్‌ సక్సేనా’ బయోపిక్‌పై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వాటిని దృష్టిని పెట్టుకుని ‘భుజ్‌’ చిత్రానికి అలాంటి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. విశ్రాంత ఎయిర్‌ ఫోర్స్‌ అధికారుల సలహాలు, సూచనలతో ముందుకెళ్లాం. వాస్తవాన్నే చూపించబోతున్నాం. రెగ్యులర్‌ మసాలా  ఉండదు. ఇతర చిత్రాల్లోలాగా హీరో సైనికుడు అయినా స్విట్జర్లాండ్‌లో ఓ పాట పాడుకున్నట్టు ఇందులో ఉండదు’ అని వివరించారు ప్రణీత. 

అందరిలానే నేనూ ‘బాహుబలి’ చిత్రానికి ఫిదా అయ్యాను. ప్రభాస్‌, రాజమౌళితో సినిమా చేయాలని ఆశిస్తున్నాను. ఇది నా ఒక్కదాని కోరికే కాదు నటీనటులందరిది.

1971 ఇండో-పాక్‌ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘భుజ్‌’ చిత్రంతో హిందీ పరిశ్రమకు పరిచయమవుతున్నారు ప్రణీత. అజయ్‌ దేవగణ్‌, సంజయ్ దత్‌, సోనాక్షి సిన్హా, నోరా ఫతేహి ప్రధాన తారాగణం. అభిషేక్‌ దర్శకుడు. ఈ చిత్రంతోపాటు ‘హంగామా 2’ అనే మరో హిందీ చిత్రంలోనూ నటిస్తోంది ప్రణీత. 2003లో విడుదలై ఘన విజయం అందుకున్న ‘హంగామా’ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతుంది. ప్రియదర్శన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని