Naatu Naatu: గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు వచ్చిందని తెలియగానే గంటన్నర పాటు ఏడ్చా: ప్రేమ్‌ రక్షిత్‌

Naatu Naatu song: నాటు నాటు సాంగ్‌కు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు వచ్చిన సందర్భంగా కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌ పంచుకున్న విశేషాలు..

Published : 16 Jan 2023 15:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎన్టీఆర్‌ (NTR), రామ్‌చరణ్‌ (Ramcharan) కథానాయకులుగా రాజమౌళి (Rajmouli) తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘RRR’ గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా యువతను ఓ ఊపు ఊపేసిన ‘నాటు నాటు’ పాటకుగానూ ఈ అవార్డు దక్కింది. ఈ పాటకు అవార్డు వచ్చిందని తెలియగానే తన మైండ్‌ బ్లాంక్‌ అయిపోయిందని, కన్నీళ్లు ఆగలేదని డ్యాన్స్‌ మాస్టర్‌ ప్రేమ్‌ రక్షిత్‌ భావోద్వేగానికి గురయ్యారు.

ఈ సందర్భంగా ఓ ఆంగ్లమీడియాతో తను అనుభావాన్ని పంచుకున్నారు. ‘‘నాటు నాటు’కు అవార్డు వచ్చిందని చెప్పగానే నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కన్నీళ్లు ఆపుకోలేకపోయా. వాష్‌రూమ్‌లోకి వెళ్లి గంటసేపు ఏడ్చా. ఎందుకంటే అది దాదాపు అసాధ్యమనేది నా భావన. కానీ, జరిగింది. పనిపట్ల రాజమౌళి సర్‌కు ఉన్న నిబద్ధతే అందుకు కారణం. ఆ తర్వాత నా ఆనందానికి అవధుల్లేవు. ఇదంతా ఇద్దరు హీరోల వల్ల జరిగింది. జూనియర్‌ ఎన్టీఆర్‌ అన్నయ్య, చరణ్‌ సర్‌ ఇద్దరూ అద్భుతమైన డ్యాన్సర్లు. కీరవాణిగారి సంగీతం ఈ పాటకు మరింత బలాన్ని ఇచ్చింది. ‘నాటు నాటు’ పాట ఎలా ఉండాలి? ఆ పాట థీమ్‌ ఎలా ఉంటుంది? కాన్సెప్ట్‌ ఇతర విషయాలను రాజమౌళి సర్‌ చెప్పారు’’ అని ప్రేమ్‌ రక్షిత్‌ తెలిపారు. 

ఈ పాట కోసం కథానాయకులతో పాటు, ఇతర ఆర్టిస్టులు కూడా 20 రోజుల పాటు సాధన చేశారు. నాటు నాటు స్టెప్‌ కోసం ప్రేమ్‌ రెండు నెలల పాటు వివిధ డ్యాన్స్‌ కంపోజిషన్స్‌ చేశారు. ‘‘పాట షూటింగ్‌కు వెళ్లిన తర్వాత నటులెవరూ ఒక్కసారి కూడా విరామం తీసుకోలేదు. ఎందుకంటే ఇది హై ఎనర్జీ సాంగ్‌. ఆ టెంపో మళ్లీ రాదని వాళ్ల ఉద్దేశం. చరణ్‌ సర్‌, తారక్‌ అన్నయ్య ఇద్దరూ ఎంతో నిబద్ధతతో డ్యాన్స్‌ చేశారు. నేను చెప్పింది చెప్పినట్లు చేసుకుంటూ వెళ్లిపోయేవారు. పేకప్‌ చెప్పగానే రాజమౌళి సర్‌ కూడా మాతో కలిసి రిహార్సల్‌లో పాల్గొనేవారు. పాట షూట్‌ జరిగిననన్ని రోజు మేమంతా ఉదయం 6గంటల నుంచి రాత్రి 10గంటల వరకూ నిరంతరం పనిచేసేవాళ్లం’’

‘‘తారక్‌,రామ్‌చరణ్‌ల విషయానికి వస్తే, ఒకరు సింహం, మరొకరు చిరుత. కొరియోగ్రాఫర్‌ ఏం చేస్తున్నాడనే దానిపైనే వారి దృష్టి అంతా ఉండేది. అలాంటి వాళ్ల కోసం సాంగ్‌ చేస్తుండటంతో వాళ్లను దృష్టిలో పెట్టుకుని 118 డిఫరెంట్‌ స్టెప్స్‌ డిజైన్‌ చేశాం. ‘నాటు నాటు’ చెప్పగానే ఇద్దరూ ఒకే సింక్‌లో చేసుసుకుంటూ వెళ్లిపోయేవారు. అదెలా సాధ్యమయ్యేది నాకు అర్థం కాదు. మేము సున్నా నుంచి మొదలు పెడితే, దానికి వాళ్లు మెరుగులు, మెరుపులు జోడించేవారు. అవార్డు రావడం పట్ల సగటు భారతీయుడిగా నేను గర్విస్తున్నా. భారతదేశంలో మనచుట్టూనే అనేక అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గోల్డెన్‌ గ్లోబ్‌ వచ్చింది. ఇంకా గొప్ప అవార్డులు భారతీయ సినిమాలకు వస్తాయి’’  అని ప్రేమ్‌ రక్షిత్‌ చెప్పుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని