Pathaan: షారుక్‌ ‘పఠాన్‌’పై మలయాళ స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌!

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan), దీపికా పదుకొణె (Deepika Padukone) కీలక పాత్రల్లో నటించిన సినిమా పఠాన్‌ (Pathaan).  ఈ చిత్రం బాలీవుడ్‌ను మలుపు తిప్పుతుందని మలయాళ నటుడు  పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.  

Updated : 16 Dec 2022 16:22 IST

హైదరాబాద్‌: ‘భేషరమ్‌ రంగ్‌..’ పాటతో విమర్శల సుడిలో చిక్కుకున్న షారుక్‌ ఖాన్‌ (Shahrukh Khan) ‘పఠాన్‌’ (Pathaan) సినిమాపై మలయాళ స్టార్‌ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన పృథ్వీరాజ్‌ బాలీవుడ్‌ సినిమాలపై, అందులోనూ ‘పఠాన్‌’న్‌పై కొన్ని కామెంట్స్‌ చేశాడు. బాలీవుడ్‌ ప్రస్తుత పరిస్థితి గురించి మాట్లాడిన ఆయన.. ఈ పరిస్థితికి త్వరలో ముగింపు పడే అవకాశం ఉందని చెప్పాడు. దీంతో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. 

‘‘బాలీవుడ్‌లో ఈ సంవత్సరం వచ్చిన సినిమాలు సినీ ప్రియులను ఆకట్టుకోకపోవచ్చు. కానీ, ఇది ఒక దశ మాత్రమే. ఒక పెద్ద హిట్‌తో బాలీవుడ్‌ మలుపు తిరుగుతుంది. బహుశ అది ‘పఠాన్‌’ అవ్వొచ్చు’’ అని తన అభిప్రాయాన్ని తెలిపాడు పృథ్వీరాజ్‌. పృథ్వీరాజ్ ఇప్పటికే కొన్ని హిందీ  సినిమాల్లో కనిపించి అలరించాడు. అక్షయ్‌కుమార్‌ (Akshay Kumar), టైగర్‌ ష్రాఫ్‌ (Tiger Shroff) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘బడే మియా ఛోటే మియా’ (Bade Miyan Chote Miyan) చిత్రంలోనూ నటించనున్నాడు.

మరోవైపు ‘బేషరమ్‌ రంగ్‌...’ పాటతో ‘పఠాన్‌’ వార్తల్లో నిలిచింది. ఆ పాటలో దీపిక పదుకొణె వస్త్రధారణ విషయంలో వివిధ వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. దీనిపై సినిమా బృందం కూడా గట్టిగానే స్పందిస్తోంది. సిదార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించిన ‘పఠాన్‌’ సినిమా పూర్తి స్థాయి యాక్షన్‌ చిత్రంగా రానుంది. సుదీర్ఘ విరామం తర్వాత షారుక్‌  నుంచి సినిమా వస్తుండటంతో ప్రేక్షకులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాను జనవరి 25న విడుదల చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని