Published : 27 Jul 2021 20:46 IST

Ishq: రొమాంటిక్‌ థ్రిల్లర్‌.. కానీ అలాంటివేం ఉండవు: ప్రియాప్రకాశ్‌ వారియర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: తీవ్రమైన పోటీ నెలకొన్న సినిమా ప్రపంచంలో ప్రేక్షకుల మనసు గెలుచుకోవడం అంత సులభమైన పని కాదు. అలాంటి కేవలం ఒకేఒక్క వీడియో.. అది కూడా సినిమాల్లోకి రాకముందే.. అలా కన్నుగీటి ఇలా అందరి మనసు కొల్లగొట్టింది మలయాళీ చిన్నది ప్రియాప్రకాశ్ వారియర్‌. దాదాపు మూడేళ్ల క్రితం ఓ సంచలనం సృష్టించి ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారిన ఆమె తెలుగు ప్రేక్షకుల మనసూ దోచేసుకుంది. ఇప్పటికే నితిన్‌తో కలిసి ‘చెక్‌’లో కనిపించిన ఆమె ఈసారి ఫుల్‌లెంగ్త్‌ పాత్రలో అలరించేందుకు సిద్ధమైంది. తేజా సజ్జ హీరోగా ఎస్‌.ఎస్‌.రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇష్క్‌’ చిత్రంలో ఆమె నటించింది. ఆ సినిమా జూలై 30న విడుదల కానుంది. ఈనేపథ్యంలో ఆమె మీడియాతో ముచ్చటించిన ఆమె ఈ చిత్రంతో అందర్నీ మెప్పిస్తానని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇంకా ఆమె ఏ విషయాలు పంచుకుందంటే..

ఈ ప్రాజెక్టు ఎలా కుదిరింది..?

‘ఇష్క్‌’ సినిమా అనుకోకుండా కుదిరిన ప్రాజెక్టు. ఏదైనా సినిమా చేయాలంటే ఎన్నోరోజులు ఆలోచిస్తాం. చాలా మీటింగ్స్‌ తర్వాత చేయాలా వద్దా అనే నిర్ణయానికి వస్తాం. కానీ.. అందుకు భిన్నంగా ఈ సినిమా కథ చెప్పగానే నేను ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే నేను మలయాళం ‘ఇష్క్‌’ చూశాను. ఆ సినిమా నాకు బాగా నచ్చింది. నాకింకా గుర్తుంది సినిమా ఓకే చెప్పిన తర్వాత రెండ్రోజుల్లోనే షూటింగ్‌లో పాల్గొన్నాను. అందుకే అనుకోకుండా కుదిరిన ప్రాజెక్టు అని చెప్పాను.

సినిమా కోసం ఎలా సన్నద్ధమయ్యారు..?

ప్రత్యేకంగా సన్నద్ధమవ్వడం ఏం లేదు. మలయాళం సినిమా చూశాను.. అయితే అక్కడ చేసినట్లుగానే ఇక్కడ చేస్తే కుదరదు. కానీ ఇక్కడ తెలుగు ప్రేక్షకులను నచ్చేలా.. డైరెక్టర్‌ స్క్రిప్టు ప్రకారం నడుచుకోవాలి. వాళ్ల కోరిక మేరకు నటించాలి. మలయాళం మాతృకతో సంబంధం లేకుండా మీ శైలిలో నటించమని డైరెక్టర్‌ నాకు చెప్పారు. నేను కూడా అదే చేశాను.

టాలీవుడ్‌ గురించి ఏం చెప్తారు..?

టాలీవుడ్‌ ఫలానా అని నిర్వచించలేను. నాకు ఇక్కడ మంచి ఆదరణ ఉంది. కొన్నేళ్లుగా ఇక్కడి ప్రేక్షకులు నన్ను ప్రేమిస్తున్నారు. అయితే.. మలయాళంతో పోల్చితే తెలుగు ప్రేక్షకులు అభిరుచి భిన్నంగా ఉంటుంది. అక్కడ మంచి కంటెంట్‌ ఉంటే సరిపోతుంది. కానీ.. ఇక్కడ మంచి ఫీల్‌గుడ్‌ సాంగ్స్‌తో పాటు ఫైట్స్‌, కమెర్షియల్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ను ఎక్కువగా ఇష్టపడతారు. ఏదేమైనా ప్రేక్షకులంతా వినోదాన్నే కోరుకుంటారు. మేం కూడా సాధ్యమైనంత వినోదం పంచేందుకు కష్టపడతాం. ప్రతిసారి కంటెంట్‌ మీదే దృష్టిపెట్టకుండా కొన్నిసార్లు కమర్షియల్‌ సినిమాలు కూడా చేయాల్సి ఉంటుంది. నా విషయంలో చెప్పాలంటే హైదరాబాద్‌ నాకు రెండో ఇల్లులాంటిది. 

కంటెంట్‌, కమర్షియల్‌  సినిమా ఏదైనా అన్ని సినిమాలను మనం చూడాలని కోరుకుంటాం. రెండు సినిమాల్లో మంచి సమతూకం అవసరం. కమర్షియల్‌ చేయాలని నాకూ ఉంటుంది. కొన్ని సార్లు హీరోయిన్‌ ఓరియంటెడ్‌ సినిమాలు చేయాలని కూడా అనిపిస్తుంటుంది.

‘చెక్‌’ సినిమాలో నేను చేసిన పాత్ర చాలా చిన్నది. నేను 20 నిమిషాల కంటే తక్కువే కనిపిస్తాను. ‘ఇష్క్‌’లో మాత్రం సినిమా మొత్తం ఉంటాను. అందుకే ఈ సినిమా నాకు తెలుగులో మంచి గుర్తింపు తీసుకొస్తుందని ఆశిస్తున్నాను.

ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది..?

ఇది ఒక రొమాంటిక్‌ థ్రిల్లర్‌. హీరోహీరోయిన్లు ప్రేమలో పడటం.. తర్వాత సమస్యలు రావడం.. వాటిని పరిష్కారం చేయడం.. డ్యూయెట్‌ పాటలు.. ఇలాంటివేమీ ఈ సినిమాలో ఉండవు. ప్రతి ఒక్కరికీ సంబంధించిన సినిమా ఇది. ప్రత్యేకంగా యూత్‌కు. ఇదొక భిన్నమైన చిత్రం. మలయాళంలో వచ్చిన సినిమాకు ‘ఇష్క్‌’కు కథ ఎలాంటి మార్పు లేదు. కాకపోతే కొన్ని మేకింగ్‌, టెక్నికల్‌ మార్పులు చేశాం.

మలయాళంలో తెరంగేట్రం చేశారు. కానీ అక్కడి కంటే ఎక్కువగా తెలుగులోనే సినిమాలు చేస్తున్నారు..?

ప్రస్తుతం తెలుగులో నాకు మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఇక్కడ ప్రేక్షకులను అలరించాలని అనుకుంటున్నాను. ఒకవేళ మలయాళంలో సినిమా అవకాశాలు వస్తే అక్కడికి వెళ్లిపోతానేమో. తెలుగు కొంచెంకొంచెం నేర్చుకుంటున్నాను. మాట్లాడుతుంటే అర్థమవుతుంది. ఇంకో రెండు సినిమాలు చేస్తే మాట్లాడటం మొదలుపెడతా.

దేని ఆధారంగా సినిమా ఒప్పుకొంటారు..?

కచ్చితంగా కథ. మంచి కథతో పాటు నా పాత్రకు ప్రాధాన్యత ఉంటే సినిమా చేస్తా. సినిమాపై నా పాత్ర ప్రభావం చూపిస్తుందనిపిస్తే కచ్చితంగా సినిమా చేసేందుకు ఒప్పేసుకుంటా.

* తేజ గురించి మీకే ఎక్కువగా తెలుసు. చాలా ఉల్లాసంగా, సరదాగా ఉంటాడు. అందరితో మాట్లాడుతూ నవ్వులు పూయిస్తాడు. నేను తెలుగు నేర్చుకోవడానికి చాలా సహాయపడ్డాడు. డైరెక్టర్‌ రాజుగారితో చాలా సౌకర్యంగా ఉంటుంది. ఆయనది చాలా సున్నితమైన మనస్తత్వం.

 వైరల్‌ వీడియో గురించి...?

ఎప్పుడు ఏం జరగాలని ఉంటే అది జరుగుతుంది. ఆ సంఘటన తర్వాతే నాకు చాలా అవకాశాలు వచ్చాయి. ఆ సమయంలో నేను చదువుతున్న కారణంగా చాలా సినిమాలను వదులుకోవాల్సి వచ్చింది దాని గురించి బాధపడుతూ కూర్చుంటే ముందుకు వెళ్లలేం కదా. నేను గతేడాది బి.కామ్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాను. ఇక నుంచి సినిమాల మీదే దృష్టిపెట్టాలని నిర్ణయించుకున్నాను.

తెలుగులో ఇంకో సినిమా చేస్తున్నాను. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాం. హిందీలో రెండు సినిమాలు చేస్తున్నా. మలయాళంలో సినిమాలేమీ చేయడం లేదు. మంచి కథ వస్తే చేద్దామని చూస్తున్నా.
Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని