Priya Prakash Varrier: ‘వైరల్‌ వింక్‌’ ఐడియా నాదే అన్న ప్రియా వారియర్‌.. తిప్పికొట్టిన దర్శకుడు

‘ఓరు అదార్‌ లవ్‌’ (Oru Adaar Love) సినిమాలోని వైరల్‌ వింక్‌పై ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ (Priya Prakash Varrier) చేసిన వ్యాఖ్యలను దర్శకుడు ఓమర్‌ తప్పుబట్టారు.

Published : 07 Jun 2023 14:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కన్నుగీటడం (వైరల్‌ వింక్‌)తో ఓవర్‌నైట్‌లో స్టారైన మలయాళీ బ్యూటీ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ (Priya Prakash Varrier). 2019లో విడుదలైన ‘ఓరు అదార్‌ లవ్‌’ (Oru Adaar Love)లో ఆమె హీరోని చూస్తూ కన్నుగీటిన సీన్‌ అప్పట్లో సెన్సేషన్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే, కన్నుగీటే ఐడియా తనదేనంటూ ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల క్రితం ఏం జరిగిందో ఆమె మర్చిపోయినట్లుందని మండిపడ్డారు. ఉన్నట్టుండి ‘వైరల్‌ వింక్‌’ చర్చకు రావడానికి కారణం ఏమిటంటే..!

నటి మమతా మోహన్‌దాస్‌తో కలిసి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ (Priya Prakash Varrier) ఇటీవల ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులోని ఓ సెగ్మెంట్‌లో తనకి పాపులారిటీ తెచ్చిపెట్టిన వైరల్‌ వింక్‌ను ప్రియా చేసి చూపించారు. అనంతరం.. కన్నుగీటే ఐడియా తనదేనని చెప్పారు. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన ‘ఓరు అదార్‌ లవ్‌’ దర్శకుడు ఓమర్‌ లూలూ ఫేస్‌బుక్‌ వేదికగా ఆమెపై మండిపడ్డారు.

‘‘పిచ్చిపిల్ల.. ఐదేళ్ల క్రితం ఏం జరిగిందో పాపం మర్చిపోయినట్టుంది. వలియ చందనాది.. జ్ఞాపకశక్తి మెరుగుపడటానికి ఈ తైలం బాగా ఉపయోగపడుతుంది’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అంతేకాకుండా వైరల్‌ వింక్‌ ఐడియా తన సహనటుడు రోషన్‌దేనని ‘ఓరు అదార్‌ లవ్‌’ ప్రమోషన్స్‌లో ప్రియా చెప్పిన ఓ వీడియోను ఈ పోస్ట్‌కు యాడ్‌ చేశారు. ‘‘రోషన్‌ ఎంతో సరదాగా ఉంటాడు. అతడు తరచూ కన్నుబొమ్మలు పైకెత్తి ఆటపట్టించేవాడు. అది మా టీమ్‌కు బాగా నచ్చింది. అందుకే, నన్నూ అలాగే చేయమన్నారు. అనంతరం, కన్నుగీటడం కూడా చేస్తే బాగుంటుందని సూచించారు. వాళ్లు చెప్పినట్టు చేశాను. అది బాగా పాపులర్‌ అయ్యింది’’ అని ఆ వీడియోలో ప్రియా వివరించారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని