Bigg Boss 5: ‘బిగ్‌బాస్‌’కొచ్చి అలాంటి పనులెందుకు చేస్తా.. మానస్‌ అలా అంటాడనుకోలేదు!

గ్‌బాస్‌ సీజన్‌-5(bigg boss telugu 5) విన్నర్‌ అవ్వాలనుకున్నానని, కనీసం టాప్‌-5లో కూడా లేనందుకు తాను చాలా బాధపడుతున్నానని

Published : 06 Dec 2021 17:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బిగ్‌బాస్‌ సీజన్‌-5(bigg boss telugu 5) విన్నర్‌ అవ్వాలనుకున్నానని, కనీసం టాప్‌-5లో కూడా లేనందుకు తాను చాలా బాధపడుతున్నానని నటి ప్రియాంక సింగ్‌(Priyanka singh) అన్నారు. 91 రోజులు పాటు హౌస్‌లో ఉన్న ఆమె ఆదివారం ఎలిమినేట్‌ అయి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడారు. బిగ్‌బాస్‌ గేమ్‌, హౌస్‌మేట్స్‌ గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. మానస్‌ తప్పకుండా విన్నర్‌ అవుతాడని చెప్పుకొచ్చింది.

మానస్‌ నుంచి అదే ఆశించా!

‘పింకీ బిగ్‌బాస్‌ టైటిల్‌ కోసం వచ్చిందా? మానస్‌ మనసు గెలుచుకోవడానికి వచ్చిందా’ అని అడగ్గా, ‘బిగ్‌బాస్‌ ట్రోఫీ కోసమే వెళ్లా. చాలా మందికి స్ఫూర్తిగా నిలవాలనుకున్నా. అది నా కల. ఇక్కడ వరకూ ప్రయాణం సాగించినందుకు సంతోషంగా ఉంది’ అని సమాధానం ఇచ్చారు. సరైన కారణాలు చెప్పకుండా నామినేట్‌ చేస్తే కోపం వచ్చేదని, కెప్టెన్‌ కానందుకు ఇప్పటికీ బాధపడుతున్నట్లు చెప్పారు. మానస్‌ నుంచి కేవలం ఫ్రెండ్‌షిప్‌నే ఆశిస్తున్నట్లు పింకీ తెలిపారు. (మధ్యలో మానస్‌-కాజల్‌ మాట్లాడుకుంటూ ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ కోసం ప్రియాంక సన్నీకి దగ్గర అయ్యేందుకు ప్రయత్నించిందని, సేఫ్‌ గేమ్‌ ఆడుతోందని చెబుతున్న వీడియోలను చూపించారు)

‘‘నా ఎక్స్‌ బాయ్‌ ఫ్రెండ్‌ స్థానంలో మానస్‌ను పెట్టాలనుకోవడం సరైనది కాదు. అలాంటిదేమీ లేదని చెప్పా. ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ కోసం సన్నీతో స్నేహంగా ఉండలేదు. మానస్‌ అలా అంటాడని నేను అస్సలు అనుకోలేదు. నేనెప్పుడూ సేఫ్‌ గేమ్‌ ఆడలేదు. 13వారాల పాటు ఎవరైనా సేఫ్‌ గేమ్‌ ఆడగలరా? అలా ఆడితే ప్రేక్షకులు నన్ను హౌస్‌లో ఉంచేవారా? మానస్‌-కాజల్‌కు నేను ఒక టాపిక్‌ అయ్యానంటే చాలా బాధగా ఉంది. మానస్‌ నన్ను అర్థం చేసుకున్నది అంతేనా? నాపై ఇంత నెగెటివిటీ ఉందా? నేను మానస్‌ కోసం హౌస్‌కు రాలేదు. బిగ్‌బాస్‌ గేమ్‌కోసం వచ్చా. అతడి కోసం, అతడి ప్రేమ కోసం నన్ను నేను గాయపరుచుకుంటాననడం బాగోలేదు. ఇంత పెద్ద వేదిక మీదకు వచ్చి అలాంటి పనులెందుకు చేస్తా. ఎప్పుడో లైఫ్‌లో ఏదో జరిగింది కదాని, మళ్లీ అవే పనులు చేస్తానని ఎలా అనుకుంటారు. ఇలాంటి విషయాల్లో చాలా సీరియస్‌గా ఉంటా. ఆ విషయం మానస్‌కు తెలుసనుకున్నా. ఒక స్నేహితుడిగా మానస్‌ అంటే ఇష్టం. అంతకుమించి అతనిపై ఎలాంటి ఫీలింగ్స్‌ లేవు’’ అని ప్రియాంక చెప్పుకొచ్చారు.

ప్రతివారం భయపడుతూనే ఉండేదాన్ని

‘‘బిగ్‌బాస్‌ హౌస్‌లో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ముఖ్యంగా నాన్నగారి నుంచి వీడియో రావటం,  నేను ట్రాన్స్‌జెండర్‌గా మారడాన్ని ఆయన అంగీకరించటం సంతోషంగా అనిపించింది. బయటకు వెళ్లగానే నాన్నను కలుస్తా. బిగ్‌బాస్‌లో నాకు బాగా దగ్గరైన వ్యక్తులు సిరి, మానస్‌, సన్నీ. ఈసారి టైటిల్‌ను అవకాశం మానస్‌కు ఎక్కువగా ఉందని అనుకుంటున్నా. నామినేట్‌ అయిన తర్వాత ప్రతి వారం భయపడుతూ ఉండేదాన్ని. బిగ్‌బాస్‌ అంటే ఒక పాఠం. ప్రతిదీ నేర్చుకోవచ్చు. ‘హౌస్‌లో ఇలా ఉంటే బాగుండేదేమో’ అని బయటకు వచ్చిన తర్వాత అనిపిస్తోంది. నాకు హార్మోన్‌ అసమతౌల్యం వల్ల త్వరగా కోపం వచ్చేస్తుంది. అప్పటికప్పుడే ఏడ్చేస్తా. మళ్లీ వెంటనే కోపం తగ్గిపోతుంది’’

హౌస్‌మేట్స్‌ గురించి ప్రియాంక అభిప్రాయం

ప్రస్తుతం హౌస్‌లో ఉన్నవాళ్లలో మీ అభిప్రాయం ఏంటి? అన అడగ్గా ప్రియాంక ఇలా చెప్పుకొచ్చారు..

సన్నీ: సన్నీ ఈజ్‌ ఫన్నీ. ఇప్పుడిప్పుడే మా మధ్య అన్నాచెల్లెళ్ల బంధం బలపడుతోంది. టాస్క్‌ల విషయంలో తను చేయాల్సింది చేస్తాడు. త్వరగా కోపం వచ్చేస్తుంది. అయితే, అది ఎక్కువ సేపు ఉండదు. చాలా మంచివాడు. సన్నీకి ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డా. అయితే, నాకోసం అది ఉపయోగిస్తాడని నేనెప్పుడూ అనుకోలేదు. ఆశించలేదు. ఇతరులతో ఏం జరిగినా మర్చిపోయి కలిసిపోతాడు. కోపం తగ్గించుకుంటే బాగుంటుంది.

కాజల్‌: మానస్‌కు, నాకూ గొడవ అయితే, కాజల్‌ సర్దిచెప్పేది. వందలో 90మందికి ఆమె అంటే నచ్చదు. చిన్న గొడవను కూడా సాగదీస్తుంది. ప్లేయర్‌గా తను పర్‌ఫెక్ట్‌.

షణ్ముఖ్‌: మొదట్లో మా ఇద్దరి మధ్య అంత అనుబంధం లేదు. నామినేట్‌ చేస్తే మాత్రం కోప్పడేదాన్ని. సైలెంట్‌ కిల్లర్‌. సిరి-షణ్ముఖ్‌లు మంచిస్నేహితులు. ఒకరినొకరు అర్థం చేసుకున్నారు.

సిరి: చాలా మంచిది. ఈమెను చూస్తే నా చెల్లెలిని చూసినట్లు అనిపిస్తుంది. టాస్క్‌ల్లో ఉంటే చంద్రముఖి అయిపోతుంది. అయిన తర్వాత కూడా చాలా సేపటి వరకూ ఆ మూడ్‌నుంచి బయటకు రాదు.

మానస్‌: మంచి వ్యక్తి. నన్ను అర్థం చేసుకుని ఉంటే బాగుండేది. అపార్థం చేసుకుంటున్నాడని బయటకు వచ్చి వీడియోలు చూసే వరకూ తెలియదు. అప్పుడే చెప్పి ఉంటే, ఇంతవరకూ తెచ్చుకునేదాన్ని కాదు. వీడియోలు చూసిన తర్వాత మానస్‌పై నా అభిప్రాయం ఏంటంటే, ఎవరినైనా ఈజీగా చదివి పక్కన పెడతాడు. అంటే ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. మానస్‌ నా వెనుక అన్నమాటలు చూస్తే చాలా బాధగా అనిపిస్తోంది. నాకు పిల్లలుంటే ఎలా చూసుకునేదాన్నో మానస్‌ను అలాగే చూశా. అంతేకానీ వేరే ఉద్దేశం లేదు.

Read latest Cinema News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని