Priyanka Chopra: షూటింగ్‌లో గాయపడిన స్టార్‌ హీరోయిన్‌.. వీడియో విడుదల

‘ది బ్లఫ్‌’ చిత్రీకరణలో పాల్గొన్న నటి ప్రియాంక చోప్రా గాయపడ్డారు.

Updated : 20 Jun 2024 16:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) గాయపడ్డారు. ఆమె కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ది బ్లఫ్‌’ (The Bluff). ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఆస్ట్రేలియాలో జరుగుతోంది. షూటింగ్‌లో భాగంగా గాయపడినట్లు ప్రియాంక స్వయంగా వెల్లడించింది. ఆమె గాయాలతో ఉన్న ఫొటోలను ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేసుకున్నారు. ‘వృత్తి జీవితంలో ఎదురయ్యే ప్రమాదాలు’ అంటూ గాయపడిన ఫొటోలను ప్రియాంక పంచుకుంది. ముఖం, మెడ, పెదవిపై గాయాలైనట్లు ఫొటోలు చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం ప్రియాంక బాగానే ఉన్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే, ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై స్పష్టత లేదు. ప్రియాంక గాయపడిన వెంటనే చిత్ర బృందం షూటింగ్‌ను నిలిపివేసింది. అనంతరం ఆమెను సిడ్నీకి తరలించగా, అక్కడే ఆమె చికిత్స పొందారు. ప్రస్తుతం ప్రియాంక విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం.

‘ది బ్లఫ్’ చిత్రాన్ని ఫ్రాంక్‌ ఇ.ఫ్లవర్‌ తెరెక్కిస్తున్నారు. ‘అవెంజర్స్‌’లాంటి భారీ చిత్రాలను రూపొందించిన రుస్సో బ్రదర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్తి యాక్షన్ మూవీగా ‘ది బ్లఫ్‌’ రూపొందుతోంది. నిపుణుల పర్యవేక్షణలో ముఖ్యంగా యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రియాంక గాయపడినట్లు తెలుస్తోంది. ఈ మూవీతో పాటు ‘హెడ్స్‌ ఆఫ్‌ స్టేట్‌’ అనే మరో యాక్షన్‌ కామెడీ ఫిల్మ్‌లోనూ ప్రియాంక నటిస్తోంది. ఆ సినిమా చిత్రీకరణ తర్వాత కొంత విరామం తీసుకోవాలని అనుకుంది. అయితే, అప్పటికే ‘ది బ్లఫ్‌’ మూవీకి కాల్షీట్స్‌ కేటాయించడంతో వెంటనే షూటింగ్‌లో పాల్గొనాల్సి వచ్చింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని